జ్వరమొచ్చిందని వెళ్తే.. గుండె గుబిల్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లోని పెటల్స్ నియో కేర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసికందు శాశ్వతంగా కంటిచూపును కోల్పోయిన దుస్థితి వెలుగులోకి వచ్చి నాలుగు రోజులు కాకముందే.. మరో ప్రైవేటు ఆసుపత్రికి పట్టిన డబ్బు జబ్బు బయటపడింది. పదకొండేళ్ల బాబుకు జ్వర మొచ్చిందని వెళితే లేనిపోని పరీక్షలు నిర్వహించి మూడు రోజుల్లో రూ.35 వేలు బిల్లు చేసిన వైనం వెలుగుచూసింది.
బాబుకు వచ్చిన రోగం కంటే ఆ తరువాత చేతిలో పెట్టిన బిల్లుతోనే తల్లిదండ్రుల కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది. తమకు జరిగి అన్యాయంపై వినియోగదారుల మండలిని ఆశ్రయించారు. స్పందించిన మండలి రోగనిర్దారణ చేయకుండానే వసూలు చేసిన బిల్లు డబ్బులతో పాటు బాధిత కుటుంబాన్ని మానసికక్షోభకు గురిచేసినందుకు రూ.లక్ష చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం బాధితులపైనే ఉల్టా దాడి కేసు బనాయించింది. దీంతో సదరు బాధితుడు శనివారం ‘సాక్షి’ని ఆశ్రయించాడు.
ఆయన తెలిపిన వివరాలు..
‘‘మాది వరంగల్ జిల్లా పరకాల. నా పేరు కేసిరెడ్డి సంపత్. దీపావళి పండగ సందర్భంగా కుటుంబసభ్యులతో కరీంనగర్‌కు వచ్చాం. గత నెల 19న కుమారుడు కె.వర్షిత్‌రెడ్డి(11)కి జ్వరం రావడంతో ఆర్కిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇద్దరు డాక్టర్లు బాలుడికి వైద్యపరీక్షలు చేసిన తర్వాత మరో వైద్యుడికి రెఫర్ చేశారు. ఆయన సీబీపీ పరీక్ష, మూత్ర పరీక్ష, వైడల్ ఫీవర్, డెంగీజ్వరం నిర్దారణ పరీక్షలు చేయించారు. 20వ తేదీన రిపోర్టులు పరిశీలించి ఆస్పత్రిలో ఉండాలని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు.
అదేరోజున మళ్లీ సీబీపీ పరీక్ష చేయించి ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. 21న మళ్లీ సీబీపీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి చికిత్స అందించారు. 22న మళ్లీ సీబీపీ పరీక్ష చేయించారు. ఈ పరీక్షలన్నీ నిర్వహించి ఐసీయూ ద్వారా వైద్యం అందించినందుకు మూడు రోజులకు రూ.35 వేల బిల్లు కట్టించుకున్నారు. 22న పిప్టా 2.25 ఎంఎం మందు రాశారు.
డాక్టర్ రాసిన మందుకు బదులుగా ఆస్పత్రిలోని మెడికల్ షాపు(బిల్నెంబర్ 18321) ఫార్మసిస్టు పిరటాజ్ 1.125 ఇంజక్షన్ ఇచ్చాడు. ఇదంతా గమనించిన నేను వేరే హాస్పిటల్‌కు వెళతామని బాబును డిశ్చార్జి చేయాలని వైద్యులను కోరాను. రక్తంలో ప్లేట్లేట్స్ సంఖ్య తక్కువగా ఉందని వెంటనే రక్తం ఎక్కించాలని భయబ్రాంతులకు గురిచేశారు. వాస్తవానికి బాబుకు ప్లేట్లెట్లు పడిపోలేదని, 1.75 లక్షల మేరకు ప్లేట్లెట్స్ ఉన్నట్లు సీబీపీ పరీక్షలో తేలింది. అయినప్పటికీ లేనిపోని భయాందోళనలు సృష్టించారు.
లైఫ్‌కేర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకొస్తే దానిని ఎక్కించేందుకు నిరాకరించారు. వైద్యులు తామే సొంతంగా సేకరించిన బ్లడ్‌ను ఎక్కించి వేల రూపాయలు వసూలు చేశారు. బాబు పరిస్థితి విషమంగా ఉందని, మరో వారం రోజులపాటు అత్యవసర చికిత్స చేయాలని నమ్మించేందుకు యత్నించారు. అందుకోసం అవసరం లేకపోయినా బలవంతంగా నోటీ ద్వారా పైప్ వేసేందుకు సిద్ధమయ్యారు.
చిన్నపాటి జ్వరమొస్తే ఇట్లా చేస్తున్నారేమిటని విస్తుపోయాను. చికిత్స పేరుతో బిడ్డ ప్రాణాలు తీసేలా ఉన్నారని భయపడ్డాను. తక్షణమే తమ బాబును డిశ్చార్చి చేయాలని కోరాను. ఆసుపత్రి యాజమాన్యం వినకపోవడంతో వైద్యులను ఎదిరించాను. దీంతో ఆసుపత్రి సిబ్బందికి, మాకు మధ్య గొడవ జరిగింది.’’
వరంగల్‌లో టైఫాయిడ్‌గా నిర్దారణ
‘‘ఆ తరువాత అక్కడినుంచి బయటపడి వర్షిత్‌రెడ్డిని తీసుకెళ్లి వరంగల్‌లోని నవీన చిల్ట్రన్స్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాం. ఆర్కిడ్ హాస్పిటల్లో వ్యాధి నిర్దారణకు చేసిన పరీక్షల రిపోర్టులను చూసిన అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారు. మూడు రోజులపాటు పరీక్షలు చేసి జ్వరాన్ని నిర్దారించలేకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. రోగికి అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మలేరియా, డెంగీ వంటివి ఏమీలేవని తేల్చారు. వైడల్ టెస్ట్ చేసి టైపాయిడ్ జ్వరంతో బాధపడుతున్నట్లు నిర్దారించారు. వైద్యం అందించి మూడు రోజుల్లోనే పూర్తిగా నయం చేసి పంపించారు.’’
ఫోరమ్‌ను ఆశ్రయించినందుకు కేసు...
‘‘వ్యాధి నిర్దారణ చేయకుండా చికిత్స చేస్తున్నట్లు నమ్మించి రూ.35వేల బిల్లు వసూలు చేయడంపై కరీంనగర్ వినియోగదారుల మండలిని ఆశ్రయించాను. సదరు ఆసుపత్రి యాజమాన్యానికి మండలి నోటీస్ పంపింది. లేనిపోని పరీక్షలు చేసి వసూలు చేసిన రూ.35 వేలతోపాటు తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసిందుకు రూ.లక్ష చెల్లించాలని అందులో పేర్కొంది. దీంతో ఆగ్రహించిన ఆసుపత్రి యాజమాన్యం మా ఇంటికి వచ్చి కేసు వాపసు తీసుకోవాలని కోరింది.
లేనిపక్షంలో ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారంటూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు బనాయిస్తామని బెదిరిస్తున్నారు. మాకు జరిగిన అన్యాయంపై మీడియాను ఆశ్రయించామని తెలియడంతో ఆర్కిడ్ ఆసుపత్రి యాజమాన్యం శనివారం కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వర్షిత్‌రెడ్డి తల్లిదండ్రులే ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారని, రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తప్పుడు కేసు పెట్టారు’’ అని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.
మాపై దాడి చేశారు
శనివారం సాయంత్రం వర్షిత్‌రెడ్డితో కలిసి ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చిన సంపత్ దంపతులు ఆసుపత్రి యాజమాన్యం తమను, తమ బంధువులను రకరకాల వేధింపులకు గురిచేస్తోందని వాపోయారు. ఆసుపత్రి నుంచి తమ బాబును డిశ్చార్చి చేయాలని ఒత్తిడి చేసినందుకు సిబ్బంది చేత దాడి చేయించారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడద ని పేర్కొన్నారు.
రూ.5లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారు
వర్షిత్‌రెడ్డి తల్లిదండ్రులే తమను బె దిరింపులకు గురిచేస్తున్నారని ఆర్కిడ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వికాస్ ఆరోపించారు. ఆసుపత్రిలో వర్షిత్‌రెడ్డిని అడ్మిట్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది వాళ్లేనని, తీరా అడ్మిట్ చేసుకున్నాక బిల్లు కూడా పూర్తిగా చెల్లించకుండా దబాయించారని పేర్కొన్నారు. ఒకదశలో తమ సిబ్బందిపైనా దాడి చేశారని ఆరోపించారు. ఇటీవల కాలంలో తరచూ ఫోన్లు చేస్తూ తమకు రూ.5లక్షలు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. అందుకే తాము పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.