కొత్త బండి మోజు తీరకుండానే చలాన్ల మోత.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కొత్త బండి మోజు తీరకుండానే చలాన్లు మోత మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదవుతున్నాయి. ఆర్సీలు లేకుండా నడుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు. నిజానికి తప్పిదం తమది కాకపోయినా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల నుంచి వాహనదారులకు సకాలంలో ఆర్సీ స్మార్ట్‌కార్డులు అందకపోడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. కొత్త బండి కొనుగోలు చేసిన సంతోషం క్షణాల్లో ఆవిరవుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏలో వాహనం నమోదైన వారం, పది రోజుల్లోనే స్మార్ట్‌కార్డు ఇంటికి చేరాల్సి ఉండగా, అందుకు విరుద్దంగా నెలలు గడిచినా కార్డులు రావడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత వల్లనే ఈ జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌కార్డుల నాణ్యత పెంచేందుకు ఇటీవల పాత కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. కానీ దాని స్థానంలో కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణాశాఖకు స్మార్ట్‌కార్డుల మెటీరియల్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల స్మార్ట్ కార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో కొరత ఏర్పడింది. ఇది వాహనదారులకు ఆర్థిక భారంగా మారింది. గ్రేటర్లో వేలల్లో డిమాండ్గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు చెల్లించిన అనంతరం స్మార్ట్‌కార్డుల్లో హైపతికేషన్ రద్దు కోసం వచ్చే వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకంటే హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీల కోసం ముద్రించే స్మార్ట్‌కార్డులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రెండు కేటగిరీల్లో కనీసం రోజుకు 5,000 కార్డులను ప్రింట్ చేసి స్పీడ్ పోస్టు ద్వారా వాహనదారులకు చేరవేయాల్సి ఉంటుంది. ఒక్కో కార్యాలయం నుంచి సుమారు 500 కార్డులకు డిమాండ్ ఉంటుంది. కానీ ఇందుకు తగిన విధంగా కార్డుల మెటీరియల్ లేకపోవడం వల్ల కొరత తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా కార్డుల కొరత ఉండగా, సెప్టెంబర్ నాటికి 40 వేలకు పైగా అందజేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త కార్డుల సరఫరాకు ఒప్పందం ఏర్పడనుందని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో కార్డులను జారీ చేస్తామని తెలిపారు. కానీ ప్రస్తుతం నెలకొన్న జాప్యం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ‘హైపతికేషన్ కాన్సిల్ చేసుకొని నెల దాటింది. కానీ ఇప్పటి వరకు కార్డు రాలేదు. బండి బయటకు తీయాలంటే భయమేస్తోంది..’ అని తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే చలాన్ల పేరిట రూ.300 చెల్లించినట్లు చెప్పారు. మరోవైపు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని, గంటల తరబడి పడిగాపులు కాసినా అధికారులు స్పందించడం లేదని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశారు.ఒక్కో కార్డు రూ.685డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం ఆర్టీఏకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సుల కేటగిరీ మేరకు రూ.685 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. ఆర్సీలకు మాత్రం రూ.685 వరకు చెల్లించాలి. ఇందులో సర్వీస్ చార్జీల రూపంలో రూ.400, స్మార్ట్‌కార్డుకు రూ.250 చొప్పున చెల్లించాలి. మరో రూ.35 స్పీడ్‌పోస్ట్ చార్జీలు చెల్లించాలి. ఇలా అన్ని చార్జీలు కలిపి ముందే చెల్లించినా నెలల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం గమనార్హం. చదవండి: ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటుసారథి వస్తే ఆన్లైన్లోనే.. మరోవైపు తరచూ కార్డుల జారీలో నెలకొంటున్న జాప్యం, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆధార్ తరహా ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని అధికారులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న సారథి సాంకేతిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలైతే ఈ సేవా కేంద్రాల నుంచే స్మార్ట్ కార్డులను అందజేసే అవకాశం ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఇందుకు మరి కొంత సమయం పట్టవచ్చు.