ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిందే. ఈ నేపథ్యంలో ఆ వాహనాల్ని రద్దు చేస్తూ..స్క్రాప్‌గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
2023,ఏప్రిల్ 1 నుంచి దేశంలో 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేయనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖల బస్సులు, ఇతర వాహనాలకు ఈ కొత్త నియమం తప్పనిసరి. రాబోయే ౩౦ రోజుల్లో దీనికి సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది. అధికారిక వెబ్‌సైట్ comments-morth@gov.in కు పంపించాలని కోరింది.
స్క్రాప్‌గా మార్చేస్తాం
15 ఏళ్లు పైబడిన భారత ప్రభుత్వ వాహనాలన్నింటినీ స్క్రాప్ (చెత్త) గా మారుస్తామని, దీనికి సంబంధించిన విధి, విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు అగ్రికల్చర్ కార్యక్రమం 'ఆగ్రో విజన్' ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓల్డ్ గవర్నమెంట్ వెహికల్స్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారిక ఫైల్‌లో సంతకం చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలకు పంపాను. ఆయా ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అమలు చేయాలని కోరారు.
వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ
2021లో వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ పాలసీ ద్వారా పరిశ్రమకు మూడు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. అందులో పాత వాహనాల నుండి వెలువడే ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించడానికి సహాయపడుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభసాటిగా మారుతుంది. ఎందుకంటే పాత వాహనాలను కొత్త వాహనాలతో భర్తీ చేసేలా డిమాండ్‌ను పెంచుతుంది. ఉక్కు పరిశ్రమ కోసం చౌకైన ముడి పదార్థాలు స్క్రాప్ మెటీరియల్ నుండి లభిస్తాయి. ఈ చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించేందుకు దోహద పడతాయని కేంద్రం అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment