new zone
-
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఒక జోన్.. ఏడు ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది ఈ మరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్, పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సీఎంకు ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు శంషాబాద్ జోన్ పరిధిలో శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. వీటిలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు కలిపి రాజేంద్రనగర్ జోన్‌గా.. అలాగే శంషాబాద్, షాద్‌నగర్ డివిజన్లు కలిపి శంషాబాద్ జోన్‌గా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు మాదాపూర్ జోన్ పరిధిలో ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్‌ను తొలగించి... కొత్తగా ఏర్పాటు కానున్న రాజేంద్రనగర్ జోన్లో కలపనున్నారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ), జోన్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ) స్థాయి అధికారి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. సైబరాబాద్ పునర్ వ్యవస్థీకరణపై ‘సైబరాబాద్ సరికొత్తగా..’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కొత్త ఠాణాల ఏర్పాటు కూడా.. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతలు, 14 ట్రాఫిక్ ఠాణాలు, 7 వేల మంది పోలీసులున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్‌లో ఏడు కొత్త ఠాణాల ఏర్పాటుపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీపురం ఠాణా పరిధిలో ఉన్న కొల్లూరు, నార్సింగి పీఎస్ పరిధిలోని జన్వాడ, శంకర్పల్లి స్టేషన్ పరిధిలోని మోకిల ప్రాంతాలను విభజించి.. కొత్తగా కొల్లూరు, జన్వాడ, మోకిల ఠాణాలను ఏర్పాటుకు రూటు క్లియరైంది. ఇటీవలే కొత్తగా మేడ్చల్ ట్రాఫిక్ పీఎస్‌ను ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జోన్ ఏర్పాటు, ఠాణాల పెంపుతో పరిపాలన సులువవటంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
పోలీసు శాఖలో కొత్త జోన్లు, రేంజ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటు అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖలోనూ జోన్ల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పోలీసు శాఖలో హైదరాబాద్, వరంగల్ రెండు జోన్లు ఉన్నాయి. వీటికి ఐజీ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం మరో మూడు కొత్త జోన్లను ఏర్పాటు చేస్తే పోలీసు శాఖలోనూ జోన్ల ఏర్పాటు తప్పదని.. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో జరిగిన ఐపీఎస్ అధికారుల భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. జోన్లను బట్టి కొత్త రేంజ్‌లు ప్రస్తుతం పోలీసు శాఖలోని రెండు జోన్ల కింద హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ పోలీస్ రేంజ్‌లు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఒక్కో రేంజ్ కింద రెండు, మూడు జిల్లాల పోలీసు యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం ఆరు నుంచి ఎనిమిది జిల్లాల పోలీసు యూనిట్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో మూడు జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తుండడంతో.. పోలీసు శాఖ పరిధిలోనూ మరో మూడు జోన్లు, వాటి కింద రెండు చొప్పున రేంజ్‌ల ఏర్పాటు అవసరం ఉంటుందని అధికారుల భేటీలో డీజీపీ పేర్కొన్నారు. దాంతో రాష్ట్రం మొత్తంగా ఐదు జోన్లు, 10 రేంజ్‌లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అంతా రాష్ట్ర కేడరే! పోలీసు శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ర్యాంకు వరకు అధికారులు, సిబ్బందిని కూడా రాష్ట్ర కేడర్‌గా గుర్తించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా అధికారులను డీజీపీ ఆదేశించారు. ఇందులో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలను ఆయా రేంజ్‌ల పరిధిలో వినియోగించుకోవాలని భేటీలో నిర్ణయించారు. పాత జిల్లాల ప్రకారం ఒక రేంజ్ కింద రెండు మూడు జిల్లాలున్నాయి. కానిస్టేబుళ్లను ఆ జిల్లాల పరిధిలో బదిలీ చేసేలా అధికారాలను డీఐజీలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇక పోలీసు శాఖలో రాష్ట్రం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఒకే సీనియారిటీ జాబితాను డీజీపీ కార్యాలయం తయారుచేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. మరోవైపు ఇప్పటివరకు ఎస్సై స్థాయి అధికారుల నియామకం రేంజ్‌ల పరిధిలో జరిగింది. వాటి పరిధిలోని జిల్లాల్లోనే ఎస్సైలు పనిచేయాల్సి ఉండేది. తాజాగా ఎస్సైలను రాష్ట్ర కేడర్‌గా పరిగణనలోకి తీసుకోనుండడంతో.. వారిని రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా పనిచేయించుకునేలా విధానాలు రూపొందించనున్నట్టు డీజీపీ పేర్కొన్నారు. ఇక ఇన్స్పెక్టర్లు జోన్ పరిధిలో పనిచేసేవారు.. వారిని కూడా రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నేటి సమావేశాన్ని బట్టి.. జోన్ల విభజనకు సంబంధించి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించనున్నట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. జోన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తే.. ఆ జోన్ల సంఖ్యను బట్టి తాము పోలీసు శాఖలో ఎన్ని జోన్లు, ఎన్ని రేంజ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నది తేలుతుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఏయే జిల్లా ఏయే జోన్ కిందకు, ఏయే రేంజ్ పరిధిలోకి వెళ్తుందన్న దానిపై మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందన్నారు. -
తెలంగాణలో కొత్త మండల చిచ్చు
-
నెరవేరనున్న మండల కల
డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్‌కు చోటు సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు కల్హేర్: కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్ పేరు ఉండడంతో ప్రజల దశాబ్దాల కలకు అడుగు పడినట్టు అయ్యింది. చాలా కాలంగా మండల ఏర్పాటు కోసం సిర్గాపూర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ కళ సాకారం కానుంది. కల్హేర్ మండలంలో సిర్గాపూర్ ఓ పెద్ద గ్రామం. ఈ గ్రామానికి మండల హోదా కల్పిస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ప్రజలు భావించారు. ఇదే డిమాండ్‌ను చాలా కాలంగా వినిపిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో సిర్గాపూర్‌కు కలిసొచ్చింది. చాలా కాలంగా మండలం కోసం నిరీక్షిస్తున్న ప్రజల ఆకాంక్షను అధికారులు, ప్రభుత్వం గుర్తించింది. మండల ఏర్పాటుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్నాయని బేరీజు చేసుకొని ఆ దిశగా అడుగులు వేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్‌కు చోటు కల్పించింది. దీంతో ఇక్కడి ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. త్వరలో మా గ్రామం కూడా మండల కేంద్రం అవుతుందని సంతోష పడుతున్నారు. ఇదిలా ఉండగా సమీపంలో ఉన్న పంచాయతీలు కూడా సిర్గాపూర్ మండల కేంద్రం అయితే మేలు జరుగుతుందని, అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. దసరా నుంచి కొత్త మండలంలో మా జీవితాలు ప్రారంభమవుతాయని సిర్గాపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాట నిలుపుకున్న పాలకులు ఖేడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో సిర్గాపూర్‌లో పర్యటించిన నాయకులు, ప్రజాప్రతినిధులు మండల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ప్రజలకు కూడా నమ్మకం కలిగింది. అనుకున్నట్లే ప్రజల ఆకాంక్ష మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్‌కు స్థానం కల్పించారు. మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మండలంలో చేరిన గ్రామాలు కల్హేర్ మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు, 41 తండాలు ఉన్నాయి. సిర్గాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేయడంతో పలు గ్రామాలు విలీనమయ్యాయి. సిర్గాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు కానుంది. కల్హేర్ మండలంలోని సిర్గాపూర్, కడ్పల్, ఖాజాపూర్, గోసాయిపల్లి, పోచాపూర్, బోక్కస్‌గాం, చిన్న ముబారక్పూర్, పెద్ద ముబారక్పూర్, అంతర్గాం, సుల్తానాబాద్, కంగ్టీ మండలంలోని చీమాల్పాడు, గర్డెగాం, సంగెం, వాసర్, పోట్పల్లి, నాగన్‌పల్లి, వంగ్దాల్, గౌడ్గాం(కె), గాజుల్పాడు, బాన్స్వాడ(డి), దామర్గ్ది(పిఎం), నారాయణఖేడ్ మండలంలోని ఉజలంపాడ్ను కలిపి సిర్గాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సిర్గాపూర్ మండలం జనాభా 35,004 ఉండనుంది. గర్వించ దగ్గ అంశం సిర్గాపూర్ కేంద్రంగా మండలం ఏర్పాటు కానుండడం మాకు గర్వంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో దశాబ్దాల కళ సాకారం కానుంది. సిర్గాపూర్‌లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మండల ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. - మనీష్‌పాటిల్, సర్పంచ్, సిర్గాపూర్ మాట నిలబెట్టుకున్నారు సిర్గాపూర్‌ను మండలంగా చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వారి మాటను నిలుపుకున్నారు. గ్రామస్తుల విన్నపాన్ని మన్నించి మండలం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. - సంజీవరావు, ఎంపీటీసీ, సిర్గాపూర్