ఇంద్రకీలాద్రి : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే కృష్ణా పుష్కరాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని, దేవస్థానం ఉద్యోగుల ఆందోళనలను త్వరలోనే సమసిపోతాయన్నారు. ఇప్పటివరకు ఉన్న ఈవో నరసింగరావుపై అర్చకులు ఆరోపణలు చేయడం, ఆందోళనకు దిగడంతో గతంలో ఈవో వ్యవహరించిన ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఆందోళన విరమించిన అర్చకులు
దేవస్థానం అర్చకులు శుక్రవారం తమ ఆందోళన విరమించారు. నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ ఆజాద్, దేవాదాయ శాఖ అధికారులు అర్చకులతో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు ఈవోగా వ్యవహరించిన నరసింగరావు వేధింపుల కారణంగా ఆస్పత్రి పాలైన అర్చకుడు సుబ్బారావు వైద్యానికి అయ్యే ఖర్చును దేవస్థానమే భరించాలని, అలాగే నరసింగరావును మాతృవిభాగమైన రెవెన్యూ విభాగానికి సరెండర్ చేసి సస్పెండ్ చేయాలని అర్చకులు పలు డిమాండ్లు వినిపించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఈవో ఆజాద్ చెప్పడంతో... భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆందోళనను విరమిస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు.