బేబీ బీట్‌కి బండరాళ్లైనా డాన్స్ చేయాల్సిందే...
నెట్‌ఇంట్లో
సోషల్ మీడియా రెండంచులూ పదునుగా ఉన్న కత్తి లాంటిది. ఇందులో పురోగతికి బాటలు ఉన్నాయి. అథోగతికి దారులూ ఉన్నాయి. ఇక్కడ వైభోగం, వేలం వెర్రి కలిసి సహజీవనం చేస్తాయి. బామ్మ బోసి నవ్వు నుంచి బాల ప్రతిభ దాకా అన్నీ వేయి రకాలుగా వైరల్ అవుతాయి. ఆర్భాటాల నుంచి ఆదర్శాల వరకూ అన్నీ సోషల్ మీడియా నోటీసు బోర్డుపై కనిపిస్తాయి. ఏం ఎంచుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంది. గత వారం నెట్టింట్లో వింతలు, విడ్డూరాలూ, మంచి చెడూ కలగలిపి ఇదిగో... మీ కోసం..!
బేబీ బీట్‌కి బండరాళ్లైనా డాన్స్ చేయాల్సిందే...
మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారా? అయితే ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా అనే ఈ చిచ్చర పిడుగు వీడియో చూసి తీరాల్సిందే. ఈ అయిదేళ్ల చిన్నారి లయబద్ధమైన బీట్ వాయిస్తే బండరాళ్లైనా కాలు కదిపి డాన్స్ చేయాల్సిందే! ముఖంలో తొణకని విశ్వాసంతో కనిపించే ఎడ్వర్డా బ్రెజిల్‌లోని జాయిన్విల్లే నగరంలో నివసిస్తోంది. తన బీట్స్‌తో అందరినీ అచ్చెరువొందిస్తోంది. చేయితిరిగిన వాద్యకారులు సైతం అప్పుడప్పుడు చెదిరిపోతారు.
కానీ ఈ అమ్మాయి ట్రాక్‌తో పాటు గొంతెత్తి పాడుతూ, డ్రమ్ స్టిక్స్ తిప్పుతూ, వాద్యపరికరాలపై అద్భుతాలు చేస్తోంది. ఈ బుడతకి వస్తున్న ఈలలు, చప్పట్ల రెస్పాన్స్ మహామహా సంగీత విద్వాంసులకూ రాదేమో. ఇంతా చేసి తను సంగీతంలో అడుగు మోపింది జస్ట్ ఏడాది కిందటే. అభిమన్యుడిలా తల్లి కడుపులోనే నేర్చుకుని వచ్చిందేమో అన్నంత ప్రావీణ్యంతో వాయించేస్తోంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూశారు.
http://www.sakshi.com/news/international/five-year-old-girl-stuns-a-crowd-with-an-incredible-drum-performance-294830?pfrom=home-top-story
పింక్ లడ్డూ
మంగుళూరు పబ్ దాడికి నిరసనగా పింక్ చెడ్డీ ఉద్యమం జరిగింది. దాడి చేసిన వారికి గులాబీ రంగు లో-దుస్తులు పంపి అమ్మాయిలు నిరసన తెలియచేశారు. ఇప్పుడు లండన్‌లో మరో పింక్ ఉద్యమం మొదలైంది. ఇది పింక్ చెడ్డీ ఉద్యమం కాదు. పింక్ లడ్డూ ఉద్యమం. అమ్మాయి పుడితే భారమనుకునే భారతీయ సమాజంలో చైతన్యం తెచ్చేందుకు రాజ్ ఖైరా అనే అమ్మాయి ఈ ఉద్యమం ప్రారంభించింది. లింగ వివక్షను ఎదుర్కొనేందుకు లండన్‌లోని భారతీయ స్వీట్ షాపులన్నీ అమ్మాయి పుడితే గులాబీ రంగు లడ్డూలు అమ్మేందుకు రెడీ అయ్యాయి.
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 11న ఈ ఉద్యమం మొదలైంది. ఇప్పుడిది లండన్‌లో జోరందుకుంది. తమ ప్రచారానికి ఠీఠీఠీ.ఞజీజ్చుఛీౌౌ.ౌటజ అనే వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడీ ఉద్యమం సోషల్ మీడియా సాయంతో జోరందుకుంది. ఓ సారి ఈ వెబ్సైట్ చూడండి. మీరు కూడా పింక్ లడ్డు ప్రచారోద్యమంలో భాగం కండి.
పెళ్లంటే 140 కోట్లు!
డిైజైనర్ వెడ్డింగ్‌ల సీజన్లో పోటా పోటీ మొదలైంది. ఇప్పుడు పెళ్లంటే తాళి, తలంబ్రాలు మాత్రమే కాదు. డాలర్ల వర్షం, ఫ్రాంకుల వరద, దీనార్ల తుఫాను. యోగేశ్ మెహతా అనే ఎన్నారై తన కొడుకు పెళ్లికి ముచ్చటగా మూడు రోజుల్లో 140 కోట్లు హారతి కర్పూరం చేసేశాడు. మెహతాగారు తన కొడుక్కి నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఇటలీలోని ఫ్లారెన్స్ సిటీలో పెళ్లి చేశాడు. గెస్టులకు ఖరీదైన హోటల్లో బస నుంచి మొదలు పెట్టి, మ్యూజికల్ ప్రోగ్రాముల దాకా అంతా అంగరంగ వైభోగంగా జరిగింది.
అంతకు ఒక్కరోజు ముందే రవి పిళ్లే అనే ఎన్నారై తన కూతురు పెళ్లి కూడా దాదాపు రూపాయి నోట్లతో పందిరి వేసినంతగా చేశాడు. యోగేశ్ మెహతా ఆయన్ని మించిపోయి ఖర్చు చేశాడు. మన యోగేశ్ కొడుకు పేరు రోషన్. కోడ పేరు రోషిణి. దాంతో ఆయన ఆ పెళ్లికి రోరో వెడ్డింగ్ అని పేరు పెట్టుకున్నాడు. యోగేశ్ గారు పెళ్లి ఫోటోలను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. ఇంత ఖర్చు చేసినా ఆయనకు ఒక తీరని కోరిక ఉండిపోయిందట. కొడుకును ఏనుగు మీదెక్కి ఊరేగింపుగా పెళ్లి పందిరికి తీసుకొద్దామకున్నాడు. కానీ ఫ్లారెన్స్ సిటీ కౌన్సిల్ అనుమతి ఇవ్వలేదు.
బామ్మ ఆట బంగారు బాట!
నూరేళ్ల వయసొచ్చినా తనలోని బాల్యాన్ని చంపుకోలేదు అల్బినా ఫోయిసీ అనే ఈ బామ్మ. 101 ఏళ్ల అల్బినా నూరేళ్ల తర్వాత కూడా ప్రతీ రోజూ ఒక కొత్త రోజులా ఎలా బతకాలో చెబుతోంది. అంతా అయిపోయిందన్న నైరాశ్యం వద్దు, నిరంతర ఉత్సాహమే ముద్దు అని చెప్పక చెబుతోంది. అంతే కాదు... మంచంలో పడి ఉండడం వద్దు, మంచులో ఆడుకోవడమే ముద్దు అంటోంది. మంచుతో బంతులు చేసుకుని ఆడుకుంటోంది.
మంచు కురిసే కొండపైకి కారులో షికారుకె ళుతోంది. మంచును నిదానంగా చేతుల్లోకి తీసుకొని.. ఉండలు చుట్టి.. ఆనందంతో దూరంగా విసిరేస్తోంది. ఈ వీడియోను ఆమె కొడుకు యూట్యూబ్‌లో పెట్టాడు. ఫేస్బుక్లో పెడితే ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. ఇంకా చూస్తున్నారు. మీరూ చూడండి. ఉత్సాహంతో ఉరకలు వేయండి!
http://www.sakshi.com/news/international/101-year-old-woman-playing-in-the-snow-295366?pfrom=home-top-story
సైజ్ జీరో జేజమ్మ!
యాచక వృత్తి కూడా ఇప్పుడు సోషల్ మీడియాకి ఎక్కింది. అయితే పిక్సీ ఫాక్స్ అనే అమ్మాయి చేస్తున్న భిక్షాటన ఏదో ఆకలి కేక కాదు. వెయ్యిన్నొక్క వేలం వెర్రిల్లో ఈమెది ఓ ప్రత్యేక కేటగిరీ. ఈమె జీవిత లక్ష్యం ఓ కార్టూన్ బొమ్మలా తయారు కావడం. జెస్సికా రాబిట్ అనే పద్నాలుగంటే పద్నాలుగంగుళాల నడుమున్న కార్టూన్ బొమ్మలా తయారు కావడమే ఈమె జీవన ధ్యేయం. అంటే ఈమె సైజ్ జీరోకి తాతమ్మని, సన్నని నడుముకి జేజమ్మని కోరుకుంటోందన్న మాట.
ఇందుకోసం ఈమె ఇప్పటి వరకు ఏకంగా 1,20,000 డాలర్లను ధారపోసింది. నాలుగు సార్లు ముక్కుకు, ఒకసారి పెదవులకు, ఒకసారి జఘనానికి, నాలుగు సార్లు వక్షోజాలకు సర్జరీ చేయించుకుందట. బ్రెజీలియన్ పద్ధతిలో జఘనానికి సర్జరీలు చేయించుకున్నాక చాలాకాలం మంచానికే పరిమితమైంది. ఈ మధ్య ఏకంగా ఆరు పక్కటెముకల్నీ తీయించుకుందట. తన ఫోటోలను సోషల్ మీడియాల్లో పెట్టి, నా వేలం వెర్రి సర్జరీకి ఓ వెయ్యి డాలర్లు దానం చేయండహో అంటోంది.
http://sakshipost.com/index.php/news/international/68575-model-removes-6-ribs-to-look-like-this. html?psource=Feature