‘స్వచ్ఛ భారత్’ను కలగన్న గాడ్గేబాబా
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వందేళ్ల క్రితమే కలగన్న అసామాన్యుడు గాడ్గేబాబా. మనుషులను ప్రేమించి, మట్టిమనుషు లను తట్టిలేపిన ఈ సాధుపుంగవుడు జీవితాంతం సమానత్వాన్ని ప్రబోధించాడు. మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని షేన్‌గావ్‌లో 1876 ఫిబ్రవరి 23న సక్కు బాయి, ఝింగ్రాజీలకు జన్మించాడు. అసలు పేరు దేవూజీ. అంటే మరాఠీలో మట్టి చిప్ప. చేతిలో చీపురు, తలపై మట్టిచిప్ప, ఒంటిపై రంగురంగుల గుడ్డపేలికలతో కూడిన దుస్తు లు ఇతని ఆహార్యం. చీపురు పట్టి చిద్విలాసంగా ఫొటోలకు ఫోజులివ్వడం తెలియదు. చీపురును తన ఆహార్యంలో భాగం చేసు కుని, దానితోనే సహవాసం చేశాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గాడ్గేబాబాను తన గురువుగా ప్రకటిం చుకున్నారు.
తన 30వ ఏట భార్యాపిల్లలను వదిలి దేశాటనకు బయలుదేరిన బాబా సంచార సాధువయ్యాడు. ఏ ఊరికి వెళ్లినా తను మొదట చేసేది వీధులు ఊడ్చటం, దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపర్చడం. గుడిలో ఆయన కీర్తనలు పాడితే జనం కిక్కిరిసి పోయేవారు. మూఢనమ్మకాలు పాటించవద్దనీ, సాటి మనిషిని కులం పేరిట చిన్న చూపు చూడవద్దని బోధించేవాడు. మనుషులందరూ సమానమన్న ఆయన మాటలు, చేతల్లోని నిజాయితీ జనాలను కట్టిపడేసేది. అనాథా శ్రమాలు, బాలికా సదనాలు, పాఠశాలలు, వసతి గృహాలు, ధర్మశాలలు, వంటి 150 నిర్మాణాలను ప్రజ ల స్వచ్ఛంద సహకారంతో చేపట్టి పూర్తి చేశాడు. ఒక్క పైసా కూడా చందా అడగకుండానే వీటిని చేపట్టడంతో మహారాష్ట్రలో ఎందరో ప్రముఖులు, సామాన్యులు తన అభిమా నులుగా మారారు. మహారాష్ట్రను సోషలిస్టు భావాల వేదికగా చేసింది గాడ్గేబాబాయే అని ప్రముఖ మరాఠా రచయిత ఆత్రే ప్రశంసించారు. ఏ పొలం పనో, మట్టి పనో కుమ్మరి పనో చేసి రెండు రొట్టెలు సంపాదించి ఆరగించేవాడు. పాడుబడ్డ గోడల మాటునో, దేవాలయంలోనో తలదాచుకునేవాడు. రోడ్డుమీద తిని, రోడ్డు పక్కన జీవించి, రోడ్డుమీదే కన్నుమూశాడు. 1956 డిసెంబర్ 20న గాడ్గేబాబా మరణించాడు. కులరహిత సమాజం, స్వచ్ఛ భారత్‌ను నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నివాళి.
(నేడు గాడ్గేబాబా 58వ వర్ధంతి)
నీలం వెంకన్న, హైదరాబాద్