breaking news
Neeraj Ghaywan
-
మెరుగైన ఇంటి వైపు హోమ్‌బౌండ్
ఈ దేశవాసులకు ఈ దేశమే ఇల్లు. ఇక్కడే ఉండాలి. జీవించాలి. కాని ఈ నేల ప్రతి ఒక్కరికీ నివాసయోగ్యంగా ఉందా? ప్రతి ఒక్కరినీ సమానంగా, గౌరవంగా చూస్తోందా? ఏ మహమ్మారో వస్తే వలస కూలీలను ‘మీ ఊరికి పోండి’ అని సాటి మనుషులే తరిమికొడితే ‘ఇంటి వైపు’ నడక సాగుతుందా? మన హైదరాబాదీ దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీసిన ‘హోమ్‌బౌండ్’ ఎన్నో సామాజిక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివక్షలను ప్రశ్నిస్తోంది. భారత దేశం నుంచి ఆస్కార్‌కు ఆఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన ఈ సినిమా వివరాలు.మే 21, 2025. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనీవినీ ఎరగనట్టుగా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నారు ప్రేక్షకులు. సినిమా అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఒక నిమిషం... రెండు నిమిషాలు... చప్పట్లు ఆగడం లేదు... 9 నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సినిమాలో నటించిన నటీనటులు, నిర్మాత, దర్శకుడు ఉద్వేగంతో కన్నీరు కారుస్తూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు. బహుశా ఆ చప్పట్ల మోత ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ను తాకినట్టున్నాయి. 2026లో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరి కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆ సినిమాను ఎంపిక చేశారు. పేరు: హోమ్‌బౌండ్ (Homebound).→ అదే దర్శకుడికి అదే గుర్తింపు‘హోమ్‌బౌండ్’ (ఇంటి వైపు) దర్శకుడు నీరజ్ ఘేవాన్ (Neeraj Ghaywan). ఇంతకు ముందు ఇతను తీసిన ‘మసాన్’ సినిమా మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. దానికి కారణం ఆ సినిమాలో ఎత్తి చూపించిన వివక్ష, తాత్త్వికత. ఇప్పుడు కూడా అలాంటి వివక్షను, ఆధిపత్యాన్ని దర్శకుడు గొప్ప కళాత్మకంగా, సెన్సిబుల్‌గా చూపించడం వల్లే ‘హోమ్‌బౌండ్’కు ఘన జేజేలు దక్కుతున్నాయి. హాలీవుడ్ దిగ్గజం మార్టిన్ స్కోర్సెసి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉండటమే కాదు సినిమా విపరీతంగా నచ్చడంతో పొగడ్తలతో ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తర్వాత ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో సినిమాకు ప్రశంసలు మొదలయ్యాయి. కాన్స్ తర్వాత టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హోమ్‌బౌండ్’ రెండవ స్థానంలో నిలిచింది. ‘మసాన్’ సినిమా సమయంలో కేన్స్‌లో పాల్గొన్న నీరజ్ తిరిగి ఈ సినిమాతో అదే కేన్స్‌లో సగర్వంగా నిలిచాడు.→ ఇద్దరు స్నేహితుల కథ‘హోమ్‌బౌండ్’ షోయెబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథ. వీరిద్దరూ అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న యువకులు. చిన్నప్పటి నుంచి వీరు పోలీస్ కానిస్టేబుళ్లు అవ్వాలనుకుంటారు. అందుకై ప్రయత్నిస్తూ నగరంలో అంత వరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కాని ఒకసారి ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక ప్రపంచపు పోకడ, మన దేశంలో వేళ్లూనుకుని ఉన్న వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. చందన్ దళితుడైన కారణంగా అవమానాలు ఎదుర్కొంటుంటే, షోయెబ్ ముస్లిం కావడం వల్ల వివక్షను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ ‘దేశం’ అనే ‘ఇల్లు’ వీరికి ‘కొందరికి’ ఇస్తున్నట్టుగా మర్యాద, గౌరవం ఇవ్వడం లేదు. ‘కానిస్టేబుల్ ఉద్యోగం’ వస్తే అన్ని వివక్షలు పోతాయని వీరు అనుకుంటారుగాని అదంతా ఉత్తమాట... కొందరు ఎంత ఎదిగినా కిందకే చూస్తారని కూడా అర్థమవుతుంది. వీరికి పరిచయమైన అమ్మాయి సుధా భారతి అంబేద్కరైట్‌గా సమాజంలో రావలసిన చైతన్యం గురించి మాట్లాడుతుంటుంది. ఈలోపు పులి మీద పిడుగులా లాక్డౌన్ వస్తుంది. అక్కడి నుంచి ఆ స్నేహితులిద్దరూ సొంత ఊరికి బయలుదేరడంతో ఆ ప్రయాణం వారిని ఎక్కడికి చేర్చిందనేది కథ. ఇందులో ఇద్దరు స్నేహితులుగా విశాల్ జేత్వా, ఇషాన్ ఖట్టర్ నటించారు. సుధా భారతిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కరణ్ జొహర్, అదర్ పూనావాలా (కోవీషీల్డ్ తయారీదారు) నిర్మాతలు. సహజమైన పాత్రలు, గాఢమైన సన్నివేశాలు, దర్శకుడు సంధించే ప్రశ్నలు ఈ సినిమా చూశాక ప్రేక్షకులను వెంటాడుతాయని ఇప్పటి వరకూ వస్తున్న రివ్యూలు చెబుతున్నాయి. ఆస్కార్ నామినేషన్స్‌ను జనవరి 22, 2026న ప్రకటిస్తారు. హోమ్‌బౌండ్ నామినేట్ అవుతుందని ఆశిద్దాం. మరో ఆస్కార్ ఈ సినిమా వల్ల వస్తే అదీ ఘనతే కదా. నిజ సంఘటన ఆధారంగా...ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీశాడు. 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో కశ్మీర్ జర్నలిస్ట్ బషారత్ పీర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఒక మిత్రుడి సమాధి పక్కన కూచుని ఉన్న మరో మిత్రుడి ఫొటో వేసి. ‘టేకింగ్ అమృత్ హోమ్’ అనే ఆ ఆర్టికల్ కోవిడ్ కాలంలో సూరత్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు ఉత్తర్ ప్రదేశ్‌లోని తమ సొంత ఊరుకు బయలుదేరి ఎలా సర్వం కోల్పోయారో, వారిలో ఒక మిత్రుడు చనిపోతే మరో మిత్రుడు కోవిడ్‌కు భయపడకుండా ఆ శవాన్ని ఎలా ఇంటికి చేర్చాడో బషారత్ ఆ ఆర్టికల్‌లో రాశాడు. అది చదివిన నీరజ్ కోవిడ్ సమయాన్ని నేపథ్యంగా ఉంచుతూనే ఈ దేశంలో వ్యాపించిన సామాజిక దుర్నీతులను ముందు వరుసలో పెట్టి ‘హోమ్‌బౌండ్’ను తీశాడు. -
టీఐఎఫ్ఎఫ్లో హోమ్ బౌండ్‌కు అవార్డు
టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ఎఫ్) గోల్డెన్ ఎడిషన్ (50వ ఎడిషన్) అవార్డ్స్ వేడుకలో భారతీయ చిత్రాలు ‘హోమ్ బౌండ్, ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’లకు అవార్డులు దక్కాయి. హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, విశాల్ జైత్యా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘హోమ్ బౌండ్’. కరణ్ జోహార్, అదార్ పూనా వాలా, అపూర్వా మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.కాగా ఈ సినిమాకు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంటర్నేషనల్ పీపుల్ చాయిస్ రెండో అవార్డు లభించింది. సౌత్ కొరియన్ సెటైరికల్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘నో అదర్ చాయిస్’ సినిమాకు ‘ఇంటర్నేషనల్ పీపుల్ చాయిస్’ మొదటి అవార్డు దక్కింది. మరో భారతీయ చిత్రం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’కి జ్యూరీకి చెందిన ఎన్ఈటీపీఏసీ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి జితాంగ్ సింగ్ గుర్జార్ దర్శకత్వం వహించగా మేఘనా అగర్వాల్, రాఘవేంద్ర భడోరియా, నిఖిల్ ఎస్. యాద్ ప్రధానపాత్రల్లో నటించారు.ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన అవార్డుగా భావించే ‘పీపుల్ చాయిస్ అవార్డు’ హిస్టారికల్ డ్రామా ‘హామ్నెట్’ చిత్రానికి దక్కింది. ఈ బ్రిటిష్ అమెరికన్ చిత్రానికి క్లోయ్ జావో దర్శకత్వం వహించగా, జెస్సీ బక్లీ,పాల్ మెస్కల్, ఎమిలీ వాట్సన్ ప్రధానపాత్రల్లో నటించారు. అలాగో ఈ ఫెస్టివల్లో మరో ప్రతిష్ఠాత్మకమైన ప్లాట్‌ఫామ్ ప్రైజ్ అవార్డు ఉక్రెయిన్స్ ఫిల్మ్ ‘టు ది విక్టరీ’కి దక్కింది. ఈ చిత్రంలో వాలెంటైన్స్ వాస్యనోవిచ్ ప్రధానపాత్రలో నటించి, దర్శకత్వం వహించారు. -
కాన్స్‌కు హోమ్ బౌండ్
ఇండియన్ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ రెండో ఫీచర్ ఫిల్మ్ ‘హోమ్ బౌండ్’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ఏడాది మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్‌లో జరగనుంది. ఈ చిత్రోత్సవాలకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు నిర్వాహకులు. ఫ్రెంచ్ నటుడు లారెంట్ లాఫిట్టే ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ప్రారంభ, ముగింపు వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఫ్రెంచ్ నటి జూలియట్ బినోచె జ్యూరీ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. కాగా ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఫీచర్ ఫిల్మ్ ‘హోమ్ బౌండ్’పోటీలో నిలిచింది. 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ‘హోమ్ బౌండ్’ అని సమాచారం. అలాగే ఇప్పటివరకూ నీరజ్ దర్శకత్వం వహించినది రెండే సినిమాలైతే వాటిలో తొలి సినిమా ‘మసాన్’ కాన్స్‌కి ఎంపికైంది. రిచా చద్దా, విక్కీ కౌశల్, శ్వేతా త్రిపాఠి, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2015లో జరిగిన 68వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగానికి నామినేట్ అయింది. ఇప్పుడు ఇదే విభాగానికి నీరజ్ రెండో చిత్రం ‘హోమ్ బౌండ్’ ఎంపిక కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే... నీరజ్ పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. అయితే అతని తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందినవారు. కానీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.ఇక నీరజ్ చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే. ఇంజనీరింగ్ పూర్తి చేశాక రెండు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం చేశారాయన. సినిమాల మీద మక్కువతో జాబ్ మానేసి, సినీ విమర్శకుడిగా కథనాలు రాశారు. ‘మసాన్’తో దర్శకుడిగా మారక ముందు దర్శకత్వ శాఖలో చేశారు. ఆ సమయంలోనే ఓ షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించారు. ఇక కాన్స్ చిత్రోత్సవాలకు ఎంపికైన ఆయన ‘హోమ్ బౌండ్’కి సంబంధించిన నటీనటులు, ఇతర వివరాలేవీ బయటపెట్టలేదు. బహుశా ఈ ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యే సమయానికి లేదా ఆ తర్వాత ప్రకటిస్తారేమో. ఇక ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలోపోటీలో నిలిచిన దాదాపు పదిహేను చిత్రాల్లో ‘హోమ్ బౌండ్’ ఒకటి. -
ఒంటరిగా ఎగిరిపోతే నా మనసు రోజూ...
ఈడొచ్చిన పిల్లల్లో సహజంగా ఉద్భవించే హార్మోన్ల వల్ల కలిగే భావుకత్వంతో కూడిన ఆలోచనలు.. అందుకు తగ్గట్టుగా మారే ప్రవర్తన.. తద్వారా ఎదురయ్యే పరిణామాలు.. ఆ అనుభవాలు వాళ్లను ఏ తీరాలకు తీసుకెళతాయనే..పరస్సర విరుద్ధ భావాల్ని సోకాల్డ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లుగా కాకుండా అంతరాత్మ ఉట్టిపడేలాంటి చిత్రాన్ని ఒకే కాన్వాసుపై చిత్రీకరిస్తే.. ఓపెనింగ్ సీన్.. అప్పటివరకు తనలోని అనైతికతను అణుచుకుంటూ వచ్చిన దీపా పాఠక్ అనే విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి లాడ్జి రూమ్‌కి వెళుతుంది. అక్కడ వాళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో (ఇద్దరున్నప్పుడు అది ఏకాంతమెలా అవుతుంది?) పోలీసులు సీన్లోకి వస్తారు. ఇద్దరూ పట్టుబడతారు. ఏమీ జరగకపోయినా తమ తప్పును ఒప్పుకుంటారు. ఆ కన్ఫెషన్ సీన్ మొత్తాన్ని వీడియో తీసి దాచుకుంటాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఆ వీడియోతో అతడేం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదనుకుంటాం. కానీ చెప్పుకోవాల్సిందే.. పోలీసుకు కావాల్సింది ఆ అమ్మాయి కాదు డబ్బు. పెద్ద మొత్తంలో డబ్బిస్తేగానీ ఆ వీడియోను, ఆమెపై ఉన్న కేసును కొట్టేయనని బెదిరిస్తాడు. ఎవరిని? అమ్మాయిని కాదు వాళ్ల నాన్నను. ఆ తండ్రి చేసేదీ మామూలు పనేమీకాదు.. కాశీలో బాగా డిమాండ్ ఉన్న 'కర్మకాండల పూజారి' పని. కూతురి మీద పడ్డ నిందను తుడిచేసుకునే క్రమంలో ఎంత సంపాదించినా సరిపోవట్లేదని భావించిన ఆ పూజారి.. అదనపు సంపాదన కోసం అప్పటికే బడి మానేసిన ఓ పదేళ్ల కుర్రాణ్నిఅసిస్టెంట్గా పెట్టుకుంటాడు. .. మెడకు డోలన్నట్లు అసిస్టెంట్‌ని పెట్టుకుంటే సంపాదనెలా పెరుగుతుంది? పెరుగుతుంది. అంతే. అది కాశీ మరి. దేశంలో డబ్బున్న మారాజులందరూ కర్మకాండలకు అక్కడికే వస్తారు. వేల రూపాయల నాణాలను గంగకు సంతర్పణం చేస్తారు. నది అడుగు భాగానికి వెళ్లి ఆ నాణాలను వెతికి తీసుకురావడమే అసిస్టెంట్ పని. అలా నాణాల కోసం వెళ్లి చనిపోయేవారి సంఖ్య తక్కుమేమీకాదు. అయినాసరే కూతురి కోసం అసిస్టెంట్ కుర్రాడి జీవితాన్ని రిస్కులో పెట్టక తప్పదు ఆ తండ్రిగారికి. ఏంటిదంతా? అడుసు తొక్కనేల? కాలు కడగనేలా? అనుకునే అవకాశం ప్రేక్షకుడికి రానేరాదు ఎందుకంటే.. చైతన్య స్రవంతి (స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్) ని కళ్లతో చూడగలమా? అది సాధ్యమేనా? అనే ప్రశ్నకు చాలా ఏళ్ల తర్వాత దొరికే లేదా దొరికిన సమాధానం 'మసాన్'. సహజంగానే విరుద్ధ స్వభావానికి దగ్గరిగా పరుగెత్తే మనుషులకు.. అలా మారిపోయే ప్రక్రియను మరింత సులభతరం చేసిన నేటి సామాజిక, సాంకేతిక పరిస్థితులను ఒడిసిపట్టడం.. వంద ఆలోచనల్ని ఒక్క కాన్వాసుగా గీసినంత పని. ఆ పనిని తన మొదటి సినిమాలోనే అత్యద్భుతంగా చేసి చూపాడు దర్శకుడు నీరజ్ ఘవాన్. ఈ సినిమాకు ముందు ఆయన అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. రోడ్డుకు ఎడమవైపు కేవలం ఆభరణాలు మాత్రమే ధరించి వనిత ఫుల్ సైజ్ ఫ్లెక్సీ .. రోడ్డు మధ్యలో డివైడర్ మీద సిక్స్ ప్యాక్ ఇలా అంటూ చెడ్డీ మీద నించున్న స్మార్ట్ గైయ్ యాడ్. తల పైకెత్తి చూస్తే 'పైకి రా' అనే టైటిల్‌తో U/A సినిమా పోస్టర్. అన్ని చోట్లా ఒలికేది శృంగార రసమే. ఇక చేతిలో సెల్ ఫోన్లయితే ఆ రసాన్ని మరింతగా ఒలికించగలిగే సాధనం. నైతికతను కనీసం గుర్తుచేయకుండా ఉంచగలిగేంత టెక్నాలజీ సిగ్నళ్ల మధ్య అనైతికంగా ఉండొద్దనే ఉద్భోదకు ఫ్రీక్వెన్సీ తక్కువ. మ్యాగ్నిట్యూడ్.. హ్యూమనిట్యూడయితే అసలు ఉండనే ఉండవు. ఇంత గందరగోళంలో యువతరం ఎలా మనగలుగుతోంది? తన భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటోంది? తనను తాను ఎలా మౌల్డ్ చేసుకుంటున్నారు? ఇలాంటి మౌలికమైన భారీ ప్రశ్నలకు అత్యల్ప (కేవలం రెండు గంటల్లో) సమయంలో సమాధానం చెప్పేందుకు చేసిన ప్రయత్నమే 'మసాన్'. తర్వాతి కథ.. చదువు పూర్తయిన తర్వాత దీపకు రైల్వే బుకింగ్ క్లర్క్ ఉద్యోగం వస్తుంది. ఓ రోజు ఆమె బుకింగ్ కిటికీ ముందు నిల్చుని ఓ అబ్బాయి-అమ్మాయి జంట ఏదైనా చోటుకు పోయి, రాత్రికి కలసి గడపాలని రెండు టికెట్లు అడుగుతారు. అది చూసి దీప బిర్రబిగుసుకుపోతుంది. అసమ్మతి పూర్వకమైన ఆమె కళ్లు మానిటర్‌ను చూసే సరికి 26 ఖాళీ సీట్లు కనిపిస్తుంటాయి. కానీ ఆమె వారికి లేవని చెబుతుంది. ఎందుకంటే రెండు గంటలపాటు ఒక బాయ్‌ఫ్రెండ్‌తో తను సన్నిహితంగా గడిపితే, ఆ తర్వాత ఎంతటి అపనిందలు, వేధింపులకు గురి కావాల్సి వస్తుందో ఆమెకు తెలుసు. మరోవైపు.. నాణానికి రెండు వైపులున్నట్లు.. చావు పుట్టుకలు కాశీ మనుగడకు కీలక ఆధారాలు. దివ్య కథతోపాటే షాలూ గుప్తా, దీపక్ కుమార్ల కథా సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. కాశీ ఘాట్లలో శవాలను తగలబెట్టే వృత్తిపని చేసేవాళ్లను 'డోమ్' అంటారు. ఆ కులానికి చెందిన దీపక్ కుమార్ (విక్కీ కౌశల్) ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతుంటాడు. ఉన్నత వర్గానికి చెందిన శాలూ గుప్తాతో ప్రేమలో పడతాడు. నిజానికి దీపక్ ప్రేమలో ఉన్నాడు అనేకంటే ఆత్మన్యూనతలో ఉంటాడని ఇట్టే అర్థమవుతుంది మనకు. 'నేను కాల్చే శవాలతోపాటే నా మనసూ రోజూ కాలిపోతూ ఉంటుంది' అని శాలూకు చెప్తూంటాడు. ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లా అనిపించే శాలూ మాత్రం ఇవేవీ పట్టించుకోదు. 'పారిపోవడం తప్పుదుకదా.. అప్పుడు తప్పకుండా పారిపోదాం' అని దీపక్ తో అంటుంది. ఇది ప్రేమా? లేక అనైతికత రుచి కోసం ఎంత రిస్క్ అయినా భరించాలనుకునే హార్మోన్ల ప్రభావమా? అనే మానసిక సంఘర్షణను తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు నీరజ్. దీప పాత్రలో రిచా చద్దా, పురోహితుడిగా ఆమె తండ్రి విద్యాధర్ పాఠక్ పాత్రలో సీనియర్ నటుడు సంయన్ మిశ్రా, వల్లకాట్లో పనిచేస్తూ ఇంజనీరింగ్ చదివే దీపక్ కుమార్ పాత్రలో విక్కీ కౌషల్, శాలూ గుప్తాగా శ్వేతా త్రిపాఠి అభినయం అవార్డులతోపాటు ప్రేక్షకుల హృదయాలూ గెల్చుకునే స్థాయిలో ఉంటుంది. ఇవికాకుండా ఇన్ స్పెక్టర్ సహా కేవలం తొమ్మిది లేదా పది క్యారెక్టర్లతో బిగుతైన స్క్రీన్ ప్లే రాసుకుని, అనుకున్నట్లే తెరకెక్కించాడు దర్శకుడు నీరజ్ ఘవాన్. 'మసాన్' అంటే అర్థం 'ఒంటరిగా ఎగిరిపో' అని.