nectar
-
అసలు... కొసరు
ఏక క్రియా ద్వ్యర్థి కరీ అన్నారు పెద్దలు. రాతి మీద నూరటం కత్తికి పదును కోసం, రాయి నునుపు కోసం కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనుకున్న దానితో పాటు కొన్ని అవాంతర ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పనికివచ్చేవి, కొన్ని పనికిరానివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో అసలు ప్రయోజనం మర్చిపోయి, ఈ కొసరుదే సరి అనుకునే ప్రమాదం కూడా ఉంది. పిల్లలకి స్నానం చేయించి, శుభ్రమైన యూనిఫారం వేసి, తల దువ్వి, షూస్ బాగా మిలమిలా మెరిసేట్టు పాలిష్ చేసి, పుస్తకాలు సద్ది, బ్యాగులో పెట్టి, ప్రేమతో తినిపించి, డబ్బా కట్టి బడికి పంపటానికి సిద్ధం చేస్తారు. బడికి వెళ్ళటంతో ప్రయోజనం సిద్ధించదు. అసలు ప్రయోజనం అక్కడికి వెళ్ళి చదువుకుంటే కలుగుతుంది. తయారు అవటం క్రమశిక్షణలో భాగం మాత్రమే. వరి సాగు చేయటం ధాన్యం కోసం. కాని వరిగడ్డి కూడా వస్తుంది. దాని వల్ల లాభం వస్తుంది అని గడ్డి కోసం వరి సాగు చేయరు. అంతే కాదు గడ్డి ఎక్కువగా పెరగటం కోసం ఎరువు వేయరు.వడ్లు బాగా రావాలని తగిన ఎరువులు వేస్తారు. ఆవులని పాల కోసం పోషిస్తారు. గోమయం, గోమూత్రం కూడా మానవులకి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఒకప్పుడు వాటిని పొలాలలో ఎరువుకి వాడేవారు. గోమయంతో పిడకలు చేసి ఇంధనంగా ఉపయోగించేవారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడేవారు. ఇప్పుడు వాటిని మరెన్నింటికో ఉపయోగిస్తున్నారు. కాని ఎవరూ ఆవులని పేడకోసమో, మూత్రం కోసమో పెంచరు కదా! అవసరం అనుకుంటే ఆవులున్న వారి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు. అరవిందాశ్రమంలో శ్రీ మాతగా ప్రసిద్ధి పొందిన మిర్రా సాధన ప్రారంభించిన మొదట్లో అద్భుతమైన అందంతో ప్రకాశించటం మొదలు పెట్టిందిట. శారీరిక, మానసిక ఆరోగ్యాలు ఉండటమే అందం. వెంటనే ఆవిడ ఇది నా ప్రయోజనం కాదు అని ఆ శక్తిని భౌతిక శరీరం నుండి ఉపసంహరించింది. లక్ష్యసాధనలో ఎదురయ్యే ఇటువంటి వాటిని పరమార్థం అనుకోకుండా ముందుకి సాగాలి. ఖాళీ సీసాలు సేకరించి అమ్ముకునే వాడితో ఒక పెద్దమనిషి ‘‘నీకోసమేనయ్యా నేను రాత్రి అంతా కూర్చుని సీసాలు ఖాళీ చేసేది.’’ అన్నాడట! ఆహా! ఏమి సమర్థింపు!! ఈ సందర్భంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూగారిని స్మరించక తప్పదు. స్వతంత్రోద్యమంలో ప్రధాన భాగంగా విదేశీవస్తు దహనం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో ఎవరో ‘‘మీరు విదేశీ సిగరెట్లు కాలుస్తున్నారు. మనం విదేశీ వస్తువులు వాడం కదా!’’ అన్నారుట. దానికి నెహ్రూ గారు నవ్వుతూ... ‘‘అందుకే కదా దహనం చేస్తున్నాను.’’ అన్నారుట. పేలాల కోసం కుప్పలు తగల బెట్టటం అనే సామెత ఉంది. వరిపేలాల కోసం వడ్లని వేయిస్తారు. కాసిని వడ్లతో సరిపోయేదానికి మొత్తం కుప్పని తగల బెట్టటం తెలివి గల పనేనా? ప్రధానమైన ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తుంటే కొన్ని అనుకోనివి కూడా లభిస్తాయి. వాటిని పట్టించుకుంటే దృష్టి చెదిరే ప్రమాదం ఉంది. క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసం. ఆ లోపు పాలసముద్రం నుండి ఎన్నో విశిష్ట వస్తువులు ఉద్భవించాయి – లోకోపద్రవకారకమైన హాలాహలం నుండి కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు వంటి వారి నుండి లక్ష్మిదేవి వరకు. తెలివిగలవారు దేనిని ఏ విధంగా వినియోగించుకోవాలో, ఆ విధంగా వినియోగించుకున్నారు. తమ లక్ష్యమైన అమృతం సిద్ధించే వరకు పాలసముద్రాన్ని చిలకటం కొనసాగించారు. కల్పవృక్షం వంటి వాటి కోసం మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయలేదు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
సత్యం ఉన్నది ఉన్నట్లుగానే
ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోతే ఉన్న మనకు లేనిపోని నష్టం జరుగుతుంది. మనకు కష్టం కలుగుతుంది. సత్యం లేదా నిజం తెలియకపోవడం వల్లా, లేకపోవడం వల్లా, మనకు ఎంతో హాని జరుగుతుంది, జరుగుతోంది, జరుగుతూ ఉంటుంది... ప్రతి ఒక్కరికీ సత్యం అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ సత్యమే అవసరం అవుతుంది. ఏదో అనుకోవడం, ఏదో అభిప్రాయపడడం ఈ రెండిటినీ వీలైనంత తొందరగా మనం వదిలేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మన ఇష్ట, అయిష్టాల్లో సత్యం లేకపోవచ్చు; మనకు నచ్చిన, నచ్చని వాటిల్లో సత్యం లేకపోవచ్చు. కాబట్టి మనం మనల్ని దాటుకుని లేదా మనల్ని మనం మార్చుకుని సత్యంలోకి వెళ్లవలసి ఉంటుంది. ఆ పని ఎంత తొందరగా జరిగితే మనకు అంత మేలు జరుగుతుంది. క్షేత్ర వాస్తవాన్ని తెలుసుకోగలగడం, ఆపై సత్యాన్ని అవగతం చేసుకోగలగడం మనిషి జీవితంలో తప్పకుండా నేర్చుకోవలసినవి. మనకు ముందు వచ్చిన వాళ్లు చెప్పారు కాబట్టి, మనకు ముందే కొందరు నమ్మారు కాబట్టి, కొందరు చెబుతున్నారు కాబట్టి, కొందరు అనుకుంటున్నారు కాబట్టి, ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, వాడుకలో ఉన్నాయి కాబట్టి ఉన్నవి సరైనవే అని స్వీకరించే ధోరణి వాంఛనీయం కాదు. అది నాసిరకం పోకడ. అది ఆదర్శనీయమైనది కాదు. ఏదో అనుకోవడం, దేన్నో ఊహించుకోవడం సరైనవి కాకపోవడమే కాదు, అత్యంత హానికరమైనవి కూడా. ఒక రోగి తనకు రోగం ఉంది అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే దానికి తగిన వైద్యం చేసుకుని లాభపడడం జరుగుతుంది. ఏ విషయంలో అయినా ఎంత తెలుసుకుంటే అంత లాభం ఉంటుంది. తెలివిడిలోకి వెళ్లేందుకు అభిప్రాయాలవల్ల ఏర్పడ్డ నమ్మకం అడ్డంకిగా ఉంటూనే ఉంటుంది. మనం ఆ అడ్డంకిని వీలైనంత వేగంగా తొలగించుకోవాలి. చలామణిలో ఉన్నవాటిని నమ్మడం మనిషి బలహీనతల్లో బలమైంది. ఆ బలమైన బలహీనత మనిషిని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు కొడుతూనే ఉంటుంది. మనిషి ఆ దెబ్బల నొప్పిని అనుభవిస్తూనే ఉన్నాడు. ‘నమ్మడంపై నాకు నమ్మకం లేదు, తెలుసుకోవడమే నా విధానం’ అని ఓషో ఒక సందర్భం లో అన్నారు. తెలుసుకునే విధానానికి మనం అలవాటుపడాలి.‘ఏది సత్యం?’ ఈ ప్రశ్నకు ‘దేని ప్రభావం మంచి చేస్తుందో అది సత్యం’ అని మనుస్మృతిలోని మాటల్ని ఉటంకిస్తూ బుద్ధుడు తెలియజెప్పాడు. అమెరికా దేశపు తత్త్వవేత్త విలియమ్ జేమ్స్ కూడా ఈ మాటల్ని చెప్పారు. ఒక ప్రయత్నానికి వచ్చిన ప్రభావంవల్ల జరిగిన మంచి సత్యం. మనకు మంచి కావాలి కనుక మనకు సత్యం కావాలి. నమ్మడం, అభిప్రాయపడడం ఇవి అర్థంలేనివి. ఆపై అనర్థదాయకమైనవి. అధ్యయనం చేస్తే కానీ అవగాహన రాదు. ఏది ఉందో, ఏది లేదో, ఏది అవునో, ఏది కాదో మనం తెలుసుకోవాలి. ఇకనైనా, ఇపుడైనా నిజానిజాలను తేల్చుకుందాం. కళ్లు తెరిస్తే కానీ దృశ్యం కనిపించదు. నిద్రలేస్తే కానీ నడక మొదలవదు. మనం నిద్రలేచి నడక మొదలుపెడదాం. ‘నా భావన’, ‘నేనేం అంటానంటే’ అన్న మధ్యతరగతి మాంద్యాన్ని వదిలించుకుందాం; ఉన్న మిథ్యలను విదిలించుకుని ముందుకెళదాం. ప్రయత్నించి సత్యాన్ని సాధిద్దాం; సత్యంతో మనుగడను సాగిద్దాం. ‘సత్యాన్ని అమృతంలా సేవించు’ అని అష్టావక్రగీత చెబుతోంది. సత్యాన్ని సేవించడానికి అలవాటు పడదాం. సత్యం రుచిగా ఉంటుంది. ఆ రుచిని తెలుసుకుందాం. ఆ తరువాత సత్యం రుచికి మాలిమి అయిపోయి జీవితాన్ని మనం రుచికరం చేసుకుందాం. సత్యం జ్ఞానాన్ని ఇస్తుంది. ‘జ్ఞానం స్వేచ్ఛకు ఆధారం’ అని తెలియజెప్పారు ఆదిశంకరాచార్య. సత్యం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా స్వేచ్ఛను పొంది మనం సరిగ్గా, ఉన్నతంగా జీవిద్దాం; జీవితాన్ని విలువైందిగా చేసుకుందాం. అభిప్రాయాలు, అనుకోవడాలు, నమ్మకాలు వీటిని మనలో పేర్చుకుని మనల్ని మనం మోసుకోవడం జీవనం కాదు; వాటివల్ల మనలో మనం కూరుకు పోవడం జీవితం కాకూడదు. ఎరుకను అనుసరిద్దాం; ఎదుగుతూ ఉందాం. – రోచిష్మాన్ -
మకరందం... జుర్రేస్తాం
-
మకరందం... జుర్రేస్తాం
తుమ్మెదలు వివిధ పూల నుండి మకరందాన్ని జుర్రుకుంటున్నాయి. వర్షా కాలంలో వివిధ రకాల పూలు విరభూస్తాయి. ఏడాదికి ఒక్కసారి పూసే పూలంటే తుమ్మెదలకు ఎంతో ఇష్టం. వాటి మకరందాన్ని అమృతంలాగా లాగేస్తున్నాయి. కె.సతీష్, సాక్షి ఫోటోగ్రాఫర్, సంగారెడ్డి