సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చెంత నూతన ఈఓ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రథమ సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు. తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా భీమవరమని చెప్పారు. తాను 20 డిగ్రీ పట్టాలు అందుకుంటున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు.
ప్రశ్న: భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు?
జవాబు: శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడూ.. వసతి దొరకాలని, సంతృప్తికరమైన దర్శనం కలగాలని కోరుకుంటాడు. ప్రధాన సేవకుడిగా వారి కోరికలను నెరవేర్చడం నా బాధ్యత. మల్లన్న దర్శనానికి వచ్చే దివ్యాంగులు, గర్భిణిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. వీరి కోసం ప్రత్యేక క్యూను ఏర్పాటు చేస్తాను. ఇంత ముందులా కాకుండా నేరుగా స్వామి అమ్మవార్లను త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను.
ప్ర: వసతి గదులను ఏమైనా నిర్మిస్తున్నారా?
జ: సాధారణ భక్తుల కోసం రింగ్‌రోడ్డు సమీపంలో 200 వసతి గదులను నిర్మిస్తున్నాం. భక్తులకు అవసరమైన డార్మెంటరీలను నిర్మిస్తాం. అలాగే అతి తక్కువ ధరతో లాకర్ బాత్‌రూమ్‌లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం.
ప్ర: గతంలో ఏ ఆలయంలో ఈఓగా పనిచేశారు?
జ: నేను శ్రీకాళహస్తి ఈఓగా 2010 నుంచి 2012 వరకు పనిచేశాను. అక్కడ ఉన్న సమయంలో 50 కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశాను. శ్రీశైల దేవస్థానానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాలా అవసరం ఉంది. ఇక్కడ అన్నదానానికి రూ.43 కోట్ల వరకు మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. త్వరలో మరి కొన్నింటిని చేసే దశగా ప్రయత్నం చేస్తాను.
ప్ర: పుష్కరిణి సమస్య మీ దృష్టికి వచ్చిందా?
జ: వచ్చింది. పుష్కరిణిలోకి కంచిమఠం వారికి సంబంధించిన డ్రైనేజీ నీరు ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. కంచిమఠం నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. ఆలయానికి దగ్గరలో ఉడడంతో భక్తుల ఇక్కడే స్నానాలు చేయాలని చూస్తారు. వారి కోరిక మేరకు త్వరలో పూర్తి స్థాయిలో పుష్కరిణి అందుబాటులోకి తేస్తాను.
ప్ర: భక్తులకు మినరల్ వాటర్ అందిస్తారా?
జ: కచ్చితంగా.. క్షేత్రంలో శివగంగ జల ప్రసాద పథకం ద్వారా ఎనిమిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో కొన్ని పనిచేయడం లేదని నా దృష్టికి వచ్చింది. త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి భక్తులకు అందుబాటులోకి తెస్తాను.
ప్ర: మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయనున్నారు?
జ: క్షేత్రాభివృద్ధికి నా వంతుగా మాస్టర్ ప్లాన్‌లోని పనులను త్వరగతిన అమలు చేస్తాను. ఇందులో ప్రధానంగా వసతి గదులపై దృష్టి సారించాను. నందిసర్కిల్ ప్రాంతంలోని సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్.. ఆలయ ప్రధాన పురవీధిలోని దుకాణాలను తొలగించి షిప్ట్ చేయాలే ఉద్దేశంతో నిర్మించారు. వర్షాలు పడిన సమయంలో లికేజీ కాకుండా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment