రూ.41.42 కోట్లతో..‘తుంగభద్ర’ గేట్ల మార్పు
సాక్షి, అమరావతి: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు తుంగభద్ర డ్యాంలో కాలం చెల్లిన 32 గేట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు తుంగభద్ర బోర్డు సిద్ధమైంది. ఈ పనులకు రూ.41.42 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆదివారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 32 గేట్లు అమర్చే పనులు 15 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది. టెండర్లో బిడ్ల దాఖలుకు ఈనెల 28 వరకూ అవకాశం ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తుంది. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మే 2న తెరవనుంది. తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు గేట్ల మార్పిడి పనులు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాం నిర్వహణకు కేంద్రం తుంగభద్ర బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం డ్యాం, ఎగువ, దిగువ ప్రధాన కాలువల మరమ్మతులు, లైనింగ్ తదితర పనులకు తొలుత ఏపీ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలి. ఆ తర్వాత కర్ణాటక వాటా నిధులను ఏపీకి కేంద్రం సర్దుబాటు చేస్తుంది. ఈ నిబంధన ప్రకారం తొలుత ఏపీ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉన్నా రూ.10వేలు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గేట్ల మార్పిడికి నిధుల కొరత అడ్డంకి మారిందని, అందుకే 15 నెలలు గడువు పెట్టినట్లు బోర్డు అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తరహాలో భారీ వరదలు వస్తే తుంగభద్ర డ్యాం భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదముందని, ఈ ఏడాది 80 టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిల్వ చేయకూడదని నిపుణులు సూచించారని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇది మూడు రాష్ట్రాల్లోని ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.గేట్ల మార్పులో తీవ్ర జాప్యంగతేడాది ఆగస్టు 10న తుంగభద్ర డ్యాంకు వచ్చిన భారీ వరదకు 19వ గేటు కొట్టుకుపోయింది. దాంతో కర్ణాటక వినతి మేరకు కేంద్రం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో హర్కేష్కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్ర స్థాయి పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా.. గేట్ల కాలపరిమితి ముగియడం, బలహీనంగా మారడం వల్లే 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చింది. డ్యాం భద్రత దృష్ట్యా 33 గేట్లు మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీకి సెప్టెంబరు 11న నివేదిక ఇచ్చింది. గేట్ల మార్పిడికి మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. దాంతో ఒక్కో గేటు 48 టన్నుల బరువుకు మించకుండా 14 ఎంఎం ఇనుప రేకుతో 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో రూపొందించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను కూడా ఖరారు చేసింది. కానీ.. నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో గేట్ల మార్పుపై సత్వరమే నిర్ణయం తీసుకోలేకపోయామని బోర్డు అధికారులు చెబుతున్నారు. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో కొత్త గేటు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి.. రూ.1.66 కోట్లకు అహ్మదాబాద్‌కు చెందిన సంస్థకు పనులు అప్పగించామని తెలిపారు. గేట్ల మార్పులో జాప్యం వల్ల.. డ్యాంలో పూర్తి నీటి మట్టం 105.79 టీఎంసీలకుగానూ.. 80 టీఎంసీలకు మించి నిల్వ చేయలేమని.. ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో తుంగభద్ర డ్యాంపై ఆధారపడిన 13.28 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.70 ఏళ్లుగా అవే గేట్లుతుంగభద్ర డ్యాం నిర్మించి 71 ఏళ్లు పూర్తయింది. గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు. కనీస నీటి మట్టం 1,613 అడుగులు. అదే స్థాయి నుంచి 1,633 అడుగుల వరకూ 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్పిల్‌వేకు 33 గేట్లు బిగించారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం గేట్ల కాలపరిమితి 45 ఏళ్లే. అనంతరం మార్చాల్సి ఉంటుంది. కానీ.. డ్యాం నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇప్పటిదాకా గేట్లను మార్చలేదు.