జాతీయజెండా, నేవల్ ఎన్‌సైన్ పతాకాన్ని రాజ్‌పుత్ నుంచి అవనతం చేస్తున్న నౌకాదళాధికారులు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళానికి చెందిన మొదటి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ సేవలు శ్లాఘనీయమని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ (ఏబీ సింగ్) కొనియాడారు. విశాఖ నేవల్ డాక్‌యార్డులో శుక్రవారం సాయంత్రం ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌక డీ కమిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నౌకాదళానికి అవిశ్రాంత సేవలందించిన రాజ్‌పుత్‌కు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. సూర్యాస్తమయ సమయంలో నౌక నుంచి జాతీయ పతాకాన్ని, నేవల్ ఎన్‌సైన్, డీ కమిషనింగ్ పెన్నెట్‌ని నౌకాదళ సిబ్బంది సెల్యూట్‌ల మధ్య అవనతం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌పుత్ అందించిన సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పోస్టల్ కవర్‌ని వైస్ అడ్మిరల్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవలందించిన ముఖ్యమైన నౌకల్లో రాజ్‌పుత్ ముందువరసలో ఉంటుందని చెప్పారు.
41 సంవత్సరాల అవిశ్రాంత సేవ
1980 నుంచి 1988 వరకు పశ్చిమ నౌకాదళంలో సేవలందించిన రాజ్‌పుత్.. 1989లో తూర్పు నౌకాదళం అమ్ముల పొదిలో చేరిందని చెప్పారు. క్షిపణి ప్రయోగాలకు ప్రధాన కేంద్రంగా నిలిచిందన్నారు. 41 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నిరాటంక సేవలందించిందని చెప్పారు. 1999 ఒడిశా తుఫాన్ సమయంలోను, 2004 అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ, జకార్తాలో భూకంపం మొదలైన విపత్తుల సమయంలోను రాజ్‌పుత్ అందించిన సహాయక చర్యలు ఎనలేనివన్నారు. మొత్తం 31 మంది కమాండింగ్ అధికారులు నౌకలో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఈ నౌక మొత్తం 7,87,194 నాటికల్ మైళ్లు దూరం ప్రయాణించిందని, ఇది భూమి నుంచి చంద్రునికి మధ్య దూరానికి 3.8 రెట్లని, ప్రపంచవ్యాప్త నేవిగేషన్‌కు 36.5 రెట్లని వివరించారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ డీ కమిషన్ కార్యక్రమాన్ని కొద్దిమంది సమక్షంలో నిర్వహించారు. ఇంటర్నెట్, నావల్ ఇంట్రానెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా.. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చైర్మన్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, మాజీ కమాండింగ్ అధికారులు, కమిషనింగ్ క్రూ అధికారులు వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment