ఆజ్ జానే కి జిద్ న కరో!
narendrayan-14
ఇక్కడే పుట్టి పెరిగాను. అయినా ఈ నేల తనది కాదు! ఇక్కడ వేర్వేరు భాషలు మాట్లాడతారు. తన మతస్తులందరూ అక్కడ ఒకే భాష మాట్లాడతారు! అదిగో ‘స్వర్గ రాజ్యం’!
ఈ తరహా భావనలు ఎటువంటి వాస్తవాలను అనుభవంలోకి తెచ్చి ఉంటాయి? హైదరాబాద్ సంస్థానపు హోదా కోల్పోయింది. భారత యూనియన్‌లో విలీనం అవుతోంది! ఆ దశలో పాకిస్థాన్‌కు వె ళ్లాడు నిజాం రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన నవాబ్ హఫీజ్ యార్జంగ్! ఆయన తొలినాళ్ల అనుభవాలు ఆసక్తికరం! (Beyond the Full Circle అనే నవలలో సోదాహరణంగా వివరించాను)
ఇండియా నుంచి పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చిన వారి కోసం కరాచీకి సమీపంలోని నజీమాబాద్ అనే పట్టణంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్టేట్‌లో తన కేడర్ కంటే తక్కువ స్థాయి ఉద్యోగాన్ని నవాబ్ హఫీజ్ యార్‌జంగ్‌కు ఇచ్చారు. అక్కడి స్థానికులు సింధీ మాట్లాడతారు. ఇండియా నుంచి వచ్చిన శరణార్థులు మాత్రమే ఉర్దూ మాట్లాడతారు. ఈ కొత్తవాళ్లను ‘ముహాజిర్స్’ అనే పేరుతో ఈసడింపుగా చూస్తున్నారు. మహ్మద్ ప్రవక్త కూడా ముహాజిరే! తన పూర్వీకుల పట్టణం మక్కా నుంచి మదీనాకు వలస వెళ్లారు. ఒక పవిత్ర దేశాన్ని స్థాపించేందుకు ఉన్న ఊరును ఆస్తిపాస్తులను ప్రవక్త, ఆయన అనుయాయులు వదలి వేశారు! ఆ ధార్మికస్ఫూర్తితో పాకిస్థాన్ (పవిత్ర దేశం) ఏర్పడుతోందని విశ్వసించిన వారు ఆశోపహతులు కాక తప్పలేదు!
పాకిస్థాన్ సచివాలయంలో నవాబ్ హఫీజ్ ఖాన్‌ను ‘ఆ ముహాజిర్, అదే హైదరాబాద్ దక్కనీ..’ అనేవారు. సింధ్‌లో హైదరాబాదే అసలైనదని వారి ఉద్దేశం. ‘ముహాజిర్స్’లోనూ అంతరాలున్నాయి. ఉత్తరప్రదేశ్, తూర్పు పంజాబ్ నుంచి వచ్చిన వారు వీరులు! శూరులు! ఇతరుల కంటె ఒక మెట్టు పైన! ప్రథమ శ్రేణి! వీరితో పోలిస్తే హైదరాబాద్ (దక్కనీయులు) నుంచి వచ్చిన వారు తక్కువ మంది! వీరిని తక్కువగా చూసేవారు! మాట తీరును బనాయించేవారు! మంజూర్ ఖదీర్ అనే తన పై అధికారితో నవాబ్ హఫీజ్ యార్జంగ్ తొలి సంభాషణ ఇందుకు ఉదాహరణ:
మంజూర్ ఖదీర్: నీవు దేనికి నవాబువు? (హఫీజ్‌కు ఏమీ అర్థం కాలేదు. షేర్వానీ గుండీలను తడుముకున్నాడు) నీకు ఎక్కడో జాగీర్ ఉండి ఉంటుంది? ఆ జాగీర్ ఎక్కడుందో తెలుసుకుందామని!
హఫీజ్: కాస్తో కూస్తో జాగా ఉండేది, హైదరాబాద్‌లో. నవాబ్ అనే పేరు నిజాం ఇచ్చిన బిరుదు మాత్రమే!
మంజూర్: ‘ఓహో నువ్వు జమీన్ లేని జమీందారువా? ఇంగ్లండ్‌లో లార్డ్ ‘లాక్ ల్యాండ్’ అంటారే భూమిలేని ప్రభువ్వన్నమాట! (తెరలు తెరలుగా నవ్వుతూ)
హఫీజ్: ‘అవున్సార్, అలా అనుకోవచ్చు! ఢిల్లీ నుంచి లక్నోకు వలస వచ్చిన కవి మీర్ తాఖీ మీర్ ‘వైభవోజ్వల నగరి నుంచి ఇచ్చోటికి వలస వచ్చాను’ అన్నాడు కదా, నా పరిస్థితీ అదే..
మంజూర్: అవునూ, నేను మీ హైదరాబాద్ ఎప్పుడూ చూడలేదులే! నిజాం గురించి చాలా చాలా విన్నాను. అందమైన ఆడవాళ్లుంటారట!
నీలోఫర్ మరీ అందగత్తెట ? నిజాం కోడల ని విన్నాను. నిజమా?
హఫీజ్: అలా కాదు..
(నీళ్లు నములుతూ మౌనంగా ఉండిపోయాడు) అల్ హజ్రత్ (మహాప్రభువు)గా తాము భావించే నిజాంను ఇలా అంటారా? ఆయనిప్పుడు ప్రభువు కాదుకదా! లాఫింగ్ స్టాక్! తాను మాత్రం? నవాబ్ హఫీజ్ అహ్మద్ యార్జంగ్! నవాబ్ కాదు కదా కనీసం సాహెబ్ అని పిలిచేవారేరి? ఇది తన దేశం కాదు. ఇక్కడ తన భాష మాట్లాడరు. సింధీలు-బలూచియన్స్-ఫస్తూస్-పంజాబీలకు ఉర్దూ పరాయి భాష! ఇంతకీ తాను ఇక్కడకు ఎందుకు వచ్చినట్లు?!
కరాచీలో గజల్ కార్యక్రమాలుంటే తనకు ఆహ్వానాలు వచ్చేవి. ఫరీదా ఖనూమ్ (గజల్ రాణి) వంటి ఆ తరపు గాయనీమణులు ఎనభయ్యోపడిలో ఇప్పటికీ కరాచీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఓ రోజు సాయంత్రం మున్ని బేగం అనే వర ్ధమాన గాయని ఫయాజ్ హష్మీ గజల్‌ను పాడుతోంది ! హఫీజ్ అనే హైదరాబాదీ రాక్ కరిగి నీరవుతోంది... హైదరాబాద్ నుంచి వస్తోండగా తన ప్రాణసఖి సకీనా అన్నమాటలు గుర్తొస్తున్నాయి. ‘స్వర్గం ఇక్కడే ఉంది. మనం కలసి ఉన్నన్నాళ్లూ ఉంటుంది. విడిపోయామా అదృశ్యమవుతుంది. మరెక్కడకో వెళ్లి వెతక్కు’ అని హితవు పలకడం, ఆమె హైదరాబాద్‌లోనే ఆగిపోవడం, చివరి క్షణం వరకూ తననూ ఆపేందుకే ప్రయత్నించడం గుర్తొచ్చింది. ఆమె మాటల సారాంశం గజల్ రూపంలో ప్రవహిస్తోంది...
ఆజ్.. జానేకి.. జిద్.. న.. కరో
(నేడు వెళ్తానని మారాం చేయకు..)
ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి