New Moon
-
శ్రీకాంత్ నా లక్కీ హీరో
‘‘నాది ఖమ్మం. 2002లో ఇండస్ట్రీకి వచ్చాను. సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. డి.ఎస్.రావుగారి సహకారంతో సాగర్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అదే నాకు ఈ రోజు బాగా ఉపయోగపడింది’’ అని డైరెక్టర్ హరీష్ వడ్త్యా అన్నారు. శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సంగీత ముఖ్య తారలుగా హరీష్ వడ్త్యా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. మ్యాక్ ల్యాబ్స్ పతాకంపై మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. నందన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను శ్రీకాంత్, మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ విడుదల చేశారు. హరీష్ వడ్త్యా మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో నాకెవరూ గాడ్‌ఫాదర్ లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతగారే నా దేవుడు. మరో సినిమా కూడా నాతో చేస్తానని మాట ఇచ్చారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు మొహ్మద్ జాకీర్ ఉస్మాన్. ‘‘మై లక్కీ హీరో శ్రీకాంత్. మేమిద్దరం ఐదు చిత్రాల్లో నటించాం. ఈ చిత్రం నా సెకండ్ ఇన్నింగ్స్’’ అన్నారు సంగీత. ‘‘ఎక్కడా ఏ పొరపాటు రాకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని చాలా చక్కగా చేసిన చిత్రమిది’’ అని శ్రీకాంత్ అన్నారు. జిషాన్ ఉస్మాన్, మ్యూజిక్ డైరెక్టర్ నందన్, దర్శకుడు సాగర్, నటులు బ్రహ్మానందం, అలీ, అజయ్, వెంకట్, దర్శకుడు రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
వెలుతురు పండుగ
అమావాస్య రోజున జరుపుకొనే వెలుతురు పండుగ దీపావళి.దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ప్రతీకగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొనేపండుగ ఇది. హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా దీపావళి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకొంటారు.దీపావళి నాటి రాత్రి పల్లెలు మొదలుకొని మహా నగరాల వరకు దీపకాంతులతో కనువిందు చేస్తాయి. బాణసంచా వెలుగులతో నింగీనేలా ధగధగలాడిపోతాయి. చీకటిని తరిమి వెలుతురు నింపే దీపావళి విశేషాలు... లోక కంటకుడైన నరకాసురుడిని సత్యభామ సాయంతో చతుర్దశి రోజున సంహరించాడు. నరకాసురుడు మరణించిన మర్నాడు జనాలందరూ అతడి పీడ విరగడైనందుకు సంబరాలు చేసుకున్నారు. ఊరూ వాడా ఇంటింటా దీపాలు వెలిగించుకున్నారు. అప్పటి నుంచి నరక చతుర్దశి మర్నాడు అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణాల కథనం. క్రూరుడైన నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించేవాడు. కంటికి నచ్చిన స్త్రీనల్లా చెరపట్టేవాడు. అతడి భయానికి స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. రాత్రివేళల్లో ఇళ్లలో దీపాలను వెలిగించుకోవడానికి కూడా భయపడేవారు. మహా బలవంతుడైన నరకుడిని దేవ దానవ మానవులలో ఎవరూ ఎదిరించలేకపోయేవారు. తనకు ఎదురే లేకపోవడంతో నరకాసురుడు యథేచ్ఛగా ముల్లోకాలనూ పీడించేవాడు. అతడి బాధలను తాళలేని దేవతలు, మునులు మహావిష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. కృష్ణావతారంలో తాను అతడిని అంతమొందిస్తానని విష్ణువు వారికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే కృష్ణావతారంలో నరకుడిపై యుద్ధానికి దిగుతాడు. నరకునితో జరిగిన యుద్ధానికి కృష్ణుడితో పాటు సత్యభామ కూడా వెళుతుంది. నరకుడి సేనాని మురాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో హతమవుతాడు. నరకుడు క్రోధావేశంతో కృష్ణుడితో తలపడతాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు కాసేపు సొమ్మసిల్లిపోతాడు. అప్పుడు సత్యభామ స్వయంగా ధనుర్బాణాలు ధరించి నరకుడితో యుద్ధం కొనసాగిస్తుంది. సత్యభామ పోరు సాగిస్తుండగా మెలకువలోకి వచ్చిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకుడిని అంతమొందిస్తాడు. లోకాలను వణికించే నరకుడిపై సత్యభామ ధైర్యంగా పోరు సాగించిన కారణంగా దీపావళిని స్త్రీశక్తికి ప్రతీకగా భావిస్తారు. ఐదు రోజుల వేడుకలు దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు కొనసాగుతాయి. ఆశ్వీయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’గా జరుపుకొంటారు. ఉత్తరాదిలో దీనినే ‘ధన్ తెరాస్’ అంటారు. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఇదే రోజు ధన్వంతరి, లక్ష్మీదేవి ఉద్భవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరికి, ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి పుట్టిన రోజు ధనత్రయోదశి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుతూ ఈ రోజు ధన్వంతరికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధనత్రయోదశి మర్నాడు వచ్చే నరక చతుర్దశి నాడు అభ్యంగన స్నానాలు ఆచరించి, ఇళ్లకు అలంకరణలు చేస్తారు. దీపావళి వేడుకలకు సన్నాహాలు ప్రారంభిస్తారు. దీపావళి రోజున ప్రధానంగా లక్ష్మీపూజ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవితో పాటు గణపతికి, సరస్వతికి, కుబేరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. మార్వాడీలకు, గుజరాతీలకు దీపావళి నాటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. వారు నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటారు. బంధు మిత్రులకు మిఠాయిలు పంచుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సాయంత్రం చీకటి పడగానే ఇళ్ల ముందు వరుసగా దీపాలను వెలిగించి, బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చడం వల్ల దుష్టశక్తులు పారిపోతాయని విశ్వసిస్తారు. రావణ వధ తర్వాత సీతా రామలక్ష్మణులు దీపావళి రోజునే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని పురాణాలు చెబుతాయి. దీపావళి మర్నాడు వచ్చే కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా పాటిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమి రోజునే ‘పడ్వ’ అని అంటారు. దంపతుల మధ్య పరస్పర అనురాగం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి ప్రీతి కోసం గోవర్ధన పూజ చేస్తారు. కార్తీక శుద్ధ విదియ రోజున కొన్ని ప్రాంతాల్లో ‘భాయీ దూజ్’గా పాటిస్తారు. రక్షాబంధనం తరహాలోనే సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి చిహ్నంగా ఈ పండుగ జరుపుకొంటారు. అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. సోదరులను ఇంటికి పిలిచి పిండివంటలతో భోజనం పెడతారు. యముడికి అతడి సోదరి యమున ఇదేరోజు ఆతిథ్యం ఇచ్చిందని పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఈ పండుగను ‘యమ ద్వితీయ’ అని కూడా అంటారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం, బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. కాళీమాతను ఆరాధిస్తారు. విదేశాల్లో దీపావళి దీపావళి వేడుకలను భారత్‌తో పాటు పలు దేశాల్లో ఘనంగా జరుపుకొంటారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, మలేసియా, సింగపూర్, ఫిజి, సురినేమ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, పాకిస్తాన్‌లోని సిం«ద్ రాష్ట్రంలో దీపావళి అధికారిక సెలవుదినం కావడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఇండోనేసియా, కరీబియన్ దీవులు, అమెరికాలలోనూ దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో కూడా దీపావళి వేడుకలను ఏటా నిర్వహిస్తుండటం విశేషం. బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో దీపావళి వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. భారత్‌లోని నగరాల తర్వాత లీసెస్టర్ నగరంలోనే అంత ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతాయి. సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో కూడా దీపావళిని దేదీప్యమానంగా జరుపుకొంటారు. నేపాల్‌లో దీపావళిని ‘తీహార్’ అని, ‘స్వాంతి’ అని అంటారు. భారత్‌లో మాదిరిగానే నేపాల్లోనూ దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు చేసుకుంటారు. మొదటిరోజును ‘కాగ్ తీహార్’ అంటారు. ఆ రోజు కాకులకు ఆహారం పెడతారు. రెండో రోజు ‘కుకుర్ తీహార్’ అంటారు. ఆ రోజు శునకాలను అలంకరించి, వాటికి ఆహారం పెడతారు. మూడో రోజు ‘గాయి తీహార్’ సందర్భంగా గోవులను పూజిస్తారు. అదేరోజు లక్ష్మీపూజ చేస్తారు. సాయంత్రం ఇళ్ల ముంగిట దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తారు. దీపావళి మర్నాడు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ తర్వాతి రోజు భారత్‌లో ‘భాయి దూజ్’ జరుపుకొన్నట్లే నేపాలీలు ‘భాయి టీకా’ వేడుకలు జరుపుకొంటారు. మహిళలు తమ సోదరులను ఇళ్లకు ఆహ్వానించి, వారి నుదట తిలకం దిద్ది, విందు భోజనాలు పెడతారు. నేపాల్‌లోని నేవార్ బౌద్ధులు వజ్రయాన సంప్రదాయం ప్రకారం దీపావళి సందర్భంగా ‘మహాపూజ’ నిర్వహిస్తారు. ఇండోనేసియాలోని బాలి దీవిలో దీపావళిని ‘గలుంగాన్’ అంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ తమిళులు సుమత్రా దీవిలోని మరియమ్మన్ ఆలయంలో దీపావళికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్‌లోనూ అక్కడి భారతీయులతో పాటు స్థానికులు కూడా దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీపావళి గురించి అవీ ఇవీ... ►దీపావళి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలు వివిధ పద్ధతుల్లో జరుపుకొంటారు. ఇది ఒకే మతానికి పరిమితమైన పండుగ కాదు, నాలుగు మతాల వారు జరుపుకునే పండుగ. ►వర్ధమాన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినందున జైనులు ఈ రోజును అత్యంత పవిత్రదినంగా భావిస్తారు. మహావీరుడిని తలచుకుంటూ జైనులు తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగిస్తారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ చెర నుంచి సిక్కుల మతగురువు గురు హరగోవింద్ సింగ్ విడుదలైన రోజు కావడంతో సిక్కులు కూడా దీపావళి రోజున వేడుకలు చేసుకుంటారు. క్రీస్తుశకం 1577 సంవత్సరంలో ►దీపావళి రోజునే అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన జరగడం విశేషం. ►దీపావళి రోజున దేశవ్యాప్తంగా కాల్చే బాణసంచా విలువ వందలాది కోట్ల రూపాయల మేరకు ఉంటుంది. తమిళనాడులోని శివకాశీలో బాణసంచా తయారీ పరిశ్రమ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ తయారైన బాణసంచా దేశ విదేశాలకు సరఫరా అవుతుంది. ►క్రీస్తుశకం ఆరోశతాబ్ది కాలంలో చైనావారు బాణసంచా తయారీలో కీలకమైన పొటాషియం నైట్రేట్‌ను కనుగొన్నారు. బాణసంచా కనుగొనడానికి ముందు దీపావళి వేడుకల్లో కేవలం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. ►మందుగుండు కనుగొన్న తర్వాత చిత్రవిచిత్రమైన బాణసంచా సామగ్రిని తయారు చేసేవారు. దీపావళి రోజున బాణసంచా కాల్చడం మన దేశంలో క్రమంగా వాడుకలోకి వచ్చింది. ఇతర దేశాల్లోనూ వివిధ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం మొదలైంది. ►అమెరికాలో ఏటా ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు జూలై 4న భారీస్థాయిలో బాణసంచా కాలుస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా బాణసంచా వినియోగించే సంస్థగా ‘వాల్డ్ డిస్నీ’ రికార్డులకెక్కింది. ►బ్రిటిష్ పాలకులకు బాణసంచా కాల్పులంటే చాలా ఇష్టం ఉండేది. బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ వైవిధ్యభరితమైన బాణసంచా సామగ్రి తయారు చేసే వ్యక్తి కోసం ఏకంగా ‘ఫైర్ మాస్టర్ ఆఫ్ ఇంగ్లండ్’ అనే ఆస్థాన పదవిని కల్పించింది. బ్రిటిష్ రాజు రెండవ జేమ్స్‌కు కూడా బాణసంచాపై విపరీతమైన మోజు ఉండేది. తన పట్టాభిషేక వేడుకల్లో వింతవింత బాణసంచా కాల్పులను ప్రదర్శించిన వ్యక్తిని ‘నైట్‌హుడ్’తో సత్కరించాడు. -
దీపాంజలి
చీకటిని తరిమేసే వెలుగుల పండుగ దీపావళి. ఇది అమావాస్య రోజున వచ్చే వెన్నెల పండుగ. చెడును దునుమాడటంలో పడతి సాహసానికి ప్రతీకగా నిలిచే పండుగ. పిల్లలూ పెద్దలూ సంబరంగా జరుపుకొనే పండుగ. ఇంటిల్లిపాదీ సందడి సందడిగా జరుపుకొనే పండుగ ఇది. మన దేశం నలుమూలల్లోనే కాదు, ఖండ ఖండాంతరాల్లోనూ దేదీప్యమానంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మాత్రమే కాదు, జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా వేడుకగా జరుపుకొనే పండుగ ఇది. ప్రపంచంలో అత్యధికులు జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. రంజాన్, క్రిస్మస్ల తర్వాత ఎక్కువ మంది జరుపుకొనే పండుగ దీపావళి మాత్రమే. దీపావళిని ప్రధానంగా హిందువుల పండుగగా భావిస్తారు గాని, ఈ పండుగను జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా తమ తమ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 102.2 కోట్ల మందికి పైగా ప్రజలు దీపావళిని వివిధ రీతుల్లో జరుపుకొంటారు. దీపావళి నేపథ్యానికి సంబంధించి నరకాసుర వధ గాథ అందరికీ తెలిసినదే. నరకాసురుడితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు అలసి సొలసి సొమ్మసిల్లిపోతే సత్యభామ సాహసోపేతంగా నడుం బిగించి, విల్లు సంధించింది. శ్రీకృష్ణుడు తెప్పరిల్లే వరకు నరకుడిని నిలువరించింది. చివరకు శ్రీకృష్ణుడు చక్రాయుధం సంధించి నరకుడిని వధించాడు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి రోజున నరకాసురుడి పీడ విరగడ కావడంతో ఆ మరునాడు అమావాస్య నాడు ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఏటా నరక చతుర్దశి మర్నాడు జనం ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి ప్రాశస్త్యానికి సంబంధించి మరికొన్ని పౌరాణిక విశేషాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీరాముడి పద్నాలుగేళ్ల వనవాసం దీపావళి రోజునే ముగిసిందట. లంకలో రావణ సంహారం తర్వాత సీతారామ లక్ష్మణులు దీపావళి నాడే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని ప్రతీతి. పాండవుల పన్నెండేళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం కూడా దీపావళి రోజునే ముగిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఐదురోజుల వేడుక దీపావళి వేడుకలు ఐదు రోజులు సాగుతాయి. అమావాస్యకు రెండు రోజుల ముందు అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. ఈ త్రయోదశి నాడే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, ధన్వంతరి జన్మించారని, అందుకే ఇది ధనత్రయోదశిగా పేరు పొందిందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని పూజించే ఆచారం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. లక్ష్మీదేవి జన్మించిన ధనత్రయోదశి రోజున కొత్త వస్తువులు, ఆభరణాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేయడం శుభదాయకమని చాలామంది నమ్ముతారు. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి నాడు వేకువ జామునే నిద్రలేచి మంగళ హారతులిచ్చి, పూజలు చేస్తారు. దీపావళి వేడుకలకు సన్నాహంగా ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని, సరస్వతిని, కుబేరుడిని కూడా పూజిస్తారు. సాయంత్రం ఇంటి ముందు వరుసగా దీపాలు పెట్టి, బాణసంచా కాలుస్తారు. మార్వాడీలకు, గుజరాతీలకు, నేపాలీలకు దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ ప్రాంతాల్లోని వ్యాపార వర్గాల వారు దీపావళి రోజు నుంచే తమ తమ వ్యాపారాలకు చెందిన జమా ఖర్చుల లెక్కలకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. దీపావళి మర్నాడు... కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అంటారు. బలి చక్రవర్తిని వామనావతారంలో వచ్చిన విష్ణువు పాతాళానికి అణగదొక్కినది ఈరోజేనని ప్రతీతి. ఇదే రోజు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి తాకిడి నుంచి గోపాలకులను, గోవులను కాపాడాడని కూడా పురాణాలు చెబుతాయి. కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త భోజనంగా పాటిస్తారు. రక్షాబంధనాన్ని తలపించే పండుగ ఇది. ఈ రోజున సోదరులు తమ తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనాన్ని ఆరగించి, వారికి కానుకలను బహూకరిస్తారు. తూర్పున కాళీపూజలు దీపావళి రోజున దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో లక్ష్మీదేవి పూజలు చేయడం ఆనవాయితీగా ఉంటే, తూర్పు ప్రాంతాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం రాష్ట్రాల్లో కాళీపూజలు చేస్తారు. కాళీపూజను ఒడిశా, బెంగాల్, అసోంలలో శ్యామాపూజగా కూడా వ్యవహరిస్తారు. బిహార్‌లోని మైథిలీ ప్రజలు దీనిని మహానిశా పూజగా వ్యవహరిస్తారు. పద్దెనిమిదో శతాబ్దిలో బెంగాల్‌లోని నవద్వీప ప్రాంతాన్ని పాలించిన రాజా కృష్ణచంద్ర హయాంలో కాళీపూజలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీధుల్లో కాళీమాత మంటపాలను ఏర్పాటు చేసి పూజలు చేసే పద్ధతి అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇదేరోజు రామకృష్ణ పరమహంస శారదాదేవిని షోడశిగా ఆరాధించినట్లు ప్రతీతి. అందుకే బెంగాల్‌లోని కాళీ మంటపాల్లో రామకృష్ణ పరమహంస, శారదాదేవి దంపతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇతర మతాలకూ పవిత్ర దినం దీపావళిని హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా పవిత్ర దినంగా భావిస్తారు. వర్ధమాన మహావీరుడు దీపావళి నాడే నిర్యాణం చెందాడు. ఆయన ప్రధాన శిష్యుడైన గౌతమ గాంధార స్వామి అదే రోజున ‘కేవల జ్ఞానం’ పొందాడు. అందుకే జైనులు దీనిని సంస్మరణ దినంగా జరుపుకొంటారు. జైన దేవాలయాల్లో దీపావళి ఉదయాన్నే వర్ధమాన మహావీరుడికి ‘నిర్వాణ లడ్డూ’ను నివేదిస్తారు. నేపాల్, మయాన్మార్ దేశాల్లో వజ్రయాన శాఖకు చెందిన బౌద్ధులు దీపావళిని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్‌లోని నేవార్ తెగవారు దీపావళి రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని, విష్ణువును ఆరాధిస్తారు. మయాన్మార్లోనైతే పగోడాలను సైతం దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ చెర నుంచి సిక్కు గురువు గురు హరగోవింద్ విముక్తి పొందినది దీపావళి రోజునే కావడంతో సిక్కులు దీనిని పవిత్ర దినంగా భావిస్తారు. దీనిని వారు ‘బందీ ఛూడ్ దివస్’గా పాటిస్తారు. సిక్కులు తమ దేవాలయాలను దీపాలతో అలంకరించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటారు. దేశదేశాల్లో దీపావళి దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్, భూటాన్, శ్రీలంక, మయాన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, సురినామ్, గుయానా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, బ్రిటన్, కెనడా, అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో తదితర దేశాల్లోనూ ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో కూడా భారత్ మాదిరిగానే ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి. దీపావళిని నేపాలీలు ‘తీహార్’ అని, ‘స్వాంతి’ అని వ్యవహరిస్తారు. దీపావళి సందర్భంగా నేపాలీలు లక్ష్మీపూజలతో పాటు పశుసంపదను కూడా పూజిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్, మెల్బోర్న్ తదితర నగరాల్లో అక్కడ స్థిరపడ్డ భారతీయులతో పాటు స్థానిక ఆస్ట్రేలియన్లు కూడా ఉత్సాహంగా బాణసంచా కాల్చే వేడుకల్లో పాల్గొంటారు. ఇండోనేషియాలో దీపావళిని ‘గులుంగాన్’గా వ్యవహరిస్తారు. ‘గులుంగాన్’ రోజున పూర్వీకుల ఆత్మలు భూమ్మీదకు వస్తాయని ఇండోనేషియన్లు విశ్వసిస్తారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో దీపావళి వేడుకల కోసం ప్రత్యేకంగా ‘దివాలీ నగర్’ అనే ప్రదేశమే ఉంది. దీపావళి రోజున ‘దివాలీ నగర్’ దీపాలంకరణతో, బాణసంచా కాల్పులతో దేదీప్యమానంగా మెరుపులీనుతూ కనువిందు చేస్తుంది. నేపాల్, శ్రీలంక, ఫిజీ, మారిషస్, సింగపూర్ తదితర దేశాల్లో దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు. పాకిస్థాన్ ప్రభుత్వం సైతం ఈ ఏడాది దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం విశేషం. పాకిస్థాన్‌లోని స్వల్పసంఖ్యాకులైన హిందువులతో పాటు అక్కడి ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా కొందరు దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అగ్రరాజ్యాల్లో అధికారిక వేడుకలు అగ్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికాల్లో స్థిరపడిన హిందువులు దశాబ్దాలుగా దీపావళి వేడుకలను జరుపుకొంటూ వస్తున్నారు. అయితే దాదాపు దశాబ్ద కాలంగా లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం వద్ద సైతం దీపావళి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తూ ఉండటం విశేషం. గార్డన్ బ్రౌన్ బ్రిటన్ ప్రధానిగా ఉండగా మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికాలో ఉండే దాదాపు ముప్పయి లక్షల మంది హిందువులు కూడా దశాబ్దాలుగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించడం 2003 నుంచి మొదలైంది. ఆ తర్వాత 2007లో అమెరికన్ కాంగ్రెస్ దీపావళికి అధికారిక హోదా కల్పించింది. వైట్‌హౌస్‌లో జరిగే దీపావళి వేడుకల్లో స్వయంగా పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే. ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా 2009లో జరిగిన వేడుకల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, దీపావళి సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం విశేషం. బాణసంచా చరిత్ర బాణసంచా కాల్చనిదే దీపావళి సంబరాలకు నిండుదనం ఉండదు. దీపావళి అంటే దీపాల వరుస అనే అర్థం ఉంది. అలాగని కేవలం ఇళ్ల ముందు వరుసగా దీపాలను పేర్చి అంతటితో సరిపెట్టుకోరు. బాణసంచా అందుబాటులోకి రాకముందు కేవలం దీపాలు వెలిగించి, పూజపునస్కారాలతో సరిపెట్టుకునే వారేమో గాని, బాణసంచా అందుబాటులోకి వచ్చాక బాణసంచా కాల్చనిదే దీపావళి వేడుకలు పూర్తయిన సందర్భాలు చరిత్రలో చాలా అరుదు. ఎప్పుడో ఔరంగజేబు కాలంలో కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే బాణసంచా వాడుకపై నిషేధం అమలులో ఉండేది. ఆ తర్వాత మరెన్నడూ బాణసంచా వెలుగులు లేకుండా దీపావళి జరగనే జరగలేదు. బాణసంచాకు దాదాపు 2200 ఏళ్ల చరిత్ర ఉంది. చైనా దేశస్థులు మొదట్లో జంతువులను భయపెట్టడానికి వెదురు బొంగులను కాల్చి పేలుడు శబ్దాన్ని సృష్టించేవారు. కాలక్రమంలో వారు పొటాషియం నైట్రేట్‌ను (సురేకారం) కనుగొన్నారు. సురేకారం, గంధకం, బొగ్గు రకరకాల పాళ్లలో మేళవించడం ద్వారా పేలుడు పదార్థాలను, వాటిలో మరికొన్ని రసాయనాలను మేళవించడం ద్వారా రకరకాల బాణసంచా సామగ్రిని తయారు చేయడం తెలుసుకున్నారు. బాణసంచా వెలుగులు, పేలుళ్లతోనే దీపావళికి కళాకాంతులు వస్తాయని చాలామంది భావిస్తారు. ఇదిలా ఉండగా బాణసంచా వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందనే ప్రచారం ఊపందుకోవడంతో ఇటీవలి కాలంలో కొందరు బాణసంచా లేకుండానే దీపావళి జరుపుకొంటున్నారు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ. దీపావళి జాగ్రత్తలు ► బాణసంచా కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. టపాసులు చేతిలోనే పేలిపోవడం, చిచ్చుబుడ్లు, మతాబుల నుంచి శరవేగంగా ఎగజిమ్మే నిప్పురవ్వలు ఒంటి మీదపడి గాయపడటం వంటి ప్రమాదాలు అక్కడక్కడా చోటు చేసుకుంటూ ఉండటం మామూలే. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు లేకుండా ఆనందంగా దీపావళి జరుపుకోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం ఈ జాగ్రత్తలు పాటిద్దాం... ► బాణసంచా కాల్చేటప్పుడు వీలైనంత వరకు కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది. ►కాకరపువ్వొత్తులు, మతాబులు వంటివి కాల్చేటప్పుడు చేతిని పూర్తిగా చాచి ఒంటికి దూరంగా ఉండేలా వాటిని కాల్చడం మంచిది. చిన్నపిల్లలు వీటిని కాల్చేటప్పుడు పెద్దలెవరైనా వారికి సహాయంగా ఉండటం మంచిది. ► టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను ఇళ్లకు దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. పిల్లలు ఇలాంటి పేలుడు పదార్థాలను ఇళ్ల దగ్గర కాల్చకుండా పెద్దలు వారిపై ఓ కన్నేసి ఉంచడం క్షేమం. ► కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత కూడా కొంతసేపటి వరకు వాటికి నిప్పు అంటుకునే ఉంటుంది. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు నీటి బకెట్లో పడేయడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చు. ► బాణసంచా కాల్చేటప్పుడు ఇంట్లో ఉన్న అందరూ ఒకేసారి కాల్చకుండా, ఒకరి తర్వాత ఒకరు కాల్చడం ద్వారా కూడా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. ► రాకెట్లు, తారజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా వాటి దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి. -
అర్చకులు లేని ఆలయం
♦ యాగభూమిలో రాజరాజేశ్వరీమాత ♦ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా దేవీపురం ♦ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన శ్రీచక్రాలయం ♦ భక్తుల చేతే అభిషేకాలు అమ్మవారు బిందుస్థానంలో సృష్టికార్యంలో ఉన్న భంగిమలో ఉంటారు. గర్భాలయంలో మాత్రం నిండైన వస్త్రధారణతో దర్శనమిస్తారు. పౌర్ణమి, అమావాస్య రోజులలో మాత్రమే అమ్మవారికి పంచామృతా భిషేకాలు. ♦ నేరుగా భక్తులే అభిషేకాలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. జలం, పాలు, పెరుగు, తేనే, పళ్ళరసాలతో అభిషేకాలు జరుపుతారు. ♦ ప్రతి నెలా పౌర్ణమికి ముందు శ్రీవిద్యసాధన తరగతులు నిర్వహిస్తారు. ఇతర ఆధ్యాత్మిక సేవలపైనా శిక్షణ ఇస్తారు. ♦ అమావాస్య తరువాత శ్రీ విద్యసాధన రెండో దశ ఉంటుంది. ♦ అమ్మవారి రథం, అమృతానందస్వామి విగ్రహా ప్రతిష్టాపన చెప్పుకోదగినవి. ♦ తొమ్మిది కొండల నడుమన మనోహర దృశ్యం. ♦ దాపున అల్లుకుపోయిన ప్రకృతి పరవశం. ♦ దారంతటా ఆకుపచ్చని తోటలు.. చుట్టూ జీడిమామిడి తోటల సోయగం. ఎటు చూసినా పచ్చదనంతో విలసిల్లుతున్న దేవీపురంలో ‘సహస్రాక్షి’ నామంతో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు భక్తుల కొంగుబంగారమై అలరారుతోంది. శ్రీచక్ర మహాయంత్ర ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. ప్రపంచంలో శ్రీచక్ర యంత్రం ప్రమాణాలతో నిర్మించిన ఆలయం ఇదొక్కటే అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు అతి చేరువలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నిత్యం వేలాది భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటోంది. దేవీ సంకల్పమే! ఇక్కడ ఆలయ నిర్మాణం దైవ సంకల్పంతో జరిగిందనడానికి కథనాలు ఉన్నాయి.. ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌లో శాస్త్రవేత్తగా ఉన్న నిష్టల ప్రహ్లాదశాస్త్రి(అమృతానంద సరస్వతిస్వామీ)కి ధ్యానంలో అమ్మవారు కనిపించారని, అనువైన చోట తనకు నచ్చిన రీతిలో ఆలయం నిర్మించమని ఆదేశించారని కథనం. ఎన్నో ప్రాంతాలను సందర్శించిన ప్రహ్లాదశాస్త్రి ఓసారి విశాఖలోని ప్రహ్లాద కల్యాణ మండపంలో జరిగిన దేవీయాగానికి హాజరయ్యారు. అక్కడ అమ్మ శక్తి ఉందని ఎన్నో సంఘటనల ద్వారా శాస్త్రిగారికి తేటతెల్లమైంది. దీంతో వేదుల, పుట్రేవు (దేవీపురం ఆలయ భూములు వీరివే) సోదరులను కలిశారు. దేవీ సన్నిధిలోనే శ్రీ చక్రాలయం నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. ప్రహ్లాదశాస్త్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో ఆలయ నిర్మాణంలో నిమగ్నమైపోయారు. 1983లో అమ్మవారిని ప్రతిష్టించగా 1985 నాటికి ఆలయం పూర్తయ్యింది. ఇక్కడ ఇగ్లూ నివాసాలను తలపించేలా నిర్మించిన డోమ్ ఇళ్ళు ప్రత్యేకార్షణ. పీఠంలో శివలింగాల సమూహం, దక్షవాటిలో ద్విసహస్ర లింగాల ఏర్పాటును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! 108 దేవతా మూర్తులు శ్రీరాజరాజేశ్వరీ ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో 108 దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఐదు అంతస్తుల్లో ఉన్న శ్రీచక్రాలయంలో అణిమాసిద్దులు, బ్రహ్మాది శక్తులు, రుద్రాది శక్తులైన 28 మంది దేవతల విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. శ్రీచక్ర ఆలయం ప్రాంగణంలోని దేవతా విగ్రహాలను శృంగారభరిత భంగిమల్లో నిర్మించినా నగ్నత్వంలోనే దైవత్వం ఉందన్నది ఆధ్యాత్మిక వేత్తల విశ్లేషణ. ఖండాంతర ఖ్యాతి శ్రీ విద్యసాధన వల్ల, ఆలయ ప్రత్యేకత వల్ల దేవీపురం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రాష్ట్రంలోని భక్తులతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. శ్రీచక్ర ఉపాసన విద్యలు నేర్చుకునేవారి సంఖ్య ఇక్కడ అధికం. చుట్టూ జీడిమామిడి, మామిడి తోటలతో పాటు పచ్చటి పొలాలు, కొండలు ప్రకృతికి ప్రతిరూపంగా ఉంటుంది ఈ ప్రాంతం. దీంతో ఉత్తరాంధ్రలోనే పెద్ద పిక్నిక్‌స్పాట్‌గా దేవీపురం పేరుగాంచింది. - సమ్మంగి భాస్కర్, సాక్షి,పెందుర్తి, విశాఖపట్నం ఇలా చేరుకోవచ్చు ♦ ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖపట్నంలోని ద్వారకా బస్‌స్టేషన్‌కు దేవీపురం సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది సబ్బవరం నుంచి 6 కిలోమీటర్ల దూరం. సబ్బవరం-అనకాపల్లి సరిహద్దులో దేవీపురం ఉంది విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు 28 కిలోమీటర్ల దూరం ♦ అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి 18 కిలోమీటర్లు. ♦ విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు సుమారు 20 కిలోమీటర్లు దేవీపురానికి నర్సీపట్నం-ఆనందపురం జాతీయరహదారి (బైపాస్) రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. మతాలకు అతీతంగా! కులమత భేదాలు, ఆర్థిక తారతమ్యాలు, వయసుతో ఇక్కడ పనిలేదు. కేవలం అమ్మవారి పట్ల భక్తి ఉంటే చాలు. - కందర్బ ప్రభాకర్, ఆలయ నిర్వాహకులు సేవలో తరిస్తాను ఇక్కడ అమ్మవారి దివ్యరూపం చూడడం మాటల్లో చెప్పలేని అనుభూతి. నమ్మిన భక్తులకు ఏం కావాలో అమ్మకు తెలుసు. అమ్మ మీద ఉన్న భక్తితో ఆమెను కొలవడానికి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తాను. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటాను. ఇక్కడకు రావడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. - మహేశ్వరీ (సుందరమ్మ), ముంబై ఎదురుచూస్తుంటాను ఇక్కడ ప్రత్యేకంగా అర్చకులు ఉండరు. నెలలో రెండుసార్లు మాత్రమే జరిగే అభిషేకాలను భక్తులతోనే చేయిస్తారు. భక్తులే సేవకులు. ఇక్కడ వాతావరణం, ఆధ్యాత్మిక సేవలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ప్రతి యేటా ఇక్కడకు రావడం కోసం ఎదురు చూస్తుంటాను. ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాను. నేను నేర్చుకున్న విద్యను మరికొంత మందికి పరిచయం చేస్తుంటాను. ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రశాంతత దొరికే అతికొద్ది ప్రదేశాల్లో దేవీపురం ఒకటి. - షీల, అమెరికా నా అదృష్టం అమృతానందస్వామి శిష్యుడిగా అమ్మ సేవలో తరిస్తున్నాను. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిత్యం పాలుపంచుకుంటున్నాను. అమ్మవారి మీద ఉన్న అమితమైన భక్తి కారణంగా దేవీరథాన్ని సమకూర్చాను. అమ్మ సేవ చేసుకోవడం నా అదృష్టం. - విజయ్హరన్,యూకె -
పుష్కర ప్రణామం
అమావాస్యతో పోటెత్తిన భక్తులు గోదావరిలో పెద్దలకు పిండప్రదానం మూడో రోజు 45 వేల మంది భక్తుల రాక ఎండలతో ఇబ్బంది పడుతున్న భక్తులు మంచినీరు, నీడ కోసం తండ్లాట హన్మకొండ : అమావాస్య నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు గురువారం భక్తులు పోటెత్తారు. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం పుష్కరఘాట్లలో పెద్దలకు సంప్రదాయబద్ధంగా పిండప్రదానం చేశారు. అయితే మండుతున్న ఎండలతో భక్తులు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు, నీడ కోసం తండ్లాడారు. పుష్కరాల మూడో రోజున జిల్లాలో 45,000 మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొదటిరోజు 15,000 మంది భక్తులు రాగా... రెండో రోజు ఈ సంఖ్య 30,000కు చేరుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పుష్కరఘాట్లతో పోల్చితే జిల్లాలోని పుష్కరఘాట్లలో రద్దీ తక్కువగా ఉండడంతో భక్తులు ఇటువైపునకు మక్కువ చూపుతున్నారు. గురువారంమంగపేట పుష్కరఘాట్‌లో 35,000, రామన్నగూడెంలో 10,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రెండు ఘాట్లలో కలిపి దాదాపు ఆరువేలకు పైగా పిండప్రదానాలు జరిగినట్లు అధికారుల అంచనా. అయితే రామన్నగూడెం పుష్కరఘాట్‌కు బస్సులు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముల్లకట్ట పుష్కరఘాట్ వద్దకు గోదావరిలో నీటిని మళ్లించాలంటూ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు ముల్లకట్ట పుష్కరఘాట్‌కు కేటాయించిన పురోహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ముల్లకట్టకు భక్తులు రాకపోవడంతో తమకు ఇక్కడ ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇతర ఘాట్లకు కేటాయించాల్సిందిగా అధికారులను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు. జేసీ పర్యవేక్షణ పెరుగుతున్న భక్తుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలు, సహాయకార్యక్రమాలు కల్పించడంలో జిల్లా అధికారులు తలామునకలయ్యూరు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం రెండు ఘాట్లను పరిశీలించారు. రామన్నగూడెంలో కిలోమీటరున్నర దూరంలో ఉన్న గోదారి నీటిపాయ వద్దకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భక్తులు స్నానాలు ఆచరించే స్థలాల్లో మంచినీటి సౌకర్యం, షామియానాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రక్షిత మంచినీరు అందించేందుకు ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించారు. ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ రెండుఘాట్ల వద్దకు వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘాట్ల వద్ద ఇబ్బంది కలగకుండా మైకుల ద్వారా తగు సూచనలు చేయాలంటూ ఆదేశించారు. నది లోపల లోతైన ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు పడవల్లో తిరుగుతూ గస్తీ కాశారు. ములుగు డీఎస్పీ రాజామహేంద్రనాయక్ స్వయంగా పడవలో తిరిగి పరిశీలించారు. మంగపేట బస్‌స్టేషన్ నుంచి పుష్కరఘాట్ వరకు భక్తులను మినీబస్సులు, మ్యాజిక్‌ల ద్వారా తరలించారు. మంగపేటలో చలువ పందిళ్లు పుష్కరఘాట్‌లో స్నానాలు చేసే స్థలం వద్ద నీడను ఇచ్చే ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం ఉదయం మంగపేట పుష్కరఘాట్‌లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు కేవలం మూడు షామియానాలు ఏర్పాటు చేసినా.. అవి భక్తుల అవసరాలను తీర్చలేకపోయాయి. మరో తొమ్మిది రోజులు పుష్కరాలు కొనసాగాల్సి ఉన్నందున మరిన్ని చలువ పందిళ్లను నిర్మించాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. పుష్కరఘాట్లు, నదీలో పరిసరాలు శుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. రామన్నగూడెంలో పుష్కరఘాట్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో భక్తులు స్నానాలు చేసే చోట ఏర్పాటు చేసిన షామియానాలు పడిపోయాయి. రామన్నగూడెంలో సైతం చలువ పందిళ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎండవేడితో విలవిల పుష్కరఘాట్లకు వచ్చే భక్తులు ఎండవేడి మికి విలవిలలాడుతున్నారు. నదీతీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు సరిపోవడం లేదు. రామన్నగూడెంలో భక్తులను తరలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టరు సేవలు రెండో రోజుకే అర్ధంతరంగా ఆగిపోయాయి. మండే ఎండల్లో రానుపోనూ మూడుకిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. దీంతో భక్తులకు పుష్కరస్నానం భారంగా మారుతోంది. నదిలో భక్తులు నడిచివెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇసుక బస్తాల మార్గం వెంట నీడ ఇచ్చేందుకు చలువ పందిళ్లు, డ్రమ్ముల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు లేకపోవడంతో భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రత మరింత పెరిగితే భక్తులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి నీడ, నీరు సౌకర్యం కల్పించాల్సి ఉంది.