పదవులు ఎవరికి ఇద్దాం!
జోగిపేట : ఎవరికి ఏ పదవులు కావాలో.. ఇవ్వాలో చెప్పదలచుకున్నారా.. చిట్టీ రాసి సంచిలో వేయండి అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల కోసం అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఆయన హైదరాబాద్‌లోని నెక్టార్ గార్డెన్ క్లబ్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎవరికి ఏ పదవి కావాలో చిట్టీ రాసి సంచిలో వేయాలని ఖాళీ సంచిని అక్కడుంచారు.
కొందరు కార్యకర్తలు లేచి ఏ పదవైనా ఎమ్మెల్యేగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పగా అదే అభిప్రాయం రాసి వేయండి అంటూ ఆయన సూచించడం విశేషం. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశానికి హాజరై కొద్ది సేపటి తర్వాత జిల్లా పర్యటనకు వెళ్లారు. అనంతరం ఈ చిట్టీల కార్యక్రమాన్ని చేపట్టారు.
సుమారు 250 మంది వరకు నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరైనట్లు సమాచారం. జోగిపేట, వట్పల్లి, రాయికోడ్ మండలాల్లో మార్కెట్ కమిటీ పదవులు కోరుతూ పలువురు ఫలానా నాయకుడికి ఇస్తే బాగుంటుందని తెలుపుతూ చిట్టీలు రాసి సంచిలో వేశారు. చైర్మన్ పదవుల రేసులో ఉన్న వారు తమ పేర్లతో చిట్టీలు రాసినట్లు తెలిసింది. జోగిపేట మార్కెట్‌కు ముగ్గురు రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే సంచిలోని చిట్టీలను ఎప్పుడు చదువుతారో... తమ పేరును ఎప్పుడు పలుకుతారోనని నాయకులు స్థానిక నాయకుల్లో టెన్షన్ పట్టుకుంది.