త్వరలో 100 కోట్ల వాట్స్‌యాప్ యూజర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయార్జనకు ప్రధానంగా సబ్స్క్రిప్షన్ విధానంపైనే దృష్టి పెడుతున్నట్లు మొబైల్ మెసెంజర్ సేవల సంస్థ వాట్స్‌యాప్ బిజినెస్ హెడ్ నీరజ్ ఆరోరా చెప్పారు. ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన సంస్థకు ప్రారంభం నుంచే లేదన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడాదికి నామమాత్రంగా ఒక్క డాలరు (సుమారు రూ. 60) మాత్రమే సబ్స్క్రిప్షన్ ఫీజు కింద తీసుకుంటున్నట్లు వివరించారు.
క్రెడిట్ కార్డులు మొదలైన సాధనాల ద్వారా చెల్లింపులు భారత్‌లో ఇంకా పూర్తిగా ప్రాచుర్యంలోకి రాకపోవడం వల్ల ఈ నామమాత్ర సబ్‌స్క్రిప్షన్‌కు కూడా అవరోధాలు ఏర్పడుతున్నాయని ఆరోరా చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) పూర్వ విద్యార్థి అయిన ఆరోరా మంగళవారం ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. వివిధ సంస్థలు, ఐఎస్బీ నుంచి వాట్స్‌యాప్ దాకా తన ప్రస్థానం, అనుభవాలను ఐఎస్బీ విద్యార్థులతో పంచుకున్నారు. వాట్స్‌యాప్‌ను ఫేస్బుక్ ఏకంగా 20 బిలియన్ డాలర్ల పైచిలుకు వెచ్చించి కొనుగోలు చేయడంలో ఆరోరా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
వాట్స్‌యాప్- ఫేస్బుక్ డీల్‌ను ప్రస్తావిస్తూ.. సాధారణంగా టెక్నాలజీ రంగంలో తమ వంటి సంస్థలకున్న యాక్టివ్ యూజర్ల సంఖ్యను బట్టి వేల్యుయేషన్లు ఉంటాయని నీరజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ యూజర్ల సంఖ్య 60 కోట్ల పైచిలుకు ఉందని, త్వరలో 100 కోట్ల స్థాయికి చేరుకోగలమని ఆయన చెప్పారు.
ప్రపంచంలో ఇంతమందికి చేరువైన కంపెనీలు ప్రస్తుతం పది కూడా లేవని వివరించారు. ఈ సామర్ధ్యాన్ని గుర్తించే ఫేస్బుక్ భారీ వేల్యుయేషన్ కట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వాట్స్‌యాప్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు టెలికం కంపెనీలతో చేతులు కలపడం కూడా లాభిస్తోందని చెప్పారు. భారత్‌లో 5 టెలికం సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు.
డేటా సేవల ద్వారా ఆదాయాలను ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో టెల్కోలు కూడా ఇందుకు ముందుకు వచ్చినట్లు నీరజ్ పేర్కొన్నారు. ఇక, తమ కంపెనీలో సిబ్బంది సంఖ్య 80 మాత్రమే ఉన్నప్పటికీ.. యూజర్ల సమస్యల పరిష్కారం కోసం 30 మందితో కస్టమర్ కేర్ సేవలు కూడా అందిస్తున్నట్లు వివరించారు.
చైనా మార్కెట్..
చైనా, కొరియా వంటి దేశాల్లో భిన్న సంస్కృతి కారణంగా ఆయా మార్కెట్లలో విస్తరించడానికి సమస్యలు ఉంటాయని నీరజ్ చెప్పారు. అందుకే గూగుల్ వంటి దిగ్గజాలు సైతం అక్కడ పెద్ద ఎత్తున విస్తరించలేకపోయాయన్నారు.
తాము మెరుగైన ఉత్పత్తిని ప్రపంచ స్థాయిలో రూపొందించడంపైనే దృష్టి కేంద్రీకరించామని, ఇప్పటికిప్పుడు ఒకటి రెండు దేశాల్లో విస్తరించ లేకపోయినా.. ఓపిగ్గా తగిన సమయం కోసం వేచి చూస్తామని నీరజ్ చెప్పారు. వాట్స్‌యాప్ లాంటి భారీ సంస్థను ప్రపంచానికి అందించే సత్తా, సామర్థ్యం భారతీయుల్లో కూడా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, అందుకు అనువైన పరిస్థితులు ఇక్కడ కల్పించాల్సి ఉందన్నారు.