నల్లవెల్లిలో అటవీశాఖ అధికారి దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి మండలం నల్లవెల్లిలో దారుణం చోటు చేసుకుంది. నల్లవెల్లి ప్రాంతంలో అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య గత అర్థరాత్రి చోటు చేసుకున్న ఘర్షణలో ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్య మరణించగా, మరి కొంత మంది అటవీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... అటవీశాఖకు చెందిన భూములు తమకు ఇస్తే సాగు చేసుకుంటామని గత కొంత కాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఆ భూములు ప్రభుత్వానికి చెందినవి అని సాగుచేసుకోవడం కుదరదని అధికారులు గిరిజనులకు వివరించారు. అందుకు గిరిజనులు ఒప్పకోక ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఆ క్రమంలో ఆ భూములను గిరిజనులు దున్నుతున్నారు. ఆ సమాచారం తెలుసుకుని, వారి ప్రయత్నాన్ని అపేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి, సిబ్బంది హుటాహుటిన నల్లవెల్లి బయలుదేరారు.
అప్పటికే అటవీశాఖ అధికారులపై దాడికి సిద్ధంగా ఉన్న గిరిజనులు కర్రలు, కరంపోడిలతో వారిపై దాడికి దిగారు. ఆ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్య అక్కికక్కడే మరణించారు. మరో కొంత మంది సిబ్బంది తీవ్రంగా గాయపడి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.