పోలీస్ బాస్‌పై కన్నెర్ర!
సాక్షి ప్రతినిధి, కడప:
జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీపై అధికార పార్టీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరించడంలేదని పాలక పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. తమను చట్టానికి అతీతులుగా చూడాలనే దృక్పధంతో ఉన్నారు. తాము చెప్పినట్లు వినే అధికారే జిల్లాకు కావాలని పట్టుబడుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అధికారంలోకి వచ్చిన తమకు ఆ ప్రత్యేకత కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పనుల నిమిత్తం జిల్లా ఎస్పీ 15రోజులు సెలవులో వెళ్లినట్లు సమాచారం.
జిల్లా ఎస్పీ చట్టాన్ని పరిరక్షించడం, నిష్పక్షపాతంగా వ్యవహరించడం అధికార పార్టీ నేతలకు రుచించడం లేదు. అడపాపదడపా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా... అలా కాదు.. ప్రతి చర్యలో ప్రత్యేకత ఉండాలని తెలుగుతమ్ముళ్లు ఆశిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా ఎస్పీకి మింగుడు పడటం లేదు. సాధ్యమైనంత మేరకు అధికారపార్టీ నేతల పెత్తనాన్ని భరిస్తూ పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకు చట్టానికి విరుద్ధంగా విపక్ష ఎమ్మెల్యే తనయులపై రౌడీషీట్లు తెరిచారు. అనేక కేసుల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నా చూసీచూడనట్లు వెళుతున్నారు. అయినా తెలుగుతమ్ముళ్లు గుర్రుగానే ఉన్నారు.
రాజ్యమేలుతున్న మట్కా....
పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు డివిజన్లలో అధికారపార్టీ నేతల అండతో మట్కా జూదం యధేచ్ఛగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలుగా మారిన ఇరువురు మట్కా నిర్వాహకుల కనుసన్నల్లో జిల్లా వ్యాప్తంగా ఈ జూదం విస్తరిస్తోంది. కిందిస్థాయి యంత్రాంగం సహకరిస్తున్నా ఎస్పీ ఇందుకు అడ్డు తగులుతున్నట్లు సమాచారం.
ఇదివరకే జూదం నిర్వహిస్తున్న రిక్రియేషన్ క్లబ్‌లను మూసివేయించారు. పులివెందుల పరిధిలో మట్కా విషయంలోనూ టీడీపీలో వర్గపోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆపార్టీ నేతలే ఒకరి అనుచరులపై ఇంకొకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి. ఈ విషయంలో ఎస్పీ కఠిన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా కిందిస్థాయి యంత్రాంగం సహకారంతో మట్కా నిర్వాహకులు వారి పని నిరాటంకంగా సాగిస్తున్నారు.
హోంమంత్రికి ఫిర్యాదుల వెల్లువ....
హోంమంత్రి చిన రాజప్ప ఇటీవల జిల్లాలోని 8 నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ పర్యటనలో నియోజకవర్గ స్థారుు నాయకులు ఈ ఎస్పీ మాకొద్దు...మార్చండంటూ హోంమంత్రికి విన్నవించినట్లు సమాచారం. ఆ తర్వాత మరికొందరు నేతలు కూడా ఇదే విషయూన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. చట్టపరిధిలో పనిచేస్తున్న ఎస్పీ ఉండటం తమకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నట్లు ‘దేశం’శ్రేణుల వ్యవహార శైలి కనిపిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’ప్రతినిధితో అభిప్రాయపడ్డారు. వాస్తవ విషయాలు తెలుసుకుంటున్న ఎస్పీ సైతం జిల్లాలో పనిచేసేందుకు విముఖత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వ్యక్తిగత కారణాలతో 15రోజులు సెలవులో వెళ్లారు. కెనడా వెళ్లేందుకు సెలవు పెట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో పనిచేయడానికి ఎస్పీ సుముఖంగా లేరని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈలోపే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్పీని మార్పించాలనే లక్ష్యంతో దేశం శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.