చంద్రబాబూ.. హామీల సంగతేంటి
భీమవరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారూ.. ఎన్నికల్లో మీరిచ్చిన హామీల సంగతేంటి?.. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలంటూ సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెక్కంటి సుబ్బారావు ప్రశ్నించారు. కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తూ రైతులను, మహిళలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఏరియా సీపీఐ కమిటీ సమావేశం కనుమూరి వెంకటపతిరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అతిథిగా పాల్గొన్న నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ ఓట్లు పొందేందుకు సాధ్యం కాని హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాటి అమలును గాలికొదిలేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
అధికారమే లక్ష్యంగా హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటి మాటే మర్చిపోయిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. చంద్రబాబు ప్రకటనలతో రైతులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉన్నారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై వామపక్షాలు చేసిన విద్యుత్ పోరాటం వంటి మరో పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి పోరాడాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు లంకా కృష్ణమూర్తి, మల్లుల సీతారామప్రసాద్, కడలి గంగిశెట్టి, నాగిడి తులసీరావు, తిరుమాని సత్యనారాయణ, రేవు నాగరాజు, జి.భాస్కరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.