మహాత్ముడు మంచి తండ్రి కాలేకపోయారా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర పోరాట యోధుడు మహాత్మాగాంధీ జాతిపిత అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన చేసిన గొప్ప పనులే జాతి పిత అని పేరొచ్చేలా చేశాయి. అయితే, ఇది గాంధీ చరిత్రకు ఒక వైపు మాత్రమేనని,మహాత్ముడి జీవితంలో తెలియని మరో అంశం కూడా ఉందని ప్రముఖ రచయిత్రి నీలిమా ద్మాలియా ఆధార్ అన్నారు. గాంధీ భార్య కస్తూర్బా గాంధీ రాసిన డెయిరీ ఆధారంగా ‘ది సీక్రెట్ డైరీ ఆఫ్ కస్తుర్బా’ అనే పేరిట ఆమె పుస్తకాన్ని వెలువరించింది. ఆ పుస్తకంలో మహాత్ముడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు పేర్కొంది.
గాంధీ మహాత్ముడి చరిత్రను మకిలబరచడం తన ఉద్దేశం కాదని, ఆయన చరిత్రను మాత్రమే పట్టించుకున్నవారు కస్తుర్బా చరిత్రను మాత్రం వదిలేశారని, ఆమెను గురించి, ఆమె భావాలను గురించి కూడా అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశం అన్నారు. జాతి పిత గాంధీ మంచి తండ్రి కాలేకపోయారని ఆమె పుస్తకంలో ఆరోపించారు. భార్యతో వ్యక్తిగత జీవితం నుంచి కూడా దూరంగా ఉన్నారని చెప్పారు. దేశం కోసం గొప్ప సేవలు అందించిన గాంధీ మహాత్ముడు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారంటే ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపారు.
కస్తుర్భా ఎప్పుడూ మౌనంగా ఉండే స్త్రీ మాత్రమే కాదని, చాలా ధైర్యవంతురాలని కూడా పేర్కొన్నారు. ఆమె ఎదుర్కొన్న సవాళ్లను చరిత్ర గురించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఆమె గురించి ఒక్క పదం కూడా పొందుపరిచి లేదని, ఇదంతా ఒక అసాధారణ మహిళను నిర్లక్ష్యం చేసి మర్చిపోవడమే అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కస్తుర్బా వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.