
78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఏకైక భారతీయ చిత్రం!
ఇండియన్ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ రెండో ఫీచర్ ఫిల్మ్ ‘హోమ్ బౌండ్’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ఏడాది మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్‌లో జరగనుంది. ఈ చిత్రోత్సవాలకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు నిర్వాహకులు. ఫ్రెంచ్ నటుడు లారెంట్ లాఫిట్టే ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ప్రారంభ, ముగింపు వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఫ్రెంచ్ నటి జూలియట్ బినోచె జ్యూరీ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. కాగా ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఫీచర్ ఫిల్మ్ ‘హోమ్ బౌండ్’పోటీలో నిలిచింది. 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ‘హోమ్ బౌండ్’ అని సమాచారం.
అలాగే ఇప్పటివరకూ నీరజ్ దర్శకత్వం వహించినది రెండే సినిమాలైతే వాటిలో తొలి సినిమా ‘మసాన్’ కాన్స్‌కి ఎంపికైంది. రిచా చద్దా, విక్కీ కౌశల్, శ్వేతా త్రిపాఠి, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2015లో జరిగిన 68వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగానికి నామినేట్ అయింది. ఇప్పుడు ఇదే విభాగానికి నీరజ్ రెండో చిత్రం ‘హోమ్ బౌండ్’ ఎంపిక కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే... నీరజ్ పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. అయితే అతని తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందినవారు. కానీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
ఇక నీరజ్ చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే. ఇంజనీరింగ్ పూర్తి చేశాక రెండు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం చేశారాయన. సినిమాల మీద మక్కువతో జాబ్ మానేసి, సినీ విమర్శకుడిగా కథనాలు రాశారు. ‘మసాన్’తో దర్శకుడిగా మారక ముందు దర్శకత్వ శాఖలో చేశారు. ఆ సమయంలోనే ఓ షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించారు. ఇక కాన్స్ చిత్రోత్సవాలకు ఎంపికైన ఆయన ‘హోమ్ బౌండ్’కి సంబంధించిన నటీనటులు, ఇతర వివరాలేవీ బయటపెట్టలేదు. బహుశా ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శితమయ్యే సమయానికి లేదా ఆ తర్వాత ప్రకటిస్తారేమో. ఇక ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలోపోటీలో నిలిచిన దాదాపు పదిహేను చిత్రాల్లో ‘హోమ్ బౌండ్’ ఒకటి.