Navy dockyard
-
‘రాజ్‌పుత్’కు ఘనంగా వీడ్కోలు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళానికి చెందిన మొదటి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్ సేవలు శ్లాఘనీయమని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ (ఏబీ సింగ్) కొనియాడారు. విశాఖ నేవల్ డాక్‌యార్డులో శుక్రవారం సాయంత్రం ఐఎన్ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌక డీ కమిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నౌకాదళానికి అవిశ్రాంత సేవలందించిన రాజ్‌పుత్‌కు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. సూర్యాస్తమయ సమయంలో నౌక నుంచి జాతీయ పతాకాన్ని, నేవల్ ఎన్సైన్, డీ కమిషనింగ్ పెన్నెట్ని నౌకాదళ సిబ్బంది సెల్యూట్ల మధ్య అవనతం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌పుత్ అందించిన సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పోస్టల్ కవర్ని వైస్ అడ్మిరల్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవలందించిన ముఖ్యమైన నౌకల్లో రాజ్‌పుత్ ముందువరసలో ఉంటుందని చెప్పారు. 41 సంవత్సరాల అవిశ్రాంత సేవ 1980 నుంచి 1988 వరకు పశ్చిమ నౌకాదళంలో సేవలందించిన రాజ్‌పుత్.. 1989లో తూర్పు నౌకాదళం అమ్ముల పొదిలో చేరిందని చెప్పారు. క్షిపణి ప్రయోగాలకు ప్రధాన కేంద్రంగా నిలిచిందన్నారు. 41 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నిరాటంక సేవలందించిందని చెప్పారు. 1999 ఒడిశా తుఫాన్ సమయంలోను, 2004 అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ, జకార్తాలో భూకంపం మొదలైన విపత్తుల సమయంలోను రాజ్‌పుత్ అందించిన సహాయక చర్యలు ఎనలేనివన్నారు. మొత్తం 31 మంది కమాండింగ్ అధికారులు నౌకలో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఈ నౌక మొత్తం 7,87,194 నాటికల్ మైళ్లు దూరం ప్రయాణించిందని, ఇది భూమి నుంచి చంద్రునికి మధ్య దూరానికి 3.8 రెట్లని, ప్రపంచవ్యాప్త నేవిగేషన్‌కు 36.5 రెట్లని వివరించారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ డీ కమిషన్ కార్యక్రమాన్ని కొద్దిమంది సమక్షంలో నిర్వహించారు. ఇంటర్నెట్, నావల్ ఇంట్రానెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా.. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చైర్మన్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, మాజీ కమాండింగ్ అధికారులు, కమిషనింగ్ క్రూ అధికారులు వీక్షించారు. -
నేవీ పొదిలోకి భారీ విధ్వంసక నౌక
ఐఎన్ఎస్ కొచ్చి జలప్రవేశం భారత్ దేశీయంగా తయారు చేసిన అతిపెద్ద యుద్ధనౌక ముంబై : దేశ నౌకాదళంలోకి క్షిపణి సామర్థ్యమున్న అత్యాధునిక విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ కొచ్చి చేరింది. భారత్ దేశీయంగా తయారు చేసిన అతిపెద్ద నౌక అయిన దీన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బుధవారమిక్కడి నేవీ డాక్‌యార్డ్‌లో జలప్రవేశం చేయించారు. ఆయన నౌకపై విలేకర్లతో మాట్లాడుతూ..‘ ఇది విదేశీ యుద్ధనౌక మాదిరే సమర్థంగా ఉంటుంది. దీన్ని నిర్మించిన వారికి అభినందనలు. యుద్ధనౌకలకు సంబంధించి దేశీయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాం. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను దేశీయంగా రూపొందించాల్సి ఉంది. ఈ దిశగా వచ్చే 15 ఏళ్లకు రక్షణ సామగ్రిని దేశీయంగా తయారు చేసేందుకు నేవీ ప్రణాళిక రూపొందించింది. క్షిపణి టెక్నాలజీలోనూ వచ్చే ఏదేళ్లలో దేశీయ తయారీ ఉంటుంది’ అని తెలిపారు. ఇందులో ప్రైవేటు రంగానికీ చోటు ఉంటుందన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంపై పట్టుకోసం నేవీని బలోపేతం చేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరలో ఇలాంటి మూడో, చివరి యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై రంగంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ ఆర్కే ధోవన్ తదితరులు పాల్గొన్నారు. నేవీ సామర్థ్య స్వావలంబనలో ‘కొచ్చి’ మైలురాయి అని ధోవన్ పేర్కొన్నారు. ఐఎన్ఎస్ కొచ్చి ప్రత్యేకతలు.. ఐఎన్ఎస్ కొచ్చి కోల్‌కతా తరగతి(ప్రాజెక్ట్ 15 ఏ) గెడైడ్ క్షిపణి విధ్వంసక నౌక సిరీస్‌లో రెండోది. పోర్ట్ సిటీ కొచ్చి పేరు దీనికి పెట్టారు. డిజైన్: నేవీకి చెందిన డెరైక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్. నిర్మాణం: మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్(ముంబై). బహళ నిఘా వ్యవస్థ, ప్రమాద హెచ్చరికల వ్యవస్థలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి(డీఆర్డీవో), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఆయుధ వ్యవస్థ: శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సర్లు, నిఘా పరికరాలు. 30ఎంఎం, 70 ఎంఎం గన్లు. తీరంలో, సముద్రంలో దీర్ఘ శ్రేణి లక్ష్యాలను చేధించేందుకు క్షిపణులను నిలువుగా ప్రయోగించే వ్యవస్థ.