టౌన్‌హాల్ నవీకరణకు పచ్చజెండా
న్యూఢిల్లీ: నగరంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన టౌన్‌హాల్ త్వరలో కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఈ భవనం నవీకరణకు కేంద్ర పర్యాటకశాఖ రూ. 50 కోట్లను మంజూరు చేసింది. మరింతమంది పర్యాటకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతోనే పర్యాటకశాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎమ్సీ) అధికారి ఒకరు తెలిపారు. ఎన్డీఎమ్సీ పరిధిలోని 150 సంవత్సరాల ఈ పురాతన భవనాన్ని నవీకరించేందుకు రూ. 50 కోట్లతో సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల వివరణాత్మక నివేదికను మంత్రిమండలికి పంపడంతో ఎట్టకేలకు ఆమోదముద్రపడిందని ఎన్డీఎమ్సీ ప్రజాసంబంధాల అధికారి యోగేంద్రసింగ్ మాన్ తెలిపారు. నగరంలోని పురాతన కట్టడాల్లో ఒకటైన ఈ టౌన్‌హాల్ చాందినీచౌక్‌లో ఉంది.
ఇందులో మ్యూజియం, గ్రంథాలయం, కాన్ఫరెన్స్ హాలు, చిల్డ్రన్స్ కార్నర్, బొటిక్ హోటల్, మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, ఆడియో విజువల్ అండ్ మీటింగ్ రూమ్ తదితర సౌకర్యాలున్నాయి. ఈ భవనంలోని మెట్లు కూడా సంగీతాన్ని పలికిస్తాయని, ఇదంతా నిర్మాణనైపుణ్యమని చెబుతారు. ఇందులోని మ్యూజియం ఢిల్లీ చరిత్రను చాటిచెబుతుంది. ఈ భవనంలోని మెయిన్ బ్లాక్‌ను హెరిటేజ్ బొటిక్ హోటల్‌గా తీర్చిదిద్దనున్నారు. ఇందులోకి అడుగుపెట్టే పర్యాటకులకు 1860 నాటి రోజులను గుర్తుకుతెచ్చేలా నవీకరిస్తామన్నారు. ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విభజన తర్వాత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఈ భవనం వెళ్లడంతో నవీకరణ పనులను కూడా ఎన్డీఎమ్సీనే చూస్తుందన్నారు.