neelakantapuram
-
నేనెక్కడున్నా మీ వాడినే
మడకశిర రూరల్(శ్రీసత్యసాయి జిల్లా): ‘నేనెక్కడున్నా మీ వాడినే. నా పేరులోని ‘నీల్’ అంటే నీలకంఠాపురమే. ఇదే నా స్వగ్రామం. ఎక్కడున్నా మరచిపోను. నా చివరి మజిలీ తప్పకుండా నీలకంఠాపురమే ఉంటుంది’ అని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావోద్వేగంతో వెల్లడించారు. సోమవారం ఆయన తన చిన్నాన్న, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి నీలంకంఠాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, తన తండ్రి జన్మదిన దినోత్సవం ఒకే రోజు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. అనంతరం నీలకంఠేశ్వరస్వామి దేవాలయ సముదాయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా తన తండ్రి సుభాష్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి సహకారంతో ఈ ప్రాంతంలోని వారికి వైద్యసేవలందించేందుకు సహకారం అందిస్తామన్నారు. త్వరలోనే ఎన్టీఆర్‌తో సినిమా ప్రసుత్తం ప్రభాస్ హీరోగా ‘సలార్’ శరవేగంగా రూపుదిద్దుకుంటోందని, రానున్న ఏప్రిల్, లేదా మే నెలల్లో జూనియర్ ఎన్టీఆర్‌తో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. కార్యక్రమంలో రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్న సీఎం
మడకశిర: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గురువారం అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి, నిపుణులు గ్రాఫిక్స్ చేసినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. అదేవిధంగా సీఎం దత్తత తీసుకున్న అరకు ప్రాంతం 172వ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలు గెలిపిస్తే రాష్ట్ర స్థూల ఆదాయంలో 13వ స్థానంలో నిలిపారన్నారు. 175 నియోజకవర్గాల తలసరి ఆదాయంలో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం 174వ స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా అవగాహన లేని జీఎస్టీ, నోట్ల రద్దువల్ల దేశంలో ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుదేలైందన్నారు. ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు. -
కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం
మడకశిర : జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కృషి చేయాలని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో జిల్లాలోని 14 నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కష్టపడి పని చేస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్‌తో పాటు వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు
మడకశిర : మండలంలోని నీలకంఠాపురంలో గురువారం పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో 30 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు చేశారు. హాజరైన వారందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి సన్నిధిలో ఉదయం 8గంటలకు కర్నాటక రాష్ట్రం శిర తాలూకా పట్టనాయకనహళ్ళి శ్రీ నంజావధూతస్వామి ఆశీస్సులతో ఈ వివాహాలు జరిపించారు. ప్రతి ఏడాదీ శ్రీరామనవమి సందర్భంగా రఘువీరారెడ్డి కుటుంబసభ్యులు 1982 నుంచి క్రమం తప్పకుండా సామూహిక వివాహాలు చేయిస్తున్నారు. వధూవరులకు తాళిబొట్లు, కొత్త బట్టలు, కాలిమెట్టెలు తదితర పెళ్లి సామగ్రిని ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, స్థానిక మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, పెనుకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, పీసీసీ చీఫ్ సోదరుడు చెలువమూర్తి, అనిల్‌కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎస్ ప్రభాకర్‌రెడ్డి, బచ్చలయ్యపాళ్యం నరసింహమూర్తి, నాగేంద్ర, మంజునాథ్, మందలపల్లి నాగరాజు, విశ్వనాథ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.