గాజు వంతెనకు బీటలు
బీజింగ్: చైనాలో యున్టయ్ కొండల మధ్య దాదాపు 300 మీటర్ల పొడుగున నిర్మించిన ఆ అపురూపమైన గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో పడిందట. ప్రత్యేక టెక్నాలజీతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ వంతెన బీటలు వారింది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటకులు ఆందోళనలోపడ్డారు. పగుళ్లను గమనించిన పర్యాటకులు అరుస్తూ పరుగులు పెట్టారట.
గత సోమవారం పర్యాటకులు వెళ్తుండగా ఓ మహిళ చేతిలో నుంచి స్టీల్ కప్ జారి వంతెన మీద పడిందని, దీంతో వంతెన పైపొర మీద పగుళ్లు వచ్చాయని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. యున్టయ్ అధికారులు కూడా ఈ వార్తలను పాక్షికంగా ధ్రువీకరించారు. మూడు గాజు పొరలతో తయారుచేసిన ఈ వంతెనలోని ఒక పొరపై ఏర్పడ్డ పగుళ్లను తమ భద్రతా సిబ్బంది గుర్తించారని తెలిపారు. పదునైన వస్తువు గట్టిగా తాకడం వల్ల ఇలా జరిగిందని, మరమ్మతు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో చైనా సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి. అయినా ఇప్పటికీ కొంతమంది ఔత్సాహిక పర్యాటకులు ఆ వంతెనపై నుంచి నడుస్తూ సాహసయాత్ర చేస్తున్న అనుభూతిని పొందుతున్నారట. పగిలిన వంతెనపై నడుస్తుంటే తన కాళ్లు కొద్దిగా వణికాయని లీ డాంగ్ వ్యాఖ్యానించాడు. అందరూ పెద్దగా అరుస్తుంటే తాను కూడా పగుళ్లు చూశానని, ఒక్కసారిగా అరుచుకుంటూ.. ముందువాళ్లను తోసుకుంటే ముందుకు పరిగెత్తానని పోస్ట్ చేశాడు.
జియాంగ్జియాజ్ అనే ప్రాంతంలో ఉన్న గ్రాండ్ కాన్యన్లో 380 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన చైనాలో ప్రపంచంలోనే అతి పెద్ద గాజువంతెనగా పేరుగాంచింది. దీని మీద నుంచి 3500 అడుగుల లోతున ఉన్న ప్రదేశాన్ని చూడవచ్చు. ఎంతటి బరువునైనా ఆపగలిగే సామర్థ్యం ఉంటుందని, ఒకేసారి దీనిపై 800 మంది సందర్శకులు వెళ్లవచ్చని గతంలో అధికారులు ప్రకటించారు. చైనాలోని తియాన్మెన్ పర్వతం దగ్గర గ్లాస్ వంతెన కన్నాఇప్పుడు నిర్మిస్తున్నది అతి పెద్ద పొడవైన గ్లాస్ వంతెన అవుతుందన్నారు.