నెరవేరనున్న మండల కల | sirgapur.. dreams come true | Sakshi
Sakshi News home page

నెరవేరనున్న మండల కల

Published Sat, Aug 27 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

సిర్గాపూర్‌ గ్రామం

సిర్గాపూర్‌ గ్రామం

  • డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో సిర్గాపూర్‌కు చోటు
  • సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
  • కల్హేర్‌: కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో సిర్గాపూర్‌ పేరు ఉండడంతో ప్రజల దశాబ్దాల కలకు అడుగు పడినట్టు అయ్యింది. చాలా కాలంగా మండల ఏర్పాటు కోసం సిర్గాపూర్‌ ప్రజలు ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ కళ సాకారం కానుంది. కల్హేర్‌ మండలంలో సిర్గాపూర్‌ ఓ పెద్ద గ్రామం.

    ఈ గ్రామానికి మండల హోదా కల్పిస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ప్రజలు భావించారు. ఇదే డిమాండ్‌ను చాలా కాలంగా వినిపిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో సిర్గాపూర్‌కు కలిసొచ్చింది. చాలా కాలంగా మండలం కోసం నిరీక్షిస్తున్న ప్రజల ఆకాంక్షను అధికారులు, ప్రభుత్వం గుర్తించింది.

    మండల ఏర్పాటుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్నాయని బేరీజు చేసుకొని ఆ దిశగా అడుగులు వేసింది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో సిర్గాపూర్‌కు చోటు కల్పించింది. దీంతో ఇక్కడి ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. త్వరలో మా గ్రామం కూడా మండల కేంద్రం అవుతుందని సంతోష పడుతున్నారు.

    ఇదిలా ఉండగా సమీపంలో ఉన్న పంచాయతీలు కూడా సిర్గాపూర్‌ మండల కేంద్రం అయితే మేలు జరుగుతుందని, అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. దసరా నుంచి కొత్త మండలంలో మా జీవితాలు ప్రారంభమవుతాయని సిర్గాపూర్‌ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    మాట నిలుపుకున్న పాలకులు
    ఖేడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో సిర్గాపూర్‌లో పర్యటించిన నాయకులు, ప్రజాప్రతినిధులు మండల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ప్రజలకు కూడా నమ్మకం కలిగింది. అనుకున్నట్లే ప్రజల ఆకాంక్ష మేరకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో సిర్గాపూర్‌కు స్థానం కల్పించారు. మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

    కొత్త మండలంలో చేరిన గ్రామాలు
    కల్హేర్‌ మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు, 41 తండాలు ఉన్నాయి. సిర్గాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేయడంతో పలు గ్రామాలు విలీనమయ్యాయి. సిర్గాపూర్‌ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు కానుంది. కల్హేర్‌ మండలంలోని సిర్గాపూర్‌, కడ్పల్‌, ఖాజాపూర్‌, గోసాయిపల్లి, పోచాపూర్‌, బోక్కస్‌గాం, చిన్న ముబారక్‌పూర్‌, పెద్ద ముబారక్‌పూర్‌, అంతర్‌గాం, సుల్తానాబాద్‌, కంగ్టీ మండలంలోని చీమాల్‌పాడు, గర్డెగాం, సంగెం, వాసర్‌, పోట్‌పల్లి, నాగన్‌పల్లి, వంగ్దాల్‌, గౌడ్‌గాం(కె), గాజుల్‌పాడు, బాన్స్‌వాడ(డి), దామర్‌గ్ది(పిఎం), నారాయణఖేడ్‌ మండలంలోని ఉజలంపాడ్‌ను కలిపి సిర్గాపూర్‌ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సిర్గాపూర్‌ మండలం జనాభా 35,004 ఉండనుంది.

    గర్వించ దగ్గ అంశం
    సిర్గాపూర్‌ కేంద్రంగా మండలం ఏర్పాటు కానుండడం మాకు గర్వంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో దశాబ్దాల కళ సాకారం కానుంది. సిర్గాపూర్‌లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మండల ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. - మనీష్‌పాటిల్‌, సర్పంచ్‌, సిర్గాపూర్‌

    మాట నిలబెట్టుకున్నారు
    సిర్గాపూర్‌ను మండలంగా చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వారి మాటను నిలుపుకున్నారు. గ్రామస్తుల విన్నపాన్ని మన్నించి మండలం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. - సంజీవరావు, ఎంపీటీసీ, సిర్గాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement