ముంచుకొస్తున్న ఉపద్రవం!
జిల్లా కేంద్రం, ఎనిమిది మండలాల్లోని గ్రామాల ప్రజలు తీవ్ర మంచినీటి ఎద్దడితో అల్లాడే పరిస్థితులు దాపురించాయి. నీటి చుక్కలను లెక్కబెట్టుకుని మరీ దాహం తీర్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమారు లక్షమంది విజయనగరం పట్టణ వాసులతో పాటు మరో నాలుగు లక్షల మంది గ్రామీణ ప్రజలకు తాగునీటి సరఫరా త్వరలోనే నిలిచిపోనుంది. అందరికీ తాగునీటికి ఆధారమైన చంపావతినదిలో నీరు పూర్తిగా ఎండిపోయింది. దీంతో జిల్లాకేంద్రానికి తాగునీరు సరఫరాచేసే పథకాలవద్ద భూగర్భ జలాలు అడుగంటాయి. గ్రామాలకు తాగునీరు సరఫరాచేసే పథకాలు మొరాయిస్తున్నాయి.
నెల్లిమర్ల, న్యూస్‌లైన్:
సమీప భవిష్యత్తులో తాగునీటి కోసం అల్లాడిపోవాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు ఎనిమిది మండలాల్లోని గ్రామాలకు నీటి ఎద్దడి ప్రమాదం పొంచిఉంది. సుమారు లక్షమంది విజయనగరం పట్టణ వాసులతో పాటు మరో నాలుగు లక్షల మంది గ్రామీణ ప్రజలకు తాగునీటి సరఫరా త్వరలోనే నిలిచిపోనుంది. అందరికీ తాగునీటికి ఆధారమైన చంపావతినదిలో నీరు పూర్తిగా ఎండిపోయి. ఎడారిలా మారడంతో ఈ దుస్థితికి కారణం. మార్చి ప్రారంభంలోనే నది పరిస్థితి దయనీయంగా మారడంతో జిల్లాకేంద్రానికి తాగునీరు సరఫరాచేసే పథకాలవద్ద భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. అలాగే వివిధ మండలాల్లోని గ్రామాలకు తాగునీరు సరఫరాచేసే పథకాలు మొరాయిస్తున్నాయి. సుమారు యాభై కిలోమీటర్ల పొడవునా నది లో ఉన్న ఊటబావుల చుట్టూ భారీస్థాయిలో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో వచ్చేనెల నుంచి వారంలో రెండురోజులు కూడా తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉంటుందని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు.
నెల్లిమర్ల పరిధిలోని చంపావతినది నుంచే జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం, గజపతినగరం, బొండపల్లి, మెం టాడ, గుర్ల మండలాల్లోని గ్రామాలకు తాగునీ టి సరఫరా జరుగుతోంది. చాలాకాలం క్రిత మే నెల్లిమర్లలోనిథామస్పేట వద్దనున్న మహారాణి అప్పలకొండయాంబ వాటర్‌వర్క్స్, నీలంరాజుపేట సమీపంలోనున్న రామతీర్థం మంచినీటి పథకాలకు సంబంధించి చంపావతినదిలో ఊటబావులను ఏర్పాటుచేసి పట్టణానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. వీటిలో మహారాణి అప్పలకొండయాంబ వాటర్‌వర్క్స్‌ను సుమారు వందేళ్ల క్రితమే ఏర్పాటుచేశారు.
నాలుగేళ్ల క్రితం వరకూ ఈ పథకం నుంచి నిరాటంకంగా పట్టణ వాసులకు నీటి సరఫరా జరి గేది. అయితే కొంతకాలంగా నదిలో ఉన్న ఊట బావుల వద్దనే ఇసుక తవ్వకాలు అధికమయ్యాయి. దీంతో వేసవి వస్తే పథకాల ద్వారా నీటిసరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ఇసుక తవ్వకాలతో ప్రస్తుతం ఊటబావులవద్ద భూగర్భజలస్థాయి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఇదే పరిస్థితి రామతీర్దం మంచి నీటి పథకంవద్ద కూడా నెలకొంది. ఇక్కడ ఆరు ఊటబావులున్నా యి. ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ఇప్పటికే రెండు ఊటబావులు నిరుపయోగంగా మారాయి. అంతే కాకుండాగతంలో చేపట్టిన ఇసుక తవ్వకాలకే మిగిలిన ఊటబావుల్లో భూగర్భ జలస్థాయి సగానికి పడిపోయింది. గత వేసవిలో ఈ పథకం నుంచి దాదాపుగా నీటి సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా గత ఏడాది ఇసుక తవ్వకాల కారణంగా వర్షాకాలంలోనే పట్టణానికి వారం రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ ఈ ఏడాది ఇసుక తవ్వకాలను నిరోధించేందుకు సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అలాగే నెల్లిమర్ల, గుర్ల మండలాలకు చెందిన 57 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్న రామతీర్థం మెగా మంచి నీటి పథకం పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
అధికార పార్టీకి చెందిన నేత ఒకరు గత ఏడాది పథకాలను ఆనుకునే ఇసుక తవ్వకాలు చేపట్టారు. దీంతో ఇప్పటికే ఇక్కడి ఊటబావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి. బొండపల్లి, గజపతినగరం మండలాలకు తాగునీరు సరఫరా చేస్తున్న గొట్లాం పథకం పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఈ ప్రాంతంలో ఇటీవల ఇసుక తవ్వకాలు అధికమయ్యాయి. దీంతో ఈ పథకం నుంచి నీటి సరఫరాకు ఎప్పటికప్పుడు ఆటంకం కలుగుతోంది. ఇదే పరిస్థితి డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో ని పథకాలవద్ద కూడా నెలకొంది. ఈ ప్రాంతాల్లో కూడా ఊటబావులను ఆనుకునే ఇసుక తవ్వకాలు చేపట్టడం తో ఎప్పుడు పడకేస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. వేసవి ప్రారంభంలోనే నదిలోని నీరు పూర్తిగా ఎండిపోవడం, ఇప్పటి కీ యథేచ్ఛగా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్ట డం తదితర కారణాలతో ఈ వేసవి గట్టెక్కడం కష్టమేనని సంబంధిత గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులే చెబుతున్నారు. మరి ఇప్పటికైనా నదిలో ఇసుక తవ్వకాలు నిరోధిం చి..తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే.