సహజవాయువు ధర పెంపు 50 శాతమే!
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల కొత్త విధానంపై ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. నివేదికలో గ్యాస్ ధరను 50%మేర పెంచేందుకు వీలుగా సూచనలు చేసినట్లు అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరను రెట్టింపు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
గ్యాస్ ధరను ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కు 8.4 డాలర్లకు పెంచుతూ ఈ ఏడాది జనవరిలో వెలువడ్డ నోటిఫికేషన్‌ను సవరించేందుకు ప్రభుత్వం గత నెలలో ఒక కమిటీని నియమించింది. దీనిలో ఆయిల్ శాఖలోని అదనపు కార్యదర్శితోపాటు విద్యుత్, ఎరువులు, వ్యయ కార్యకలాపాల కార్యదర్శులుసభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయిల్ శాఖ సమీక్షించాక క్యాబినెట్‌కు పంపనున్నట్లు ప్రభుత్వాధికారి చెప్పారు. నివేదికలో విషయాలను గోప్యంగా ఉంచినప్పటికీ, గ్యాస్ ధరను రెట్టింపు చేయకుండా 50% వరకూ పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.
దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం ఒక ఎంబీటీయూకి 4.2 డాలర్లకు విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్‌కు సరఫరాకు మధ్య సమతుల్యాన్ని సాధించేలా కార్యదర్శుల కమిటీ గ్యాస్ ధరపై విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ రకాల క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై వ్యయాలనూ, విద్యుత్, ఎరువుల పరిశ్రమల డిమాండ్‌నూ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరికల్లా గ్యాస్ ధరను ప్రకటించే అవకాశమున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, గ్యాస్ ధరను ఒక ఎంబీటీయూకి 2 డాలర్ల చొప్పున పెంచితే యూరియా, విద్యుత్, సీఎన్జీ ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వానికి మాత్రం పన్నులు, రాయల్టీ రూపంలో రూ.12,900 కోట్లు అదనంగా లభిస్తాయి.