ఎంఎన్‌పీ అంటేనే హడల్!
⇒ బీఎస్ఎన్ఎల్ అధికారుల నిర్లక్ష్యం
⇒ తిప్పలు పడుతున్న వినియోగదారులు
⇒ ప్రభుత్వరంగ నెట్‌వర్క్‌పై తీవ్ర అసంతృప్తి
⇒ వారాల తరబడి యాక్టివేషన్ కాని కొత్త సిమ్‌లు
తిరుపతి అర్బన్: మొబైల్ నంబర్ పోర్టబులిటి (ఎంఎన్‌పీ)... ఈ విధానంతో ఒక మొబైల్ నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారే వెసులుబాటు ఉంది. ఈ కొత్త విధానాన్ని ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
అయితే ఇప్పటికి కూడా ఈ విధానం అమలులో లోపాలు సరిదిద్దలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో కోరుకున్న నెట్వర్క్ సకాలంలో అందక, యాక్టివేషన్కాక వినియోగదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు.ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్లో ఆ అవస్థలు మరిన్ని ఎక్కువగా ఉంటున్నాయి. అందుకు సంస్థలోని సాంకేతిక విభాగం అధికారుల నుంచి సిబ్బంది వరకు నెలకొన్న నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణమని వినియోగదారులు మండిపడుతున్నారు.
పలువురు వినియోగదారులు కార్పొరేట్ మొబైల్ సంస్థల నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు మారేవారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లకు బీఎస్ఎన్ఎల్ అధికారులు చవిచూపుతున్న చేదు అనుభవాలతో ‘ఇక మాకు ఈ ప్రభుత్వ నెట్వర్కే వద్దు దేవుడా...’ అనే పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఒక్కసారి ఎంఎన్‌పీ కోసం బీఎస్ఎన్ఎల్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత వినియోగదారుని ప్రాంతంలోని జేటీవో లేదా టీటీఏ స్థాయి అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
అందుకోసం వినియోగదారుడు రోజుల తరబడి ప్రదక్షిణలు చేసినా ఆ అధికారులు అందుబాటులో ఉండరు. ఆ కారణంతో పోర్టబులిటీ పెట్టుకున్న నెట్వర్క్ సకాలంలో యాక్టివేషన్ కాకుండా ఒకవైపు, పాత నెట్వర్క్ సంస్థ నుంచి డిస్కనెక్ట్ చేసుకుని మరోవైపు వినియోగదారునికి అవస్థలు తప్పడం లేదు.బీఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయ కేంద్రం, జనరల్ మేనేజర్ కొలువైన తిరుపతిలోని వినియోగదారులకే ఎదురవుతున్న నిత్య అవస్థలు ఇవి.
జిల్లా మొత్తంలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవసరమయ్యే ఎలాంటి సేవలనైనా క్షణాల్లో జీఎం కార్యాలయం ద్వారా అందించేంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది. వినియోగదారులు తమకు కావాల్సిన ఏ సేవలకైనా నేరుగా ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. అయితే ఇక్కడి అధికారులు సవాలక్ష ఆంక్షలు ఉన్నాయని చెప్పి మళ్లీ వినియోగదారులను ఆయా ఎక్స్చేంజీల అధికారుల వద్దకు వెళ్లాలని సెలవిస్తున్నారు.
దీంతో ప్రధాన కార్యాలయం అధికారులు చెప్పే సలహాలు విని ఆయా ప్రాంతాల అధికారుల వద్దకెళ్తే ఇక వారు రోజుల తరబడి అందుబాటులో ఉండరు. ఇలాంటి అవస్థలు నగరంలోని వినియోగదారులకే నిత్యం ఎదురవుతుంటే ఇక మారుమూల ప్రాంతాల్లోని వారికి ఎదురవుతున్న అవస్థలు ఏ పాటివో అర్థం చేసుకోవచ్చు.
యాక్టివేట్ కాని కొత్త సిమ్‌లు...
ఎంఎన్‌పీ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసుకున్న బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ, స్మార్ట్ ఫోన్ సిమ్‌లు వారాల తరబడి యాక్టివేషన్‌కు నోచుకోవడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఒక్కసారి ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్కు ఎంఎన్‌పీ ద్వారా మార్పు చేసుకుంటే 48 గంటల్లో సిమ్ యాక్టివేట్ కావాల్సి వుంది.
అయితే స్థానిక టెక్నికల్, సిమ్ విభాగాల అధికారుల నిర్లక్ష్య ధోరణితో వేలాది మంది ఎంఎన్‌పీ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ఎంఎన్‌పీ ద్వారా తీసుకునే సిమ్ పోస్టుపెయిడ్ అయితే డిపాజిట్ కూడా వేలల్లో ఉంటుంది. దీంతో వినియోగదారునికి ఆర్థిక కష్టాలూ తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా బీఎస్ఎన్ఎల్ జీఎం తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
అన్ని సేవలు ఇక్కడే అందేలా చర్యలు:
బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో అన్ని సేవలు ఇప్పటికే ఆన్లైన్ అనుసంధానంతో కొనసాగుతున్నాయి. వాటిలో ఎంఎన్‌పీకి సంబంధించిన సిమ్ యాక్టివేషన్, వెరిఫికేషన్ వంటి కార్యక్రమాలను ఆయా ప్రాంతాల జేటీవోలకు కాకుండా ఇక్కడే జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. కొత్త సిమ్ల యాక్టివేషన్ విషయమై టెక్నికల్ విభాగంలో, సేల్స్ కౌంటర్లలో విచారించి సమస్యను పరిష్కరిస్తాం. - ఎంఎస్ఏ న్యూటన్, బీఎస్ఎన్ఎల్ జీఎం, తిరుపతి టెలికం జిల్లా