ఏసీబీకి చిక్కిన నాయుడుపేట కమిషనర్
సాక్షి, అమరావతి/ నాయుడుపేట/ నెల్లూరు క్రైం/రాజంపేట: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ అవినేని ప్రసాద్‌ను అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, నాయుడుపేట, రాజంపేటల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు.
ఈ సందర్భంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఆస్తులను పెద్దఎత్తున గుర్తించినట్టు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రసాద్ కూడబెట్టిన అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.4.17 కోట్లు ఉంటుందని, ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అవినేని ప్రసాద్ మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి అనంతరం కమిషనర్ స్థాయికి ఎదిగారు. అధికార పార్టీ అండదండలతోనే ఆయన అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు ఆర్జించారని చెబుతున్నారు.