శునకాలకు శోభనంరాత్రి
శునకాలకు శోభనం రాత్రి, ఇదేదో వింతగా అనిపించిందా? వాటికి పెళ్లి, డ్యూయెట్లు అంటే ఇంకా ఆశ్చర్యపోతారేమో! ఇవన్నీ నాయ్‌కుట్టిగళ్ చిత్రంలో వినోదం అందించడానికి రెడీ అవుతున్నాయి. టోనీ అనే మగ శునకం, జీనో అనే ఆడ శునకం హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం నాయ్‌కుట్టిగళ్. ఇందులో ప్రేమికులుగా నితిన్‌సత్య, శ్రుతిరామకృష్ణన్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఎంఎస్.భాస్కర్,ఢిల్లిగణేశ్, మహానది శంకర్, పొన్నంబళం, వాసువిక్రమ్, వైయాపురి, జయమణి, బోండామణి, కింగ్‌కాంగ్,సిజర్‌మనోహర్, అళగు,బామన్ బాలాజీ, రవిరాజ్ తదితరులు నటిస్తున్నారు. పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన ఏ.వెట్ట్రివేల్ తన వెట్ట్రివేల్ 567 మెగా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నాయ్‌కుట్టిగళ్. దీనికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని రంగా నిర్వహిస్తున్నారు.
దర్శకులు ఎస్డీ.రమేశ్సెల్వన్, చిత్తిరెసైల్వన్, ఎల్జీ.రవిచంద్రన్‌ల వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేసిన ఈయన నాయ్‌కుట్టిగళ్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం గురించి రంగా తెలుపుతూ...ప్రేక్షకులు ఒకే తరహా చిత్రాలను ఇష్టపడటం లేదన్నారు. కొత్తదనాన్ని ఆశిస్తున్నారనీ అలాంటి ఆలోచనలో నుంచి పుట్టిందే నాయ్‌కుట్టిగళ్ కథ అన్నారు. నితిన్‌సత్య టోనీ అనే కక్కును, శ్రుతిరామక్రిష్ణన్ జీనో అనే కుక్కను పెంచుకుంటారు. వాటిలో టోనీ అనూహ్యంగా తప్పిపోతుంది. దీని కోసం నితిన్‌సత్య గాలిస్తుంటే, మరో పక్క నలుగురు దొంగలు, ఇద్దరు రాజకీయనాయకులు వెతుకుతుంటారు.
వీరికి ఆ శునకంతో పనేమిటన్న పలు ఆసక్తికర అంశాల సమూహారమే చిత్ర కథ అన్నారు. ఇందులో నటించే శునకాల కోసం బక్(చెప్పినట్టు చేసే) శునకాలను చాలా ఖరీదు చేసి కొనుగోలు చేశామన్నారు. శునకాల ట్రైనర్ లారెన్స్ ఈ శునకాలకు ఏడాది పాటు శిక్షణనిచ్చారని తెలిపారు. ఇందులో శునకాలకు పెళ్లి చేసి పాటలో శోభనం రాత్రి సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయని తెలిపారు. చిత్రం ఆద్యంతం వినోదమే ప్రధానంగా సాగుతుందని దర్శకుడు చెప్పారు.