విద్యుత్ ఆదా చేయండి : కలెక్టర్
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : విద్యుత్ ఆదా చేసి ఖర్చు తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ దీపాలకు బదులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులు వినియోగిస్తే కరెంటు ఆదా అవుతుందని ఆయన అన్నారు. సౌరశక్తి వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని, అన్ని వివరాలు నెట్‌క్యాప్ వెబ్సైట్లో పొందుపరిచామని ఇందన వనరుల శాఖ జిల్లా మేనేజరు కే శ్రీనివాసరావు వివరించారు. ఇందన పొదుపు వారోత్సవాల వాల్‌పోస్టర్లను విడుదల చేశారు.
ఆర్జీలకు న్యాయం చేయండి....
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు న్యాయం చేసి వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ పీ ఉషాకుమారి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వాటిపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలన్నారు. డీఆర్డీఏ పీడీ కే శివశంకర్, జిల్లా పరిషత్ సీఈవో బీ సుబ్బారావు, డీపీవో కే ఆనంద్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీఈవో డి దేవానందరెడ్డి, ఆర్వీఎం పీవో డి పద్మావతి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసజాక్షి, మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు ఇవే ....
మండవల్లి మండలం మూడుతాళ్లపాడు గ్రామంలో ప్రభుత్వ భూమి ఏమీలేదని రెవెన్యూ అధికారులు నివేదికలిస్తున్నారని....చెరువులనైనా సరే పూడ్చివేసి వ్యవసాయ భూములుగా మార్చి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని కైకలూరు శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు
తమ కుటుంబసభ్యుల మధ్య ఆస్తి తగాదాలున్నాయని....ఈ విషయంపై పెదపారుపూడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, డీఎస్పీ స్థాయి అధికారితో తమ కేసు విచారణ చేయించి న్యాయం చేయాలని కడలి లక్ష్మీప్రసన్న వినతిపత్రం అందించారు.
చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో దళితుడు బీ కాంతారావును అగ్రకులాలకు చెందిన వారు హత్య చేశారని, ఈ కేసు విషయంపై అట్రాసిటీ చట్టం ప్రకారం మృతుని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని ఓ వ్యక్తికి ఉద్యోగం, భూమిని కేటాయించాలని బహుజన పరిరక్షణ సంఘం నాయకులుఅన్నవరపు నాగేశ్వరరావు, నీలం పుల్లయ్య అర్జీలు ఇచ్చారు.
చాట్రాయి మండలం బోలవరం గ్రామంలోని శ్మశానభూమి ఆక్రమణకు గురైందని, అక్కడ దళితులకు శ్మశానవాటిక ఏర్పాటు చేసి రహదారి నిర్మించాలని గ్రామస్తులు అర్జీ సమర్పించారు.
పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో రెండు సంతవ్సరాల క్రితం పశువుల వైద్యశాల భవనాన్ని నిర్మించారని,వెంటనే ఈ భవనాన్ని ప్రారంభించి వినియోగంలోకి తేవాలని మహాకవి గురజాడ సేవాసమితి కార్యదర్శి పరసా శివప్రసాద్ అర్జీ ఇచ్చారు.
అవనిగడ్డ, పులిగడ్డ ఆర్అండ్బీ రహదారిలో కోటగిరిలంక, సీతాయలంక వద్ద స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తుడు కర్రా సుధాకర్ వినతిపత్రమిచ్చారు.
గంపలగూడెం మండల పరిషత్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పాఠశాల విధులకు గైర్హాజరవుతూ ఉత్తర్వులు లేకపోయినా ఎంఈవో కార్యాలయంలో పనిచేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీయూటీఎఫ్ గంపలగూడెం మండల ప్రధాన కార్యదర్శి పీ ఏడుకొండలు అర్జీ ఇచ్చారు.
మచిలీపట్నం 1వ వార్డు పీకేఎం కాలనీలోని దేవునిచెరువు ప్రాంతంలో నివసించే మహిళలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని,అలాగే హెచ్‌బీ కాలనీలోని వైఎస్సార్ పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం కావాల్సిన నిధులు విడుదల చేయాలని మాజీ కౌన్సిలర్ బత్తిన శ్రీనివాసరావు (వాసు) అర్జీ ఇచ్చారు.