గవర్నర్ మార్పు?
- జస్టిస్ సదాశివం, ఈఎస్ఎల్ నరసింహన్
- కేంద్రం కసరత్తు
- పరిశీలనలో జస్టిస్ సదాశివం పేరు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో మరొకరిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినా రాకపోవడంతో.. మనస్తాపం చెంది బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆయన కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఒకవైపు నరసింహన్ అన్ని అంశాల్లో తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తూ పదేపదే గవర్నర్ను మార్చాలని పట్టుబడుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ పరిష్కారం కావాలని, ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు న్యాయ నిపుణులైన వారిని గవర్నర్గా నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేరళ గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.