మూడు.. నాలుగు!
సంక్లిష్టంగా మారిన జిల్లాల పునర్విభజన
మంత్రుల కమిటీతో ప్రజాప్రతినిధుల భేటీ
జనగామ జిల్లాపై ఎమ్మెల్యే విజ్ఞప్తులు
‘స్టేషన్’ సెగ్మెంట్‌ను కలపాలన్న రాజయ్య
పాలకుర్తి మొత్తాన్ని విలీనం చేయాలని ఎర్రబెల్లి లేఖ
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేక సెగ
పసునూరి, కొండా మురళి, చల్లా డుమ్మా...
సాక్షి ప్రతినిధి, వరంగల్
కొలిక్కి వచ్చిందని భావించిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ మళ్లీ సంక్లిష్టంగా మారుతోంది. వరంగల్ జిల్లాను వరంగల్, మహబూబాబాద్, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి) జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాజాగా జనగామ జిల్లా ఏర్పాటుపైనా జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రుల కమిటీకి లేఖలు ఇచ్చారు. దీంతో ఏ మండలాలు ఏ జిల్లాలో ఉంటాయనే విషయంపై అస్పష్టత మరింత పెరుగుతోంది. జిల్లాల పునర్విభజనపై ఏర్పాౖటెన మంత్రుల కమిటీ... మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో కూడిన కమిటీ.. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను ముందుగా ప్రజాప్రతినిధులకు వివరించింది. అనంతరం జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ అంశాలు ఇవీ...
మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనల్లో పేర్కొనడంపై మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని మంత్రుల కమిటీని కోరారు.
జనగామ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంత్రుల కమిటీని కోరారు. ఈ మేరకు నలుగురి సంతకాలతో కూడిన లేఖను మంత్రుల కమిటీకి అందజేశారు. జిల్లాకు కావల్సిన అన్ని సౌకర్యాలు జనగామకు ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల కోసం కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. 175 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున జిల్లా ఏర్పాటుకు జనగామ అన్ని విధాలుగా సరైనదేనని తెలిపారు.
జనగామ జిల్లా ఏర్పాటుకు అన్ని రకాలుగా సరైనదనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రుల కమిటీకి ప్రత్యేకంగా లేఖ ఇచ్చారు. ‘నా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.
జిల్లాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు జనగామకు ఉన్నాయని, జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ‘నా పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.
జనగామ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతోకాలంగా ప్రజల్లో ఉందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలను కలుపుతూ జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని రెండు సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
నర్సంపేట నియోజకవర్గం మొత్తాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వ ప్రతిపాదనలలో పేర్కొనడంపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. నెక్కొండ, చెన్నారావుపేట మండలాలపై ఎలాంటి ఒత్తిడి వచ్చినా ప్రస్తుత ప్రతిపాదనలనే కొనసాగించాలని కోరారు.
జిల్లాల పునర్విభజనతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందని, ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, అరూరి రమేశ్, ఎమ్మెల్సీలు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రుల కమిటీకి తెలిపారు.
జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ నిర్వహించిన కీలక సమావేశానికి వరంగల్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరుకాలేదు.
స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలను జనగామ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ప్రతిపాదనలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఇద్దరు ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై ఆయా నియోజకవర్గాల్లోని ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రాయపర్తి, తొర్రూరు మండలాల్లో ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాజా ప్రతిపాదనల అంశం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ జరుగుతోంది.
మంత్రుల కమిటీ జిల్లా ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ప్రతిపాదనలు
వరంగల్ జిల్లా : వరంగల్, హన్మకొండ, హసన్‌పర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, శాయంపేట, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, çహుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాలు.
ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం.
మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, కొడకండ్ల, కొత్తగూడ, గార్ల, బయ్యారం.