వ్యక్తిగత బ్యాంకు ఖాతా తప్పనిసరి
ఒంగోలు సెంట్రల్ : ప్రతి కుటుంబానికి వ్యక్తి గత ఖాతా తప్పనిసరని, అదే విధంగా జిల్లాలో ఎన్ని కుటుంబాలకు ఇప్పటి వరకూ వ్యక్తిగత ఖాతాలు ఉన్నాయో సర్వే నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎ.పద్మజ ఆదేశించారు. గురువారం స్థానిక టీటీడీ కార్యాలయంలో ఐకేపీకి సంబంధించిన ఏసీలు, ఏపీఎంలతో ఆమె సమావేశమయ్యారు. జన్‌ధన్ పథకం కింద వ్యక్తిగత ఖాతాను ప్రారంభించిన వారికి రూపే డెబిట్ కార్డు అందిస్తారని, అదేవిధంగా లక్ష రూపాయల వరకు సంవత్సరం పాటు వ్యక్తిగత బీమా కల్పిస్తారని చెప్పారు.
అగస్టు నెలలో రూ.223 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ రూ.76 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఆరు నెలల ముగింపు సందర్భంగా అర్హత కలిగిన ప్రతి గ్రూపునకు రుణం అందజేయాలన్నారు. తీసుకున్న రుణాలను రీపేమెంట్‌కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. ఉలవపాడు, సంతమాగులూరు, చినగంజాం మండలాల్లో రీపేమెంట్లు తక్కువగా ఉన్నాయన్నారు. మండలాల్లో బ్యాంక్ లింకేజిలో సమస్యలు ఉంటే బ్యాంక్ లింకేజి డీపీఎంకు తెలియజేయాలని సూచించారు. స్త్రీనిధి రికవరీలో బాగా వెనుకబడి ఉన్నట్లు చెప్పారు.
జిల్లాలో 56 మండలాలు ఉంటే వీటిలో 50 మండలాల్లో 70 శాతం కుడా రికవరీ కావడం లేదన్నారు. స్త్రీనిధి సంమృద్ధి పథకంలో భాగంగా రూ. 9 కోట్ల లక్ష్యం నిర్దేశిస్తే కేవలం 12 శాతం అంటే కోటి 12 లక్షలు మాత్రమే డిపాజిట్లు సేకరణ జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జన్‌ధన్ పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఎకౌంట్లు తెరిపించాలన్నారు. గ్రామాల్లో బ్యాంకింక్ సేవలను ప్రజల ముంగిట తెచ్చేందుకు విలేజ్ లెవల్ ఎంట్రిప్రూనర్స్ను నియమించిన్నట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్‌కు 24 మందిని, ఆంధ్రాబ్యాంక్‌కు 10 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
వీరికి కావాల్సిన నెట్వర్క్ కార్డు, ల్యాప్‌టాప్, ప్రింటర్, వెబ్కామెరా, తదితర సామగ్రిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మండల అధ్యక్షులు సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రెండు జీరో బ్యాలెన్స్ ఎకౌంట్లను తెరిపించాలన్నారు. గ్రూపులు ఆడిట్‌ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. ఆడిట్ పూర్తి అయిన గ్రూపులకే గ్రేడింగ్‌లు ఉంటాయని, వడ్డీలేని రుణం వర్తిస్తుందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2,200 మందికి 7 కోట్ల విలువైన యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్దేశించగా 19 మండలాలు మాత్రమే పూర్తి చేసాయన్నారు. మిగిలిన 28 మండలాల్లో కుడా యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని పీడీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్డీఎం ఎల్.నరసింహారావు, డీపీఎంలు నరసింహారావు, విశాలాక్షి, ఎం.సుబ్బారావు, నారాయణ,తదితరులు పాల్గొన్నారు.