అర్చకులు లేని ఆలయం | rajarajeshwari matha special story | Sakshi
Sakshi News home page

అర్చకులు లేని ఆలయం

Published Tue, May 10 2016 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

అర్చకులు లేని ఆలయం

అర్చకులు లేని ఆలయం

యాగభూమిలో రాజరాజేశ్వరీమాత     
ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా దేవీపురం
అంతర్జాతీయ ఖ్యాతి పొందిన శ్రీచక్రాలయం 
భక్తుల చేతే అభిషేకాలు

అమ్మవారు బిందుస్థానంలో సృష్టికార్యంలో ఉన్న భంగిమలో ఉంటారు. గర్భాలయంలో మాత్రం నిండైన వస్త్రధారణతో దర్శనమిస్తారు.
పౌర్ణమి, అమావాస్య రోజులలో మాత్రమే అమ్మవారికి పంచామృతా  భిషేకాలు.

నేరుగా భక్తులే అభిషేకాలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. జలం, పాలు, పెరుగు, తేనే, పళ్ళరసాలతో అభిషేకాలు జరుపుతారు.
ప్రతి నెలా పౌర్ణమికి ముందు శ్రీవిద్యసాధన తరగతులు నిర్వహిస్తారు. ఇతర ఆధ్యాత్మిక సేవలపైనా శిక్షణ ఇస్తారు.
అమావాస్య తరువాత శ్రీ విద్యసాధన రెండో దశ ఉంటుంది.
అమ్మవారి రథం, అమృతానందస్వామి విగ్రహా ప్రతిష్టాపన చెప్పుకోదగినవి.
తొమ్మిది కొండల నడుమన మనోహర దృశ్యం.
దాపున అల్లుకుపోయిన ప్రకృతి పరవశం.
దారంతటా ఆకుపచ్చని తోటలు.. చుట్టూ జీడిమామిడి తోటల సోయగం.

 ఎటు చూసినా పచ్చదనంతో విలసిల్లుతున్న దేవీపురంలో ‘సహస్రాక్షి’ నామంతో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు భక్తుల కొంగుబంగారమై అలరారుతోంది.  శ్రీచక్ర మహాయంత్ర ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. ప్రపంచంలో శ్రీచక్ర యంత్రం ప్రమాణాలతో నిర్మించిన ఆలయం ఇదొక్కటే అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు అతి  చేరువలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నిత్యం వేలాది భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటోంది.

 దేవీ సంకల్పమే!
ఇక్కడ ఆలయ నిర్మాణం దైవ సంకల్పంతో జరిగిందనడానికి కథనాలు ఉన్నాయి.. ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌లో శాస్త్రవేత్తగా ఉన్న నిష్టల ప్రహ్లాదశాస్త్రి(అమృతానంద సరస్వతిస్వామీ)కి ధ్యానంలో అమ్మవారు కనిపించారని, అనువైన చోట తనకు నచ్చిన రీతిలో ఆలయం నిర్మించమని ఆదేశించారని కథనం. ఎన్నో ప్రాంతాలను సందర్శించిన ప్రహ్లాదశాస్త్రి ఓసారి విశాఖలోని ప్రహ్లాద కల్యాణ మండపంలో జరిగిన దేవీయాగానికి హాజరయ్యారు. అక్కడ అమ్మ శక్తి ఉందని ఎన్నో సంఘటనల ద్వారా శాస్త్రిగారికి తేటతెల్లమైంది.

దీంతో వేదుల, పుట్రేవు (దేవీపురం ఆలయ భూములు వీరివే) సోదరులను కలిశారు. దేవీ సన్నిధిలోనే శ్రీ చక్రాలయం నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. ప్రహ్లాదశాస్త్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో ఆలయ నిర్మాణంలో నిమగ్నమైపోయారు. 1983లో అమ్మవారిని ప్రతిష్టించగా 1985 నాటికి ఆలయం పూర్తయ్యింది. ఇక్కడ ఇగ్లూ నివాసాలను తలపించేలా నిర్మించిన డోమ్ ఇళ్ళు ప్రత్యేకార్షణ. పీఠంలో శివలింగాల సమూహం, దక్షవాటిలో ద్విసహస్ర లింగాల ఏర్పాటును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే!

 108 దేవతా మూర్తులు
శ్రీరాజరాజేశ్వరీ ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో 108 దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఐదు అంతస్తుల్లో ఉన్న శ్రీచక్రాలయంలో అణిమాసిద్దులు, బ్రహ్మాది శక్తులు, రుద్రాది శక్తులైన 28 మంది దేవతల విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. శ్రీచక్ర ఆలయం ప్రాంగణంలోని దేవతా విగ్రహాలను శృంగారభరిత భంగిమల్లో నిర్మించినా నగ్నత్వంలోనే దైవత్వం ఉందన్నది ఆధ్యాత్మిక వేత్తల విశ్లేషణ.

 ఖండాంతర ఖ్యాతి
శ్రీ విద్యసాధన వల్ల, ఆలయ ప్రత్యేకత వల్ల దేవీపురం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రాష్ట్రంలోని భక్తులతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. శ్రీచక్ర ఉపాసన విద్యలు నేర్చుకునేవారి సంఖ్య ఇక్కడ అధికం. చుట్టూ జీడిమామిడి, మామిడి తోటలతో పాటు పచ్చటి పొలాలు, కొండలు ప్రకృతికి ప్రతిరూపంగా ఉంటుంది ఈ ప్రాంతం. దీంతో ఉత్తరాంధ్రలోనే పెద్ద పిక్నిక్‌స్పాట్‌గా దేవీపురం పేరుగాంచింది.   - సమ్మంగి భాస్కర్, సాక్షి,పెందుర్తి, విశాఖపట్నం

ఇలా చేరుకోవచ్చు
ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖపట్నంలోని ద్వారకా బస్‌స్టేషన్‌కు దేవీపురం సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది  సబ్బవరం నుంచి 6 కిలోమీటర్ల దూరం. సబ్బవరం-అనకాపల్లి సరిహద్దులో దేవీపురం ఉంది  విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు 28 కిలోమీటర్ల దూరం
అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి 18 కిలోమీటర్లు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు సుమారు 20 కిలోమీటర్లు  దేవీపురానికి నర్సీపట్నం-ఆనందపురం జాతీయరహదారి (బైపాస్) రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

మతాలకు అతీతంగా!
కులమత భేదాలు, ఆర్థిక తారతమ్యాలు, వయసుతో ఇక్కడ పనిలేదు. కేవలం అమ్మవారి పట్ల భక్తి ఉంటే చాలు.
- కందర్బ ప్రభాకర్, ఆలయ నిర్వాహకులు

సేవలో తరిస్తాను
ఇక్కడ అమ్మవారి దివ్యరూపం చూడడం మాటల్లో చెప్పలేని అనుభూతి. నమ్మిన భక్తులకు ఏం కావాలో అమ్మకు తెలుసు. అమ్మ మీద ఉన్న భక్తితో ఆమెను కొలవడానికి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తాను. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటాను. ఇక్కడకు రావడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. - మహేశ్వరీ (సుందరమ్మ), ముంబై

 ఎదురుచూస్తుంటాను
ఇక్కడ ప్రత్యేకంగా అర్చకులు ఉండరు. నెలలో రెండుసార్లు మాత్రమే జరిగే అభిషేకాలను భక్తులతోనే చేయిస్తారు. భక్తులే సేవకులు. ఇక్కడ వాతావరణం, ఆధ్యాత్మిక సేవలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ప్రతి యేటా ఇక్కడకు రావడం కోసం ఎదురు చూస్తుంటాను. ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాను. నేను నేర్చుకున్న విద్యను మరికొంత మందికి పరిచయం చేస్తుంటాను. ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రశాంతత దొరికే అతికొద్ది ప్రదేశాల్లో దేవీపురం ఒకటి. - షీల, అమెరికా

 నా అదృష్టం
అమృతానందస్వామి శిష్యుడిగా అమ్మ సేవలో తరిస్తున్నాను. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిత్యం పాలుపంచుకుంటున్నాను. అమ్మవారి మీద ఉన్న అమితమైన భక్తి కారణంగా దేవీరథాన్ని సమకూర్చాను. అమ్మ సేవ చేసుకోవడం నా అదృష్టం.  - విజయ్‌హరన్,యూకె

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement