Nellore Collectorate
-
నెల్లూరు జిల్లా: కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం..
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్ వెనుక ఉన్న స్టోర్ రూమ్‌లో శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నీచర్ కాలిపోయినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. నెల్లూరు కలెక్టరేట్ వెనుక వైపు ఉన్న స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో స్టోర్ రూమ్ నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. అది గమనించిన కలెక్టరేట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్‌లోని ఫర్నీచర్ కాలిపోయినట్టు తెలుస్తోంది. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఫోని గండం
నెల్లూరు(పొగతోట): జిల్లాకు ఫోని తుపాను గండం పొంచి ఉంది. గంట గంటకు తుపాన్ తరుముకొస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. మండు వేసవి సమయంలో చలి, ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయంతో వణుకుతున్నారు. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. తీర ప్రాంతం కోతకు గురవుతోంది. తుపాను ప్రభావంతో ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకుని ముందుకు కదులుతున్న వాయుగుండం తుపాన్‌గా మారింది. మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం తమిళనాడు ఉత్తర, ఆంధ్ర దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చెన్నైకు ఆగ్నేయ దిశగా 1,120 కిలో మీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1,450 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. అది దిశ మార్చుకుంటూ గంటకు 47 కిలో మీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో 162 కిలో మీటర్ల సముద్రతీరం ఉంది. సముద్ర తీరం వెంబడి వందల గ్రామాలు ఉన్నాయి. లోతట్టు, తీర ప్రాంతాల తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను భవనాలను సిద్ధం చేయాలన్నారు. భారీ వర్షాలు పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 15 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం వాకాడు: వాకాడు తీరంలో చలి, ఈదురు గాలులు వీయడంతో పాటు సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. గంట గంటకూ సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చి దాదాపు 15 మీటర్ల తీరం కోతకు గురవుతోంది. శనివారం వరకు సముద్రం పైభాగం కాస్త నిలకడగా ఉండి లోలోపలి భాగంలో సుడులు తిప్పుతున్న సాగరం ఒక్కసారిగా ఆదివారం సాయంత్రం నుంచి అల్లకల్లోలంగా మారింది. మండలంలోని కొండూరుపాళెం, తూపిలిపాళెం సముద్ర తీరాలను ఆదివారం గూడూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు తమ వేట సామగ్రిని ఒడ్డుకు చేర్చి భద్ర పరుస్తున్నారు. -
నెల్లూరు కలక్టరెట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా
-
నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ఏపీటీఎఫ్ ధర్నా
-
కనికరించరేమయ్యా!
ఈ ఫొటోలోని ఇద్దరూ దివ్యాంగులు. ఒకరు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చెన్నమ్మ కాగా మరొకరు పెళ్లకూరు మండలం శిరసనంబేడుకు చెందిన ఇందిరాకుమారి. ఇద్దరికీ రెండు కాళ్లూ పనిచేయవు. గత కొన్నేళ్లుగా సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెన్నమ్మ ట్రై సైకిల్ తుప్పు పట్టిపోయింది. కొత్త సైకిల్ కోసం అధికారులను ప్రాథేయపడుతోంది. ఇందిరాకుమారి రుణం కోసం అర్థిస్తోంది. ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం కూడా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌డేకు తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చారు. చెన్నమ్మ తుప్పుపట్టిన ట్రైసైకిల్‌పైనే కలెక్టరేట్‌కు వచ్చింది. అది ముందుకు కదలక మొరాయించింది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు. అటూ.. ఇటూ తిరుగుతున్న కలెక్టరేట్ సిబ్బందికి ఆమె అవస్థ పట్టలేదు. పక్కనే ఉన్న ఇందిరాకుమారి, చెన్నమ్మ కష్టాన్ని చూసింది. పాకుకుంటూ వెళ్లింది. నీకు నేనున్నానంటూ ట్రైసైకిల్ చక్రాన్ని సరిచేసి సాయం అందించింది. ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకుసాగుతున్న వీరి కష్టాలు మాత్రం అధికారులకు కనిపించడం లేదు. ఎప్పటిలాగే వీరు అధికారులను కలిశారు. వినతిపత్రాలు ఇచ్చారు. మా సమస్య ఎప్పటికి తీరుతుందోనంటూ వారు వెనుదిరిగారు. ఫొటో– వి.సాంబశివరావు, నెల్లూరు (పొగతోట) నెల్లూరు(పొగతోట): సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ గోడు అధికారుల ఎదుట వెళ్లబోసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నీటి ప్రవాహాన్ని పెంచండి పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నెల్లూరు జిల్లాకు నీటిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదికి వరద అధికంగా వస్తోందని, ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా జిల్లాలోకురవడం లేదన్నారు.కరువుతో ప్రజలు అలమటిస్తున్నారని, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నీటి ప్రవాహాన్ని పెంచి జిల్లాలోని చెరువులను నీటితో నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. న్యాయ విచారణ జరిపించాలి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయడం లేదు. మండలానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేసే జేసీబీలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్లు పెద్ద పెద్ద భూస్వాములకు అందజేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇచ్చారు. గత మూడేళ్ల నుంచి గిరిజనులకు రుణాలు కూడా మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీల దారదత్తంపై న్యాయ విచారణ జరిపించాలి. గ్రామానికి 10 నుంచి 20 మందికి రుణాలు మంజూరు చేయకపోతే ఈ నెల 22 నుంచి జిల్లావ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం. – ఎస్.మల్లి తదితరులు, దళిత సంఘర్షణ సమితిజిల్లా అధ్యక్షుడు -
కలెక్టరేట్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
మెటల్ డిటెక్టర్ ఏర్పాటు కలెక్టరేట్‌లోకి వాహనాలకు అనుమతి లేదు నెల్లూరు (పొగతోట) : ఐఏఎస్ అధికారులు, కలెక్టరేట్లకు ఉగ్రవాదులు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం, రెండు నెలల కిందట జిల్లా కోర్టులో ప్రాంగణంలో బాంబు పేలిన ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం కలెక్టరేట్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్లో ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని పరిశీలించి పంపుతున్నారు. ప్రతి రోజు మెటల్ డిటెక్టర్‌తో పరిశీలించిన తర్వాతనే కలెక్టరేట్‌లోకి అనుమతి ఇస్తారు. చాలా కాలంగా కలెక్టరేట్ అవరణ పార్కింగ్ ప్రదేశంగా మారిపోయింది. జిల్లా అధికారుల వాహనాలు, కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగుల వాహనాలు కాకుండా ఇతరుల వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. కలెక్టరేట్ చుట్టుపక్కల నివశించే వారు, వ్యాపారులు వారి వాహనాలను కలెక్టరేట్లో పార్కింగ్ చేస్తున్నారు. రాత్రి సమయంలో ప్రైవేట్ వ్యక్తులు వారి కార్లను తీసుకువచ్చి కలెక్టరేట్లో పార్కింగ్ చేస్తున్నారు. వాహనాల్లో బాంబులు పెట్టే అవకాశం ఉండటంతో గురువారం నుంచి వాహనాలను కలెక్టరేట్‌లోకి ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల వాహనాలు కూడా గోల్డెన్ జూబ్లీ హాలు ప్రాంతంలో పార్కింగ్ చేసే అవకాశం ఉంది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్‌ను కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్ పరిశీలించారు. -
తుమ్మలపెంటలో ముందుకు దూసుకొచ్చిన సముద్రం
నెల్లూరు సముద్ర తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తుమ్మలపెంట వద్ద సముద్రం 35 అడుగుల మేర ముందుకు వచ్చింది. దాంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని సముద్ర తీరంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఇప్పటికే నెల్లూరు చేరుకుంది. హెలెను తుఫాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలకు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన వెంటనే 08612331477, 2331261కు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.