నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు
నేడు ఎన్నికల నోటిఫికేషన్
మూడు జిల్లాల అభ్యర్థులు
నల్లగొండలోనే దరఖాస్తు చేయాలి
26న కొత్త ఓటర్ల జాబితా ప్రకటన
నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ మండలి స్థానానికి గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈనెల 11న ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియ ప్రా రంభించేందుకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న మూడు జిల్లాల అ భ్యర్థుల నామినేషన్లు నల్లగొండ జిల్లాలోనే దా ఖలు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. అరుుతే నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కలెక్టరేట్‌కు వంద మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపేస్తారు.
నేటితో ఓటరు నమోదు ఆఖరు
ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే నాటికి మూడు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 2,62,582 మంది ఉన్నారు. అయితే జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దీంతో బుధవారం సాయంత్రానికి జిల్లాలో 970 మంది కొత్తగా ఓటరు నమోదు చేసుకున్నారు. కాగా, ఓటరు నమోదుకు గురువారంతో గడువు ముగుస్తుంది. కొత్తగా ఓటరు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆధారంగా చేసుకుని ఈనెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి విచారించడంతోపాటు ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరిస్తారు. ఈనెల 26వ తేదీన నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. అదే రోజున పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. అన్ని రాజకీయ పక్షాలకు, పోటీ లో ఉన్న అభ్యర్థులకు ఓటర్ల జాబితా అందజేస్తారు.