'టాటాలు లీడ్ చేస్తారు.. ఫాలో అవ్వరు'
టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నూతనోత్సవంతో రంగంలోకి దిగారు. అన్ని వ్యాపారాల్లోనూ ఇండస్ట్రి లీడింగ్ ఫర్ఫార్మెన్స్ ఉండేలా తన పాలనను కొనసాగిస్తానని వాగ్దానం చేశారు. అన్ని వ్యాపారాల్లో పరిశ్రమలన్నింటిన్నీ మనమే లీడ్ చేసేలా అందరూ కలిసి పనిచేద్దామని గ్రూప్ కంపెనీలకు పిలుపునిచ్చారు. టాటాలు లీడ్ చేస్తారు, ఫాలో అవ్వరు అని మీడియాకు తెలిపారు. ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ల వరకున్న టాటా గ్రూప్ బిజినెస్ లకు రథసారథిగా చంద్రశేఖరన్ నేడు బాంబే హౌజ్‌లో తన బాధ్యతలు స్వీకరించారు. ''నేను ఈ బాధ్యతలు స్వీకరించడం నాకు దక్కిన ఓ గౌరవం, హక్కు. ప్రతిఒక్కరూ నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నా'' అని చంద్రశేఖరన్ చెప్పారు.
గ్రూప్ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించగానే, బాంబే హౌజ్ లో టాటా సన్స్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఉదయం 9.15కు గ్రూప్ ప్రధాన కార్యాలయానికి చంద్ర చేరుకున్నారు. అనంతరం రతన్ టాటా, ఇతర బోర్డు మెంబర్లు బాంబే హౌజ్ కు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత తాత్కాలిక చైర్మన్ గా ఉన్న రతన్ టాటా నుంచి చంద్ర తన బాధ్యతలు స్వీకరించారు. 150 ఏళ్లు కలిగిన టాటా సన్స్‌కు తొలిసారి నాన్-పార్సి చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎంపికైన సంగతి తెలిసిందే.