నిజాం నజరానా.. మహబూబియా
20 వ శతాబ్ది తొలినాళ్లలో నిజాం ప్రభువు హైదరాబాద్ నగర మహిళలకు ఇచ్చిన గొప్ప నజరానా మహబూబియా కళాశాల. ఆ నాటి పెద్దలు ఆడపిల్లలకు విద్యా గంధం సోకనిచ్చేవారు కాదు. 14 ఏళ్లయినా నిండకముందే పెళ్లి చే సి తల్లిదండ్రులు చేతులు దులుపుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే చదువుకు అతివలను ఆమడ దూరంలో ఉంచేవారు. అలాంటి రోజుల్లో ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ నగర నారీమణులకు నజరానాగా మహబూబియా కళాశాలను బహూకరించారు.
నిజాం ఆస్థానంలో పని చేస్తున్న సర్ జార్జ్ కాసన్ వాలర్-ఆయన భార్య కేసన్ వాలర్ నగర మహిళలందరి తరఫున, ఆడపిల్లల కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని పిటిషన్ తయారు చేసి నిజాం ప్రభువుకు అందజేశారు. దీనికి వెంటనే స్పందించిన నిజాం.. బాలికల పాఠశాల తక్షణం ఏర్పాటు చేయాల్సిందిగా తన ప్రధాన మంత్రి మహారాజా కిషన్ ప్రసాద్‌ని ఆదేశించారు.పాఠశాల నిర్వహణ కోసం నెలకు వెయ్యి రూపాయలు మంజూరు చేశారు. అంతేకాదు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షురాలిగా లేడీ కేసన్ వాలర్, బేగం ఖాదీవ్ జంగ్, అక్బర్ హైద్రీ, బేగం ముంతాజ్ యార్-ఉద్-డౌలా, సరోజినీ నాయుడు, సొరాభి జంషేడ్జీ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఆ రకంగా 1907 ఫిబ్రవరి 1న నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ భవనంలో (ప్రస్తుతం రాయల్ హోటల్ ఉన్న ప్రాంగణంలో) బాలికల పాఠశాల ప్రారంభమైంది.నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ ఏర్పాటు చేయడంతో ఈ స్కూల్ పేరు మహబూబియా పాఠశాలగా నామకరణం చేశారు. దీనికి తొలి ప్రిన్స్‌పాల్‌గా, ఆక్స్ఫర్డ్ వర్సిటీలో చదువుకున్న జెఫ్రీని నియమించారు. ఇంగ్లిష్ టీచర్‌గా వైష్, ఉర్దూ, పర్షియన్ పాఠాలు నేర్పేందుకు ఖుజిస్తా బేగంను నియమించారు.
ఎంతో ఆర్భాటంగా ఆడపిల్లల కోసమని ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తే నలుగురు మాత్రమే స్కూల్లో చేరార ట. క్రమేణా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినా, 1908లో మూసీ వరదలు.. విద్యార్థినుల రాకను గట్టి దెబ్బతీశాయి. అయినా, సరోజినీ నాయుడు వంటి ప్రముఖుల చొరవతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో మరో టీచర్‌ను నియమించాలని నిజాంను కోరగా, అందుకు ఆయన తక్షణం అంగీకరించారు.
మార్పు మొదలు..
మహబూబియా పాఠశాల ఏర్పాటయ్యాక బాలికల జీవన ప్రమాణాల్లో మార్పు మొదలైందని చరిత్రకారుల అభిప్రాయం. కట్టు, బొట్టు, నడవడిలో మార్పు వచ్చిందని చెబుతారు. జెఫ్రీ తర్వాత ఫ్లోరా వైల్డ్, బేతా వుడెన్ హైస్, హేండీ ఇలా ఒకరి తర్వాత మరొకరు ఆంగ్లేయ ప్రధానోపాధ్యాయులు మహబూబియా పాఠశాలలో పనిచేశారు. ఆ తర్వాత 1930 నుంచి 1947 దాకా పాఠశాలకు ఆఖరి ఆంగ్లేయ ప్రిన్సిపాల్‌గా చేసిన గ్రేస్ లినెల్లీ దీని అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. 1947లో ఆమెను స్థానిక ఉమెన్స్ కాలేజీ ప్రిన్స్‌పాల్‌గా బదిలీ చేశారు. మహబూబియా పాఠశాల తొలి భారతీయ మహిళా ప్రిన్సిపాల్‌గా మేరీ నంది నియుక్తులయ్యారు. పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సరోజినీ నాయుడు తన కుటుంబంలోని ఆడపిల్లలందరూ మహబూబియాలోనే చదివేలా ప్రోత్సహించారు.
కాలంతో మార్పు..
కాలక్రమంలో ఎందరికో విద్యాబుద్ధులు ప్రసాదించిన మహబూబియా పాఠశాల నేటి అవసరాలకు అనుగుణంగా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా వినూత్న తరహాలో ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇండో యూరోపియన్ శైలిలో, రాతి కట్టడాలతో, విశిష్ట రీతిలో, శైలిలో పది ఎకరాల విశాల ప్రాంగణంలో వున్న మహబూబియా కళాశాల నేడెందరినో ఆకర్షిస్తోంది. ఆధునిక విద్యా బోధనతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో నర్సింగ్, కంప్యూటర్లు, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ట్రైనింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇక్కడ ఇప్పిస్తున్నామని కళాశాల ప్రిన్స్‌పాల్ చెప్పారు. అయితే, కార్పొరేట్ కళాశాలల మోజులో ప్రభుత్వ ఆధీనంలో గల కళాశాలల వైపు కన్నెత్తి చూసేవారు కరువయ్యారు.
ఈ ధోరణికి మహబూబియా కళాశాల కూడా మినహాయింపు కాదు. ఒకప్పుడు కళాశాలలో సీటు కావాలంటే పడిగాపులు పడే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. కేవలం దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు, పేదవారి పిల్లలు మాత్రమే మహబూబియా వైపు తొంగి చూస్తున్నారంటారు ఇక్కడి అధ్యాపకులు. ఉన్నత విద్యా ప్రమాణాలతో అత్యధిక ఉత్తీర్ణతా శాతాన్ని సాధిస్తున్నా, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలల వైపే యువత మొగ్గు చూపడం ‘కొత్తొక వింత’ అని అధ్యాపక బృందం కొట్టి పారేస్తోంది..! ఈ వాదనలోనూ నిజం లేకపోలేదు !!
- మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com