new visa system
-
ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్ హోం’ అక్కడే పదేళ్లు పండగ!
న్యూఢిల్లీ: ఇండోనేషియా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కొత్త వీసాను తీసుకొచ్చింది. ఇందుకోసం ‘సెకండ్ హెమ్ వీసా’ ప్రోగ్రామ్‌ను తీసు కొచ్చింది. ఈ వీసా ద్వారా పర్యాటకులు బాలిలో గరిష్టంగా 10 సంవత్సరాలు నివసించవచ్చు. అంతేకాదు ఈ వీసాతో, విదేశీయులు ఐదు లేదా పదేళ్ల పాటు పెట్టుబడి, ఇతర కార్యకలాపాలు వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న వర్గాలు ఈ వీసా ద్వారా దీర్ఘకాలికంగా ఇక్కడ బస చేవయచ్చని ఇండోనేషియా తాజాగా ప్రకటించింది. బాలి సహా అనేక ఇతర పాపులర్ టూరిస్ట్ ప్రదేశాలకు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే దీని లక్ష్యం అని ఇమ్మిగ్రేషన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ విడోడో ఏకత్జాజానా మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. ఈ విధానం క్రిస్మస్ రోజున లేదా కొత్త నిబంధన జారీ చేసిన 60 రోజుల తర్వాత అమలులోకి వస్తుందని తెలిపారు. ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కొంతమంది విదేశీయులకు ఇది ఆర్థికేతర ప్రోత్సాహకమని విడోడో ఎకత్జాజానా వ్యాఖ్యానించారు. తాజా ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాల్లో కనీసం 130,000 డాలర్లు (కోటి 60 లక్షల రూపాయలకు పైనే) ఉన్నవారు కొత్త “సెకండ్ హోమ్ వీసా” పొందడానికి అర్హులు. ఆ దేశ అధికారిక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నిబంధనలకు ప్రకారం ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు విమానయాన సంస్థ ఇండోనేషియా గరుడ అంతర్జాతీయ విమానాలను పునః ప్రారంభించడంతో ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజు కోనుందని భావిస్తున్నారు. దీనికి తోడు బాలిలో నవంబర్‌లో జరిగే G-20 సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు తరలి రానున్నారు. దీంతో భారీ ఆదాయాన్ని ఇండోనేషియా ఆశిస్తోంది. -
హెచ్4 వీసాదారులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలోని హెచ్–4 వీసాదారులు ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే ఒక బిల్లును కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎందరో భారతీయులతో పాటు, విదేశాల నుంచి వచ్చే జీవిత భాగస్వామ్యులకు మేలు జరుగుతుంది. భర్త లేదా భార్యల వెంట అమెరికాకి వెళ్లే వారు వెంటనే హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. హెచ్–1బి, హెచ్–2ఏ, హెచ్–2బీ, హెచ్–3 తదితర వీసాలపై అమెరికా వెళ్లే వారి జీవిత భాగస్వామికి, పిల్లలకి హెచ్–4 వీసా ఇస్తారు. ఇన్నాళ్లూ హెచ్–4 వీసాదారులు ఉద్యోగాలు చేయాలంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి దరఖాస్తు చేసుకోవాలి. దానిని పరిశీలించి ఇమ్మిగ్రేషన్ శాఖ వర్క్ పర్మిట్ ఇవ్వడానికి ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది. అప్పుడే వారు ఉద్యోగం చేయడానికి వీలు కలిగేది. ఈ బిల్లు కాంగ్రెస్‌లో ఆమోదం పొందితే ఇక వర్క్ పర్మిట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసే కార్మికులకు కొరత ఉండడంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగం చేసే అవకాశం లభించేలా ఈ బిల్లుకి రూపకల్పన చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కరోలిన్ బూర్డెక్స్, మారియా ఎల్విరల సలాజర్‌లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలో కార్మికుల కొరత వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోందని వలసదారులకి ఆటోమేటిక్‌గా ఆ హక్కు వస్తే ఇరుపక్షాలకు మేలు జరుగుతుందని వారు చెప్పారు. వీసాలు వృథా కాకుండా బిల్లు ఎవరూ వినియోగించుకోకుండా మిగిలిపోయిన 3 లక్షల 80 వేలకు పైగా కుటుంబ, ఉద్యోగ ఆధారిత వీసాలు వృథా కాకుండా కొందరు కాంగ్రెస్ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసాలు వినియోగించుకోవడానికి వీలు కల్పించేలా ఒక బిల్లును కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్ కార్డు బాక్లాగ్ల సంఖ్య తగ్గి భారత్, చైనా నుంచి వచ్చి అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి అవకాశం లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్ శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 2,22,000 కుటుంబ ఆధారిత వీసాలు, 1,57,000 ఉద్యోగ ఆధారిత వీసాలు ఎవరూ వినియోగించుకోకుండానే మిగిలిపోయాయి. -
టాలెంట్ ఉంటే చాలు.. ఇక వీసా ఈజీ
అబుదాబి: అమెరికాలో హెచ్ 1 బి వీసాల విషయంలో అనేక గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాత్రం టాలెంట్‌కు పెద్దపీట వేస్తూ కొత్త వీసా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఆయా రంగాల్లో ప్రతిభను గుర్తించి అలాంటి వారిని ఎక్కువగా ఆకర్షించడానికి వీలుగా కొత్త వీసా విధానాన్ని రూపొందించనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వేలాదిగా ఇప్పటికే యూఏఈ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. విదేశీయులకు ప్రధానంగా నిర్మాణ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఇకనుంచి విద్య, వైద్యం, టూరిజం, సైన్స్, రీసర్చ్ వంటి రంగాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా 150 కి పైగా దేశాలకు చెందిన వారు ఆయా రంగాల్లో అక్కడ పనిచేస్తున్నారు. తాజాగా కీలక రంగాల్లో "క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్" కు పెద్దపీట వేయాలని యూఏఈ నిర్ణయించింది. యూఏఈ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశం ఈ మేరకు తీర్మానించింది. అత్యున్నత అర్హత కలిగిన ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించాల్సిన అవసరం ఉందని కేబినేట్ అభిప్రాయపడింది. యూఏఈ అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ 'ల్యాండ్ ఆఫ్ అపర్చునిటీస్' గా మంచి వాతావరణం కల్పించామని, ఈ నేపథ్యంలో యూఏఈ కి వచ్చే వారిలో టాలెంట్‌ను ఎక్కువగా ఆకర్షించడానికి కొత్త వీసా విధానం అమలు చేయబోతున్నట్టు వివరించారు. ప్రధానంగా టూరిజం, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించి ఆ రంగాల్లో నిపుణులకు అధికంగా వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే మెడిసిన్, సైన్స్- రీసర్చ్ రంగాల్లో కూడా ఎక్కువ వీసాలు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇకపోతే వివిధ దేశాలతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి రాజధాని అబుదాబిలో అన్ని దేశాలు ఎంబసీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలు కల్పించాలని నిర్ణయించారు.