Neelam Venkanna
-
సమతను చాటిన సాధువు
పుస్తక పరిచయం ‘‘జనం అంతకుముందు చాలామంది బాబాలను, గురువులను చూశారు. అయితే, వాళ్లందరూ బ్రహ్మజ్ఞానం, మాయ, కోరికలు, సమర్పణలు, పరలోకాలు, ముక్తి, మోక్షం లాంటి మాటలే చెబుతూ ఉండేవారు. వాటిలో ఈ లోకానికి సంబంధించినవి, ఇప్పటికి అవసరమైనవి ఒక్కమాట కూడా ఉండేది కాదు. కానీ, ఈ కొత్త బాబా చెబుతున్నవి చాలా కొత్తగా ఉండటమే కాదు, అర్థమవుతోంది కూడా’’ అంటారు రచయిత మల్లంపల్లి సాంబశివరావు. ‘అభినవ బుద్ధుడు– అంబేడ్కర్ గురువు సంత్ గాడ్గేబాబా’ అనే తన పరిశోధనాత్మక గ్రంథంలో ఆయన అనేక విషయాలను వెలుగులోకి, తెలుగులోకి తెచ్చారు. సమాచారం కోసం మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. వృద్ధాప్యంలో ఉన్న గాడ్గేబాబా డ్రై వర్ భావ్‌రావు కాలేను కలిశారు. తాను ఆచరిస్తున్నది బౌద్ధమనే విషయం తెలియకుండానే జీవితాంతం బుద్ధుడి వలే గడిపిన మహనీయుడు గాడ్గేబాబా అంటారు రచయిత. అక్షరజ్ఞానం లేని ఒక సాదాసీదా గాడ్గేబాబాను తన గురువుగా అంబేడ్కరే స్వయంగా ప్రకటించాడు. బుద్ధుడి మాదిరిగా తన 29వ ఏట గాడ్గేబాబా ఇంటి నుంచి వెళ్లిపోయి, సంసారిక జీవితానికి దూరంగా జరిగి, జనం ఈతిబాధలను రూపుమాపే మహత్కార్యానికి పూనుకున్నాడు. ఈ బాధలను తొలగించడానికి అపరిశుభ్రత నిర్మూలన అనే ఆచరణాత్మక విధానాన్ని ఆయన ఆయుధంగా చేసుకున్నాడు. స్వచ్ఛత గురించి గాంధీ మహాత్ముడు ప్రవచించకముందే, 1905లో మహారాష్ట్రలో అప్పటికే బోధిస్తూ, ఆచరిస్తూ జనం హృదయాలను గెలుచుకున్నవాడు గాడ్గేబాబా. పది సూత్రాల కోసం జీవితమంతా దేశాటన చేశాడు. ‘ఆకలిగొన్నవారికి అన్నం పెట్టండి, వస్త్ర విహీనులకు వస్త్రాలు అందించండి, దాహార్తులకు మంచినీరు ఇవ్వండి, జంతువులను ప్రేమించండి, జంతుబలికి పూనుకోకండి, అంటరానితనం పాటించకండి, మద్యాన్ని సేవించకండి, తల్లిదండ్రులను సేవించండి, విద్య లేనివారికి విద్యను అందించండి, అప్పులు చేసి తీర్థయాత్రలకు వెళ్లకండి’ అని బోధించాడు. మహారాష్ట్రలోని సతారా, అమరావతి, పుణె, బొంబాయి, వార్ధా వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు, గోశాలలు, విద్యాసంస్థలను 60కి పైగా నిర్మించాడు. గాడ్గేబాబా శిష్యగణం, అభిమానుల్లో సామాన్యులతోపాటు మాన్యులు కూడా అనేక మంది ఉన్నారు. ప్రముఖ కాలమిస్టు సుధీంద్ర కులకర్ణి, జేఎన్‌యూ ప్రొఫెసర్ వివేక్ కుమార్ వంటివారు రాసిన వ్యాసాలతో కూడిన ఐదు అనుబంధాలను పొందుపరిచిన ఈ 28 అధ్యాయాల పుస్తకానికి టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ ముందుమాట రాశారు. సంత్ గాడ్గేబాబా; రచన: మల్లంపల్లి సాంబశివరావు; పేజీలు: 166; వెల: 150; ప్రతులకు: విశాఖ బుక్స్, ఫోన్: 040–27090197 ఠి నీలం వెంకన్న -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
కురవి : వరంగల్ జిల్లా కురవి మండలం నెరాడ గ్రామంలో ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఓ మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకుని నీలం వెంకన్న(45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం వెంకటాపూర్ గ్రామంలో కుర్వ ధశరద్(40) అనే మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘స్వచ్ఛ భారత్’ను కలగన్న గాడ్గేబాబా
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వందేళ్ల క్రితమే కలగన్న అసామాన్యుడు గాడ్గేబాబా. మనుషులను ప్రేమించి, మట్టిమనుషు లను తట్టిలేపిన ఈ సాధుపుంగవుడు జీవితాంతం సమానత్వాన్ని ప్రబోధించాడు. మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని షేన్గావ్లో 1876 ఫిబ్రవరి 23న సక్కు బాయి, ఝింగ్రాజీలకు జన్మించాడు. అసలు పేరు దేవూజీ. అంటే మరాఠీలో మట్టి చిప్ప. చేతిలో చీపురు, తలపై మట్టిచిప్ప, ఒంటిపై రంగురంగుల గుడ్డపేలికలతో కూడిన దుస్తు లు ఇతని ఆహార్యం. చీపురు పట్టి చిద్విలాసంగా ఫొటోలకు ఫోజులివ్వడం తెలియదు. చీపురును తన ఆహార్యంలో భాగం చేసు కుని, దానితోనే సహవాసం చేశాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గాడ్గేబాబాను తన గురువుగా ప్రకటిం చుకున్నారు. తన 30వ ఏట భార్యాపిల్లలను వదిలి దేశాటనకు బయలుదేరిన బాబా సంచార సాధువయ్యాడు. ఏ ఊరికి వెళ్లినా తను మొదట చేసేది వీధులు ఊడ్చటం, దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపర్చడం. గుడిలో ఆయన కీర్తనలు పాడితే జనం కిక్కిరిసి పోయేవారు. మూఢనమ్మకాలు పాటించవద్దనీ, సాటి మనిషిని కులం పేరిట చిన్న చూపు చూడవద్దని బోధించేవాడు. మనుషులందరూ సమానమన్న ఆయన మాటలు, చేతల్లోని నిజాయితీ జనాలను కట్టిపడేసేది. అనాథా శ్రమాలు, బాలికా సదనాలు, పాఠశాలలు, వసతి గృహాలు, ధర్మశాలలు, వంటి 150 నిర్మాణాలను ప్రజ ల స్వచ్ఛంద సహకారంతో చేపట్టి పూర్తి చేశాడు. ఒక్క పైసా కూడా చందా అడగకుండానే వీటిని చేపట్టడంతో మహారాష్ట్రలో ఎందరో ప్రముఖులు, సామాన్యులు తన అభిమా నులుగా మారారు. మహారాష్ట్రను సోషలిస్టు భావాల వేదికగా చేసింది గాడ్గేబాబాయే అని ప్రముఖ మరాఠా రచయిత ఆత్రే ప్రశంసించారు. ఏ పొలం పనో, మట్టి పనో కుమ్మరి పనో చేసి రెండు రొట్టెలు సంపాదించి ఆరగించేవాడు. పాడుబడ్డ గోడల మాటునో, దేవాలయంలోనో తలదాచుకునేవాడు. రోడ్డుమీద తిని, రోడ్డు పక్కన జీవించి, రోడ్డుమీదే కన్నుమూశాడు. 1956 డిసెంబర్ 20న గాడ్గేబాబా మరణించాడు. కులరహిత సమాజం, స్వచ్ఛ భారత్‌ను నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నివాళి. (నేడు గాడ్గేబాబా 58వ వర్ధంతి) నీలం వెంకన్న, హైదరాబాద్