Neredcherla
-
నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం
నేరేడుచర్ల / హుజూర్నగర్/ మిర్యాలగూడ: రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆమె ఇక్కడికి వచ్చారు. నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. తాము వస్తున్నామనే భయంతో ప్రభుత్వం నీలకంఠం సాయికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయమని, తాము చేస్తున్న పోరాటంలో ఇది తొలి విజయమని చెప్పారు. కాగా, ఇటీవల మృతిచెందిన ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) స్టేట్ కో ఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబసభ్యులను చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి షర్మిల పలకరించారు. అలాగే, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తన మద్దతుదారుడు సలీం కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఆమె వెంట నాయకులు కొండా రాఘవారెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరశోభన్, ఆదర్ల శ్రీనివాస్‌రెడ్డి, కర్రి సతీష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. చదవండి: ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
లారీ ఢీకొని వృద్ధురాలు మృతి
నేరేడుచర్ల (నల్లగొండ) : రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న వృద్ధురాలు సిమెంటు లారీ ఢీకొట్టటంతో మృత్యువాత పడింది. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నేరేడుచర్లకు చెందిన పోతురాజు రాములమ్మ(70) స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. -
స్పృహ తప్పేలా దాడి చేసి.. చోరీ
నేరేడుచర్ల (నల్లగొండ) : పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి వంట చేస్తున్న మహిళను స్పృహ తప్పేలా కొట్టి.. సొత్తును ఎత్తుకుపోయారు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జాన్పాడ్ రోడ్డులో ఉన్న రణబోతు శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఆయన భార్య కవిత ఒక్కరే ఉన్నారు. ఆ విషయం కనిపెట్టిన దుండగులు.. వంట చేస్తున్న కవితను వెనుక నుంచి తలపై గట్టిగా కొట్టటంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసుతోపాటు బీరువాలో ఉన్న రూ.60 వేల నగదును ఎత్తుకుపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో క్లూస్‌టీంను రప్పించి, వివరాలు సేకరించారు.