కొత్తగా 15 లక్షల మంది జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలైలో 14.9 లక్షల మంది కొత్త జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 67.26 కోట్లకు పెరిగిందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర వివరాలు..,
జూలైలో ఎయిర్సెల్కు అధికంగా కొత్త వినియోగదారులు లభించారు. కొత్తగా లభించిన 7.55 లక్షల మందితో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.17 కోట్లకు పెరిగింది.
మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్టెల్కు 4.76 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.13 కోట్లకు చేరింది. కంపెనీ మార్కెట్ వాటా 28.45 శాతానికి పెరిగింది. 3 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 12.52 కోట్లకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 18.62 శాతంగా ఉంది.
మొబైల్ వ్యాస్ మార్కెట్ ః రూ.29,900 కోట్లు
ఈ ఏడాది చివరికి మొబైల్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మార్కెట్ 15% వృద్ధితో రూ.29,900 కోట్లకు చేరుతుందని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. 2012లో ఎంవ్యాస్ మార్కెట్ రూ.26,000 కోట్లుగా ఉంది. ఈ ఏడాది కన్సూమర్ సెగ్మెంట్ మార్కెట్ రూ.29,300 కోట్లకు, ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్ మార్కెట్ రూ.600 కోట్లకు పెరుగుతుంది.