నిర్లక్ష్యపు తూట్లు
అమలాపురం : గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెస్తున్నట్టు ఉంది నాబార్డ తీరు. కొన్నేళ్ల కిందట నాబార్డ నిధులతో నిర్మించిన రహదారులు ప్రస్తుతం దెబ్బతిన్నాయి. స్వల్ప మొత్తంతో మరమ్మతులు చేస్తే ఇవి మరి కొన్నేళ్లపాటు వినియోగంలో ఉంటాయి. ఈ విషయం తెలిసి కూడా నాబార్డు ఇందుకు నిధులు మంజూరు చేయడం లేదు. ఇటు ప్రభుత్వం కూడా వివక్ష చూపుతోంది. ఇదిలాగే కొనసాగితే ఈ రోడ్లు మరింత ధ్వంసమై, తిరిగి కోట్ల రూపాయలతో పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. గతంలో ప్రతి ఏటా రోడ్ల నిర్మాణానికి నాబార్డ నిధులు మంజూరు చేసేది. 2009 సెప్టెంబర్ నుంచి దీనిని నిలిపివేసింది. 2008-09లో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో జిల్లాలో కోట్లాది రూపాయలతో రహదారులు నిర్మించారు.
జిల్లావ్యాప్తంగా ఒక్క 2009లోనే సుమారు రూ.50 కోట్లతో రోడ్లు నిర్మించింది. అమలాపురం పంచాయతీరాజ్ (పీఆర్) డివిజన్ పరిధిలోని అయినవిల్లి మండలంలోనే రూ.3.20 కోట్లతో ఎనిమిది రోడ్లు నిర్మించారు. దీనినిబట్టి ఆ ఏడాది నాబార్డ ఆధ్వర్యాన జిల్లాలో రహదారులు ఏ స్థాయిలో నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తరువాత నుంచి రోడ్ల నిర్మాణానికి నిధుల విడుదలను నాబార్డ నిలిపివేసింది. కొత్తగా ఎటువంటి నిర్మాణమూ చేపట్టలేదు. అదే సమయంలో తమ ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు సైతం నిధులు విడుదల చేయడం లేదు. పీఆర్ ఆధ్వర్యంలో 20 మిల్లీమీటర్ల మందంతో బీటీ రోడ్లను నిర్మిస్తారు. వీటి ఆయుష్షు ఐదేళ్లు మాత్రమే. అదే ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మించే తారు రోడ్డు మందం 50 మిల్లీమీటర్లు ఉంటుంది. వీటి జీవితకాలం పదేళ్లు. ఆర్అండ్బీ రోడ్లతో పోల్చుకుంటే పీఆర్ రోడ్లపై దమ్ము చక్రాల ట్రాక్టర్లు ఎక్కువగా తిరుగుతూంటాయి. దీనివల్ల ఈ రహదారులు చాలా త్వరగా దెబ్బతింటున్నాయి. పెద్దపెద్ద గోతులు పడి రాళ్లు లేచిపోతున్నాయి.
వాహనచోదకులు ఇక్కట్ల పాలవుతున్నారు.ఐదేళ్ల కాలం పూర్తయినందున నాబార్డ నిధులతో 2009లో నిర్మించిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. గోతులను పెద్ద మెటల్‌తో పూడ్చడంతోపాటు మరోసారి 20 ఎంఎం మందంతో చిన్న చిప్‌తో తారు వేయాలి. ఈ మేరకు నాబార్‌డకు పీఆర్ అధికారులు ప్రతిపాదనలు పంపినా అనుమతి రాలేదు. సింగిల్ లేయర్ తారు రోడ్డు నిర్మాణం చేయకుంటే రహదారి కిందిభాగంలోని బ్లాక్ మెటల్ కూడా లేచి మొత్తం రోడ్డును పునర్నిర్మించాల్సి వస్తుంది. సింగిల్ లేయర్ నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.8 లక్షల వరకూ అవుతుండగా, మొత్తం రోడ్డును పునర్నిర్మించాల్సి వస్తే కిలోమీటర్‌కు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తుంది. ఒకవేళ పీఆర్ నిధులతో ఈ పనులు చేయాలనుకున్నా.. పుష్కరాలవంటి అత్యవసర పనులకే ప్రభుత్వం నుంచి ఈ శాఖకు నిధులు రాలేదు. ఇక రోడ్ల మరమ్మతులకు కేటాయింపులంటే అత్యాశే అవుతుంది. పరిస్థితిని గుర్తించి రహదారుల మరమ్మతులకు నాబార్డ నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.