‘ఆసరా’ మొదలైంది..
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పింఛన్ల పంపిణీ జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది. రవాణా మంత్రి మహేందర్రెడ్డి చేతుల మీదుగా జిల్లాలోని పలు చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఆసరా’ పేరిట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర వర్గాల లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు అర్హుల గుర్తింపులో మార్గదర్శకాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో గతంలో పింఛన్లు పొందిన లబ్ధిదారులకు మొండిచేయి ఎదురైంది. అంతేకాకుండా కొన్నిచోట్ల లబ్ధిదారుల ఎంపికలో శాస్త్రీయత పాటించకపోవడంతో అర్హులకు కూడా పింఛన్లు అందని పరిస్థితి తలెత్తింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారం, ఉప్పరిగూడ గ్రామాల్లో వృద్ధులు, వికలాంగులు పంచాయతీ కార్యాలయాల ముందు ధర్నాకు దిగగా, కుల్కచర్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారుల తుది జాబితాలో కూడా చాలా పేర్లు గల్లంతయినట్లు తెలిసింది.
మరోవైపు ఈనెల 11 నుంచి గ్రామాల వారీగా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో.. దరఖాస్తుదారుల్లో టెన్షన్ మొదలైంది. ‘ఆసరా’ ఎంతమందికి ఎసరు తెచ్చిందోననే గందరగోళం ఏర్పడింది. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా, అడ్డగోలుగా లబ్ధిదారులను ఏరివేశారనే ప్రచారం నేపథ్యంలో అధికారపార్టీ నష్టనివారణ చర్యలకు దిగింది. అర్హత సాధించని దరఖాస్తుదారులు మరోసారి అర్జీ ఇస్తే పరిశీలించి న్యాయం చేస్తామనే భరోసా ఇస్తున్నారు.