New EO
-
స్పర్శ దర్శనం.. మహాభారం
సాక్షి, శ్రీశైలం : వారణాసి(కాశీ), శ్రీశైలం మహాక్షేత్రంలో మాత్రమే మల్లికార్జునస్వామిని స్పర్శించి దర్శించుకునే భాగ్యం ఉంటుంది. భోళాశంకరుడైన శ్రీశైల శ్రీమల్లికార్జునస్వామికి శిరస్సు తాకించి కేవలం పిడికెడు విభూది, పాలు, నీళ్లు, పత్రి సమర్పిస్తే చాలు తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ భాగ్యాన్ని కూడా శ్రీశైలానికి వచ్చే సాధారణ భక్తులు నోచుకోలేక పోతున్నారు. మల్లన్న ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో సాధారణ భక్తులు మల్లన్న స్పర్శ దర్శనం శని, ఆది, సోమవారాలలో చేసుకోవడానికి వీలు లేకుండా అప్పటి ఈఓ భరత్‌గుప్త ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటూ మాత్రమే స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆదాయమే లక్ష్యంగా టికెట్ల పెంపుదల.. మల్లన్న ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో అధికారులు ఇష్టారీతిగా సేవాటిక్కెట్లను పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు గర్భాలయ అభిషేకం రూ.1000, ముందస్తు అభిషేకం రూ.1500గా ఉండేది. ఆ తర్వాత మల్లన్న గర్భాలయంలో అభిషేకానికి రూ.5000గా నిర్ణయించారు. సామూహిక అభిషేక టికెట్‌ను రూ.1500కు పెంచేశారు. అలాగే అమ్మవారి ఆలయ శ్రీచక్రం ముందు కుంకుమార్చన టికెట్టు ధర రూ.300, అడ్వాన్స్ టికెట్లు రూ.500 ఉండేది. వాటిని కూడా ఏకంగా రూ.1000కు పెంచేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగే రుద్ర, చండీహోమం టికెట్ ధరలు రూ.750గా ఉండేవి. వాటిని ఏకంగా రెట్టింపు చేసి రూ.1500కు పెంచేశారు. కొన్నేళ్ల క్రితం వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పించే వారు. ఇప్పుడు రూ.500 వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ తీసుకున్న వారికి మాత్రమే గర్భాలయంలోకి అనుమతించి స్పర్శ దర్శనం చేయిస్తున్నారు. ఆ టిక్కెట్ల్లను కూడా పరిమితి సంఖ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయం కూడా కేవలం ఉదయం 6.30 గంటలకు, మధ్యాహ్నం 12.30కు, సాయంత్రం 6.30 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే దేవుడు దర్శనానికి క్షేత్రానికి వచ్చే భక్తులు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవా టికెట్లతో పాటు టోల్ గేట్ నుంచి టెంకాయల వరకు అధిక రేట్లు ఉండటంతో భక్తులు మండి పడుతున్నారు. కొత్త ఈఓ పాలనలో భక్తుల కష్టాలు తొలిగేనా.. ఇటీవల శ్రీశైలం ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామచంద్రమూర్తి సాధారణ భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రద్దీ లేని రోజుల్లోనైనా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం అందరికీ కల్పించాలని, రూ.5000 అభిషేకం టికెట్టు తీసుకున్న దంపతులతో పాటూ వారి వెంట ఉన్న పిలలు, వృద్ధులకు అవకాశం ఇవ్వా లని భక్తులు కోరు తున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలను అభిషేక సమయంలో తల్లిదండ్రులతో పాటూ అనుమతించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శని, ఆది, సోమవారాలు, ప్రముఖ పర్వదినాలను మినహాయించి మిగిలిన రోజుల్లో స్పర్శ దర్శ నంపై ఈఓ దృష్టి సారించాలని కోరుతున్నారు. రద్దీ రోజుల్లో వసతి గదుల కొరతతో ఇబ్బం దులు పడుతున్నారు. తక్కువ ధరతో గదులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. కొబ్బరి కాయ రూ. 20 భక్తులు స్వామిఅమ్మవార్లకు సమర్పించే కొబ్బరకాయల ధరలను కూడా శ్రీశైలదేవస్థానం వారు ఇటీవలే రెండు మార్లు పెంచేశారు. కొంతకాలం వరకు రూ.10గా ఉన్న ధర, రూ. 15, ప్రస్తుతం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు కుటుంబసమేతంగా వచ్చినా ఒక్క కొబ్బరికాయ మాత్రమే సమర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందులు కొనాల్సిందే.. శ్రీశైలదేవస్థానం ఎన్నో ఏళ్లుగా భక్తులు, స్థానికుల సౌకర్యం కోసం ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసింది. కొంతకాలం క్రితం వరకు అందులో ఉచిత వైద్యంతో పాటూ మందులు కూడా దాతల సహకారంతో ఉచితంగానే అందజేసేవారు. ప్రస్తుతం మందులు లేక పోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. టోల్ బాదుడు.. శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించడానికి నిత్యం వేల సంఖ్యలో వివిధ వాహనాల ద్వారా చేరుకుంటున్నారు. అయితే టోల్ గేట్ టిక్కెట్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. కారు, జీపు మొదలైన వాటికి రూ.100, టెంపో, ట్రాక్టర్, బస్ మొదలైన వాటికి రూ. 200, లోడ్ బండ్లకు రూ.500 వరకు టోల్గేట్ రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ టోల్గేట్ ద్వారా దేవస్థానానికి నెలకు రూ.50 లక్షలకుపై గా ఆదాయం సమకూరుతున్నా వాహనదారులకు పార్కింగ్, తదితర విషయాల్లో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. -
ప్రథమ సేవకుడిగా పనిచేస్తా
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చెంత నూతన ఈఓ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రథమ సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు. తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా భీమవరమని చెప్పారు. తాను 20 డిగ్రీ పట్టాలు అందుకుంటున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. ప్రశ్న: భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? జవాబు: శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడూ.. వసతి దొరకాలని, సంతృప్తికరమైన దర్శనం కలగాలని కోరుకుంటాడు. ప్రధాన సేవకుడిగా వారి కోరికలను నెరవేర్చడం నా బాధ్యత. మల్లన్న దర్శనానికి వచ్చే దివ్యాంగులు, గర్భిణిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. వీరి కోసం ప్రత్యేక క్యూను ఏర్పాటు చేస్తాను. ఇంత ముందులా కాకుండా నేరుగా స్వామి అమ్మవార్లను త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. ప్ర: వసతి గదులను ఏమైనా నిర్మిస్తున్నారా? జ: సాధారణ భక్తుల కోసం రింగ్‌రోడ్డు సమీపంలో 200 వసతి గదులను నిర్మిస్తున్నాం. భక్తులకు అవసరమైన డార్మెంటరీలను నిర్మిస్తాం. అలాగే అతి తక్కువ ధరతో లాకర్ బాత్రూమ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ప్ర: గతంలో ఏ ఆలయంలో ఈఓగా పనిచేశారు? జ: నేను శ్రీకాళహస్తి ఈఓగా 2010 నుంచి 2012 వరకు పనిచేశాను. అక్కడ ఉన్న సమయంలో 50 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. శ్రీశైల దేవస్థానానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా అవసరం ఉంది. ఇక్కడ అన్నదానానికి రూ.43 కోట్ల వరకు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. త్వరలో మరి కొన్నింటిని చేసే దశగా ప్రయత్నం చేస్తాను. ప్ర: పుష్కరిణి సమస్య మీ దృష్టికి వచ్చిందా? జ: వచ్చింది. పుష్కరిణిలోకి కంచిమఠం వారికి సంబంధించిన డ్రైనేజీ నీరు ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. కంచిమఠం నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. ఆలయానికి దగ్గరలో ఉడడంతో భక్తుల ఇక్కడే స్నానాలు చేయాలని చూస్తారు. వారి కోరిక మేరకు త్వరలో పూర్తి స్థాయిలో పుష్కరిణి అందుబాటులోకి తేస్తాను. ప్ర: భక్తులకు మినరల్ వాటర్ అందిస్తారా? జ: కచ్చితంగా.. క్షేత్రంలో శివగంగ జల ప్రసాద పథకం ద్వారా ఎనిమిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో కొన్ని పనిచేయడం లేదని నా దృష్టికి వచ్చింది. త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి భక్తులకు అందుబాటులోకి తెస్తాను. ప్ర: మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయనున్నారు? జ: క్షేత్రాభివృద్ధికి నా వంతుగా మాస్టర్ ప్లాన్‌లోని పనులను త్వరగతిన అమలు చేస్తాను. ఇందులో ప్రధానంగా వసతి గదులపై దృష్టి సారించాను. నందిసర్కిల్ ప్రాంతంలోని సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్.. ఆలయ ప్రధాన పురవీధిలోని దుకాణాలను తొలగించి షిప్ట్ చేయాలే ఉద్దేశంతో నిర్మించారు. వర్షాలు పడిన సమయంలో లికేజీ కాకుండా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. -
దుర్గగుడి కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ
ఇంద్రకీలాద్రి : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే కృష్ణా పుష్కరాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని, దేవస్థానం ఉద్యోగుల ఆందోళనలను త్వరలోనే సమసిపోతాయన్నారు. ఇప్పటివరకు ఉన్న ఈవో నరసింగరావుపై అర్చకులు ఆరోపణలు చేయడం, ఆందోళనకు దిగడంతో గతంలో ఈవో వ్యవహరించిన ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆందోళన విరమించిన అర్చకులు దేవస్థానం అర్చకులు శుక్రవారం తమ ఆందోళన విరమించారు. నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ ఆజాద్, దేవాదాయ శాఖ అధికారులు అర్చకులతో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు ఈవోగా వ్యవహరించిన నరసింగరావు వేధింపుల కారణంగా ఆస్పత్రి పాలైన అర్చకుడు సుబ్బారావు వైద్యానికి అయ్యే ఖర్చును దేవస్థానమే భరించాలని, అలాగే నరసింగరావును మాతృవిభాగమైన రెవెన్యూ విభాగానికి సరెండర్ చేసి సస్పెండ్ చేయాలని అర్చకులు పలు డిమాండ్లు వినిపించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఈవో ఆజాద్ చెప్పడంతో... భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆందోళనను విరమిస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు.