ఏక క్రియా ద్వ్యర్థి కరీ అన్నారు పెద్దలు. రాతి మీద నూరటం కత్తికి పదును కోసం, రాయి నునుపు కోసం కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనుకున్న దానితో పాటు కొన్ని అవాంతర ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పనికివచ్చేవి, కొన్ని పనికిరానివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో అసలు ప్రయోజనం మర్చిపోయి, ఈ కొసరుదే సరి అనుకునే ప్రమాదం కూడా ఉంది.
పిల్లలకి స్నానం చేయించి, శుభ్రమైన యూనిఫారం వేసి, తల దువ్వి, షూస్ బాగా మిలమిలా మెరిసేట్టు పాలిష్ చేసి, పుస్తకాలు సద్ది, బ్యాగులో పెట్టి, ప్రేమతో తినిపించి, డబ్బా కట్టి బడికి పంపటానికి సిద్ధం చేస్తారు. బడికి వెళ్ళటంతో ప్రయోజనం సిద్ధించదు. అసలు ప్రయోజనం అక్కడికి వెళ్ళి చదువుకుంటే కలుగుతుంది. తయారు అవటం క్రమశిక్షణలో భాగం మాత్రమే.
వరి సాగు చేయటం ధాన్యం కోసం. కాని వరిగడ్డి కూడా వస్తుంది. దాని వల్ల లాభం వస్తుంది అని గడ్డి కోసం వరి సాగు చేయరు. అంతే కాదు గడ్డి ఎక్కువగా పెరగటం కోసం ఎరువు వేయరు.వడ్లు బాగా రావాలని తగిన ఎరువులు వేస్తారు.
ఆవులని పాల కోసం పోషిస్తారు. గోమయం, గోమూత్రం కూడా మానవులకి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఒకప్పుడు వాటిని పొలాలలో ఎరువుకి వాడేవారు. గోమయంతో పిడకలు చేసి ఇంధనంగా ఉపయోగించేవారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడేవారు. ఇప్పుడు వాటిని మరెన్నింటికో ఉపయోగిస్తున్నారు. కాని ఎవరూ ఆవులని పేడకోసమో, మూత్రం కోసమో పెంచరు కదా! అవసరం అనుకుంటే ఆవులున్న వారి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు.
అరవిందాశ్రమంలో శ్రీ మాతగా ప్రసిద్ధి పొందిన మిర్రా సాధన ప్రారంభించిన మొదట్లో అద్భుతమైన అందంతో ప్రకాశించటం మొదలు పెట్టిందిట. శారీరిక, మానసిక ఆరోగ్యాలు ఉండటమే అందం. వెంటనే ఆవిడ ఇది నా ప్రయోజనం కాదు అని ఆ శక్తిని భౌతిక శరీరం నుండి ఉపసంహరించింది. లక్ష్యసాధనలో ఎదురయ్యే ఇటువంటి వాటిని పరమార్థం అనుకోకుండా ముందుకి సాగాలి.
ఖాళీ సీసాలు సేకరించి అమ్ముకునే వాడితో ఒక పెద్దమనిషి ‘‘నీకోసమేనయ్యా నేను రాత్రి అంతా కూర్చుని సీసాలు ఖాళీ చేసేది.’’ అన్నాడట! ఆహా! ఏమి సమర్థింపు!! ఈ సందర్భంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూగారిని స్మరించక తప్పదు. స్వతంత్రోద్యమంలో ప్రధాన భాగంగా విదేశీవస్తు దహనం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో ఎవరో ‘‘మీరు విదేశీ సిగరెట్లు కాలుస్తున్నారు. మనం విదేశీ వస్తువులు వాడం కదా!’’ అన్నారుట. దానికి నెహ్రూ గారు నవ్వుతూ... ‘‘అందుకే కదా దహనం చేస్తున్నాను.’’ అన్నారుట.
పేలాల కోసం కుప్పలు తగల బెట్టటం అనే సామెత ఉంది. వరిపేలాల కోసం వడ్లని వేయిస్తారు. కాసిని వడ్లతో సరిపోయేదానికి మొత్తం కుప్పని తగల బెట్టటం తెలివి గల పనేనా?
ప్రధానమైన ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తుంటే కొన్ని అనుకోనివి కూడా లభిస్తాయి. వాటిని పట్టించుకుంటే దృష్టి చెదిరే ప్రమాదం ఉంది.
క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసం. ఆ లోపు పాలసముద్రం నుండి ఎన్నో విశిష్ట వస్తువులు ఉద్భవించాయి – లోకోపద్రవకారకమైన హాలాహలం నుండి కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు వంటి వారి నుండి లక్ష్మిదేవి వరకు. తెలివిగలవారు దేనిని ఏ విధంగా వినియోగించుకోవాలో, ఆ విధంగా వినియోగించుకున్నారు. తమ లక్ష్యమైన అమృతం సిద్ధించే వరకు పాలసముద్రాన్ని చిలకటం కొనసాగించారు. కల్పవృక్షం వంటి వాటి కోసం మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయలేదు.
– డా.ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment