ఖతార్లో ఉరిశిక్ష పడిన వారి విడుదలకు ప్రయత్నాలు: జైశంకర్
ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జైశంకర్ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
‘ఖతార్లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారికి తెలియజేశా. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను తెలుసుకున్నాం. ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది అధికారుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని భరోసా ఇచ్చాం. ఆ విషయంలో వారి కుటుంబాలతో సమన్వయం చేసుకుంటాం’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా జైశంకర్ పేర్కొన్నారు.
Met this morning with the families of the 8 Indians detained in Qatar.
Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families.
Underlined that Government will continue to make all efforts to secure their release.…
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 30, 2023
కాగా గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్న భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది.