యూజర్లకు ఫేస్బుక్ హెచ్చరిక
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన యూజర్లకు హెచ్చరికలు జారీచేసింది. తను ప్రవేశపెట్టిన కొత్త ఫోటో యాప్ మూమెంట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని లేకపోతే యూజర్ల ఫోటోలను వారి ఎఫ్ బీ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఇటీవలే ఫోటోలను సమీకరించే ఫీచర్ ను తన మెయిన్ మొబైల్ యాప్ నుంచి తొలగించింది. ఈ కోర్ ఫేస్ బుక్ యాప్ ద్వారా ఫోన్ లోని లోకల్ కెమెరా నుంచి ఆటోమేటిక్ గా ఫోటోలు ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ కు వెళ్లిపోతాయి. ఇవి యూజర్ల ప్రైవేట్ ఆల్బమ్ లో దాగిఉంటాయి. అవసరమైనప్పుడు ఫేస్ బుక్ లో తేలికగా షేరు చేసుకోవచ్చు.
కొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకపోతే ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ లోని యూజర్ల ఫోటోలను తొలగిస్తామని చెప్పింది. ఎవరైతే ఫేస్ బుక్ ఆటో సింక్ ఫీచర్ ను వాడుతున్నారో వారు జూలై 7 వరకు మూమెంట్స్ యాప్ ను డౌన్ లౌడ్ చేసుకోండి.. లేదా సింక్డ్ ఫోటో జిప్ ఫైల్ క్రియేట్ చేసుకోమని హెచ్చరిస్తోంది. లేదంటే ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి ఫోటోలనున తొలగిస్తామని బెదిరిస్తోంది. ఈ నిబంధన కేవలం ఆటో-సింక్డ్ ఫోటోలకేనని, పర్సనల్ గా అప్ లోడ్ చేసిన ఫోటోలకు వర్తించదని పేర్కొంది.
అయితే ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి ఫోటోలు తొలగిస్తామని యూజర్లకు వస్తున్న హెచ్చరికలపై భిన్న స్పందనలు వస్తున్నాయి. సింక్డ్ గా అన్ని ఫోటోలు అప్ లోడ్ చేశామని, అసలు ఆ విషయం తమకు గుర్తులేదని పేర్కొంటున్నారు.